రాష్ట్ర వ్యాప్తంగా హోరెత్తిన నిరసనలు..
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమ బాట పట్టారు. 13 జిల్లాలో దాదాపు 13 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంగళవారం నుంచి ఉద్యోగులు వివిధ రూపాల్లో నిరసనలు తెలపనున్నారు. 14 రోజులుపాటు వినూత్న రీతిలో ఉద్యోగులు ఆందోళనలు నిర్వహించి, అనంతరం వచ్చే నెల 6 నుంచి నిరవధిక సమ్మె నిర్వహించనున్నారు. ప్రధానంగా ఏపీ ఉద్యోగులు ఐదు డిమాండ్లపై సమ్మెకు దిగనున్నారు. పీఆర్సీకి సంబంధించి మిశ్రా కమిటీ నివేదికను బహిర్గతం చేయాలని, ఫిట్మెంట్, హెచ్ఆర్ఏ, పాత స్లాబులు, హైదరాబాద్ నుంచి వచ్చిన వారికి పాత హెచ్ఆర్ఏ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సీసీఏ, అదనపు పెన్షన్, గ్రాడ్యూటీ అమలు తేదీ, మొనిటరీ ప్రయోజనాల నుంచి రికవరీ నిలుపుదల చేయాలని, కేంద్ర పీఆర్సీ అమలు యోచన నిలిపివేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.
భారీ ర్యాలీ, ఆందోళనలు..
13 జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు భారీ ర్యాలీలతో ఆందోళనలకు దిగారు. వినూత్న రీతిలో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 11వ పీఆర్సీ జోవోలను వెంటనే రద్దు చేయాలని, పీఆర్సీ కమిటీ రిపోర్టును బహిర్గతం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. మేరుగైన పీఆర్సీ సాధించే విషయంలో ప్రభుత్వంపై ఉద్యమంలో వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగులు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జేఏసీ ల నేతలు పీఆర్సీ సాధన సమితి పేరుతో 20 మంది స్టీరింగ్ కమిటీ సభ్యులుగా ఏర్పడ్డారు. నిన్న కమిటి సభ్యులు మూడు పేజీల సమ్మె నోటీసును ప్రభుత్వానికి అందించారు. స్టీరింగ్ కమిటీ సభ్యులు ఉద్యమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకుపోయి, పీఆర్సీని సాధించేందుకు వ్యూహాత్మకంగా ముందుకుపోతున్నారు. వచ్చె నెల 6 అర్థరాత్రి నుంచి నిరవధిక సమ్మెకు దిగెందుకు సమాయక్తమవుతున్నారు. ఆర్టీసీతో పాటు అన్ని శాఖల ఉద్యోగులు ప్రజా సేవలను నిలిపివేసి, సమ్మె బాట పట్టనున్నారు.