మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నానికి హైకోర్టు షాకిచ్చింది. ఇటీవల వైసీపీ కార్యకర్తల సమావేశంలో నాని రెచ్చగొట్టేవిధంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఐతే దీనిపై కేసులు నమోదు కావడంతో నాని వెంటనే హైకోర్టు తలుపు తట్టారు. ఈ కేసులో అరెస్ట్‌తో పాటు ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోకుండా నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలన్న నాని అభ్యర్థనను తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు పోలీసులు సమయం కోరడంతో విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.
ఇంతకీ ఏం జరిగింది?
ఈ నెల 11న కృష్ణా జిల్లా పామర్రులో వైసీపీ కార్యకర్తల సమావేశంలో పేర్ని నాని మాట్లాడుతూ ‘చెప్పి కాదు, చెప్పకుండా నరికివేయాలి.. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. ఇప్పుడు అరవడం కాదు. తప్పు చేసినవాడు ఎవరైనా ఉంటే మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి అంటూ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
ఐతే నాని వ్యాఖ్యలపై మచిలీపట్నం టీడీపీ పట్టణ అధ్యక్షుడు లోగిశెట్టి వెంకటస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పామర్రు పోలీసులు పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలంటూ పేర్ని నాని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. గురువారం జరిగిన విచారణలో పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.రఘు వాదనలు వినిపించారు. వైసీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యల్లో కొంత భాగాన్ని మాత్రమే ప్రచారం చేస్తున్నారన్నారు. పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు ఏడేళ్లలోపు జైలుశిక్షకు వీలున్నవేనని..మరికొన్ని సెక్షన్లను చేర్చాలని భావిస్తున్నారన్నారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ విషయంలో తొందరపాటు చర్యలు తీసుకోకుండా పోలీసులను నిలువరించాలని కోరారు. పోలీసుల తరఫున పీపీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ..పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చిందన్నారు. వివరాలు సేకరించి కోర్టు ముందు ఉంచేందుకు సమయం కావాలని కోరారు. దీంతో హైకోర్టు సింగిల్ జడ్జి విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.











