నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం వేల ఎకరాల భూములను త్యాగం చేసిన రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు వార్షిక కౌలు విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం రూ.195 కోట్ల కౌలు నిధులను విడుదల చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021-22 ఏడాదికి సంబంధించిన కౌలు కింద ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది.
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విభజన జరిగిన తర్వాత 13 జిల్లాలతో కూడిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కూడా లేకుండానే ప్రస్థానం ప్రారంభించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఏపీ పాలనను విజయవాడకు తరలించిన నాటి సీఎం నారా చంద్రబాబునాయుడు… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సమదూరంలో రాజధాని ఉండాలన్న సంకల్పంతో విజయవాడ-గుంటూరు మధ్యలో అమరావతిని నూతన రాజధానిగా ఎంపిక చేశారు. చంద్రబాబు అమరావతిలో రాజధానిని ప్రకటించడం, రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వాలని పిలుపు ఇవ్వడమే తరువాయి… 35 వేల ఎకరాలకు పైగా ఏడాదికి మూడు పంటలు పండే భూములను రైతులు ఇచ్చారు.
భూములిచ్చిన రైతులకు రాజధానిలో నివాస, వాణిజ్య ప్లాట్లతో పాటుగా వార్షిక కౌలును కూడా ఇచ్చేందుకు నాటి ప్రభుత్వం ఒప్పుకుంది. చంద్రబాబు సీఎంగా ఉన్నంత కాలం ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండానే రాజధాని రైతులకు వార్షిక కౌలు మంజూరయ్యేది. అయితే మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత రాజధాని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. అమరావతిని నిర్వీర్యం చేసేలా మూడు రాజధానుల మాట ఎత్తుకున్న జగన్ ప్రభుత్వం… రాజధాని రైతులకు వార్షిక కౌలు చెల్లింపుపైనా శీతకన్నేసింది. దీనిపై చాలా రోజులుగా రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. రాజధానిగా అమరావతిని కొనసాగించాల్సిందేనని డిమాండ్ చేస్తూ సాగుతున్న ఉద్యమాల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఎట్టకేలకు దిగివచ్చిన జగన్ సర్కారు…. రాజధాని రైతులకు వార్షిక కౌలు కింద రూ.195 కోట్లను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Must Read ;- తాడేపల్లి నుంచి జగన్ శాసిస్తే.. ఢిల్లీలో మోదీ పాటిస్తున్నారంట!