నిజమే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడులిద్దరిదీ ఒకే దారి అని చెప్పాలి. అభివృద్ధి పంథాలో ఇద్దరూ కలిసి నడుస్తున్నట్లుగానే చెప్పాలి. ఇదేదో ఊరకే అలా పోలిక పెట్టేసి చెప్పేయడం ఎంత మాత్రం కాదు. గురువారం దేశ రాజధానిలో నూతన పార్లమెంట్ భవన సముదాయం సెంట్రల్ విస్టా శంకుస్థాపన సందర్భంగా చోటుచేసుకున్న పలు అంశాలను పరిశీలిస్తే… ఈ మాట నిజమేనని ఒప్పుకోక తప్పదు. అదెలాగో చూద్దాం పదండి.
యూపీఏ ప్రభుత్వ హయాంలో అడుగులు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంటు భవనం వందేళ్లు పూర్తి చేసుకునే దిశగా సాగుతోంది. ఈ క్రమంలో సదరు భవనానికి ఇక విశ్రాంతి ఇచ్చేద్దామని గత యూపీఏ ప్రభుత్వ హయాంలో కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. ఆ పని పూర్తి చేయకుండానే యూపీఏ సర్కారు అధికారం నుంచి దిగిపోగా.. దాని స్థానంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు 2014లో పాలనా పగ్గాలు చేపట్టింది. యూపీఏ ప్రతిపాదనలను గౌరవిస్తూనే మోదీ సర్కారు పార్లమెంటు నూతన భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన పార్లమెంటు ఎలా ఉండాలి? దాని భవిష్యత్తు ఎలా ఉండాలి? డిజైన్లు ఎలా ఉండాలి? అన్న విషయాలను సుదీర్ఘంగా పరిశీలించిన మోదీ సర్కారు.. సెంట్రల్ విస్టా ప్లాన్‌కు మొగ్గు చూపింది. అంటే పార్లమెంటులోని దిగువ సభ లోక్‌సభ, ఎగువ సభ రాజ్యసభ, వాటి సెక్రటేరియట్లు అన్నీ ఒకే భవన సముదాయంలో ఉండేలా ప్లాన్ అన్న మాట. అంతే కాకుండా భవిష్యత్తులో సభ్యుల సంఖ్య రెట్టింపైనా, మరింతగా పెరిగినా కూడా వారంతా ఆసీనులయ్యేలా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. డిజైన్లు ఓకే అనుకున్న తర్వాత గురువారం నాడు మంచి ముహూర్తం చూసుకుని మోదీ సెంట్రల్ విస్టాకు భూమి పూజ చేశారు.
Must Read ;- చర్చల్లోకి అమిత్‌షా : కేంద్రం ఇంకాస్త దిగినట్టే..
మోదీకి చంద్రబాబు గ్రీటింగ్స్
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకించి ప్రధాని నరేంద్ర మోదీకి చంద్రబాబు గ్రీటింగ్స్ చెబుతూ ఓ సందేశం పంపారు. ఈ సందేశంలో సెంట్రల్ విస్టా ప్లాన్ ఏమిటో ప్రత్యేకంగా వివరించిన చంద్రబాబు… సెంట్రల్ విస్టా స్వతంత్ర భారత దేశ చరిత్రలో ప్రాముఖ్యమున్న ఘటనగా నిలిచిపోతుందన్నారు. ఐకానిక్ సెంట్రల్ విస్టా ప్రాజెక్టు దేశ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా ఉందని కూడా అందులో చంద్రబాబు పేర్కొన్నారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టు అన్ని హద్దులను చెరిపేసి అందరినీ ఐక్యం చేస్తుందన్నారు. ఆ తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో తాను నిర్మించాలనుకున్న భవనాలు, వాటి సమగ్ర నమూనాను ఆయన సెంట్రల్ విస్టాతో పోల్చారు.
సెంట్రల్ విస్టా తరహాలోనే సెంట్రల్ స్పైన్
అమరావతిలో తాను ప్రతిపాదించిన ప్రభుత్వ భవనాల సముదాయం సెంట్రల్ స్పైన్ తరహాలోనే ఢిల్లీలోని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కూడా ఉందని ఆ సందేశంలో చంద్రబాబు తెలిపారు. రాజ్‌భవన్, అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయంతో కూడిన అమరావతి సెంట్రల్ స్పైన్ ప్రాజెక్టు కూడా సెంట్రల్ విస్టా మాదిరిదేనని చంద్రబాబు గుర్తు చేశారు. రాష్ట్రం, దేశ అభివృద్ధి, సంపదలో భాగస్వామ్యం కోసం అమరావతి ఎదురు చూస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అమరావతి ఆశలు ఆవిరయ్యాయని, ఏపీలో వైసీపీ ప్రభుత్వమే ఇందుకు కారణమని చంద్రబాబు ఆరోపించారు. అమరావతి దేవుడి ఇష్టమని, దాని గమ్యాన్ని అదే వెతుక్కుంటుందని చంద్రబాబు తనదైన వేదాంత ధోరణిలో వ్యాఖ్యానించారు. అంటే పార్లమెంటు నూతన భవన సముదాయానికి ప్రతిపాదించిన సెంట్రల్ విస్టా డిజైన్‌ను తాను ఐదేళ్ల ముందే ఏపీలో అమలు చేసే దిశగా అడుగులు వేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. మొత్తంగా అభివృద్ధిలో ఎవరి పంథా వారిదే అయినా… మోదీ, చంద్రబాబు మాత్రం ఒకే దారిలో పయనిస్తున్నారన్న మాటే కదా.
Also Read ;- అమరావతి పోరాటానికి ‘ఎండ్ కార్డ్’ వేసే కుట్ర!