ఏపీ అసెంబ్లీలో టీడీపీ పక్ష ఉప నేత అచ్చెన్నాయుడు, టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడుకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ త్వరలో నోటీసులు జారీ చేయనుంది. సీఎం జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అసెంబ్లీలో ఉటంకిస్తూ వీరిరువురూ చేసిన ప్రసంగాలపై అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై ఇవాళ వెలగపూడి అసెంబ్లీలో ప్రివిలేజ్ కమిటీ భేటీ అయ్యింది. ముందుగా సభ్యులకు నోటీసులు జారీ చేసి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పది రోజుల తరవాత వారు ఇచ్చే సమాధానాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రివిలేజ్ కమిటీ నిర్ణయించనుంది.
టీడీపీ సభ్యుల ఫిర్యాదులు తిరస్కరణ
టీడీపీ పక్ష ఉపనేత అచ్చెన్నాయుడుపై ప్రభుత్వ విప్ శ్రీకాంత్‌రెడ్డి సభలో ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టారు. టీడీపీ సభ్యులు కూడా కొన్ని ప్రివిలేజ్ మోషన్ కింద ఫిర్యాదులు ఇచ్చినా అవి స్పీకర్ ఫార్మాట్‌లో లేవని కమిటీ తిరస్కరించింది. రేపల్లె టీడీపీ సభ్యుడు అనగాని సత్యప్రసాద్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను స్వీకరించలేదు. సత్యప్రసాద్ ఫిర్యాదును సుమోటాగా తీసుకునేది లేదని, ప్రివిలేజ్‌కు స్పీకర్ అనుమతి ఉండాలని, అందుకే టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసులను స్వీకరించలేదని కమిటీ ఛైర్మన్ గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రోటోకాల్ ఉల్లంఘన కింద కూడా ఒక ప్రివిలేజ్ ఫిర్యాదు కమిటీకి అందినట్టు ఛైర్మన్ ప్రకటించారు. పది రోజుల తరవాత వీరికి నోటీసులు జారీ చేసి, వారిచ్చే సమాధానాలను బట్టి చర్యలు తీసుకోనున్నారు.
Must Rad ;- ‘స్థానికం’ ఫిబ్రవరిలోనే.. అసెంబ్లీ తీర్మానం చెల్లదా?