సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధం!
పీఆర్సీ సాధనకు ఉద్యోగుల సంఘాల జేఏసీలకు వైద్యారోగ్య శాఖతోపాటు ఆర్టీసీ కార్మికులు కూడా మద్దతు తెలిపారు. ఈ నెల 6 అర్థరాత్రి నుంచి ప్రభుత్వోద్యోగులు సమ్మెకు వెళ్లనున్నారు. ఈ సమ్మెకు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు క్లారిటీ ఇచ్చారు. తాము సైతం ఉద్యోగుల ప్రయోజనాల నిమిత్తం సమ్మెలో పాల్గొంటున్నామని యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేశారు నేతలు. ఎన్ఎంయూ, ఈయూ, ఎస్డబ్లూఎఫ్, కార్మిక పరిషత్, ఆఫీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సహా మొత్తం 12 సంఘాలతో కూడిన జేఏసీ నేతలు 45 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విజయవాడలోని ఆర్టీసీ హౌస్ లో ఉన్న ఎండీ ద్వారకా తిరుమలరావుకు అందజేశారు.
అనివార్య పరిస్థితిలో సమ్మె..
ఆర్టీసీ కార్మికుల వేతనాల్లో వ్యత్యాసం, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, విలీనంతో ఎదురైన ఇబ్బందులు, కార్పోరేషన్ లో ఉండగా కోల్పోయిన ప్రయోజనాలు తదితరాలను వివరించారు. తమ సమస్యలు పరిష్కారంకాకపోతే ఈ నెల 5, 6 తేదీల్లో సమ్మె సన్నాహక కార్యక్రమాలు చేపట్టి ఆరోతేదీ అర్థరాత్రి నుంచి సమ్మెలోకి వెళతామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశంతో సమ్మెకు వెళ్లడంలేదని, న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం తాము ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం కనిపించడం లేదని, విధిలేని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నామని జేఏసీ కన్వీనర్లు పలిశెట్టి దామోదర్ రావు, శ్రీనివాసరావు, అధ్యక్షుడు రమణా రెడ్డి తదితరులు స్పష్టం చేశారు.