ఏపీ ప్రజలకు సీఎం జగన్ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. మాతృభాష అంటేనే మన ఉనికి, అస్తిత్వమని పేర్కొన్నారు. జీవన విధానానికి మూలాధారం మాతృభాషని, తెలుగు భాషను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన ట్వీట్ చేశారు.
తెలుగుపై మరీ అంత మమకారమా?
ఏపీ సీఎం జగన్.. మాతృభాష దినోత్సవం సందర్భంగా తన విలక్షణతను మరోసారి చాటుకున్నారు. తన కత్తికి రెండు వైపులా పదునుందని చాటుకున్నారు. నిన్న మొన్నటిదాకా తెలుగుతో ఉపయోగం లేదని, అందరూ ఇంగ్లీషు నేర్చుకుని, ఇంగ్లీషు మీడియంలోనే చదువుకోవాలని సెలవిచ్చిన ఆయన.. నేడు మాతృభాషను పరిరక్షించుకోవాలంటూ పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉంది. మాతృభాష గొంతు కోసి అంపశయ్యపై పడుకోబెట్టిన ఈ ఘనుడు.. మాతృభాషను పరిరక్షించుకోవాలంటూ సందేశాలివ్వడం తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం! ప్రాథమిక స్థాయి నుంచే బడుల్లో తెలుగుకు మంగళం పాడేసి.. ఇంగ్లీషు విద్యకు పట్టంకట్టిన ఆయనకు.. అసలు తెలుగు పేరెత్తే అర్హత ఉందా? తెలుగు భాషను చదవడం, ఉచ్చరించడం కూడా సరిగా రాని ఆయనకు.. మాతృభాషా దినోత్సం సందేశం ఇచ్చే స్థాయి ఉందా? అనేది తెలుగు భాషా ప్రేమికుల సందేహం. ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీషు మీడియం చదువులతో మన బాలలు.. రేపు తెలుగు మాట్లాడడంలో, చదవడంలో మన సీఎం గారినే మించిపోతారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల నేపథ్యంలో.. చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్న తెలుగు భాషను.. బతికించుకోవడం ఎలాగో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులే సెలవిస్తే.. బాగుంటుందేమో!











