వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శాసనసభలో అనుసరిస్తున్న తీరు నిజంగానే వింతగా అనిపిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. విపక్ష నేతగా ఉన్న సమయంలో ఒక రీతిగా వ్యవహరించిన జగన్… ఇప్పుడు శాసనసభా నాయకుడి స్థానంలోకి వచ్చాక మరో రీతిన వ్యవహరిస్తున్నారు. సభలో తన ప్రత్యర్థి వర్గం నోరు వినిపించరాదన్న కోణంలో సాగుతున్న జగన్… విపక్షంలో ఉండగా సభ నుంచి వాకౌట్లను ఆశ్రయించి… ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక విపక్షానికి చెందిన సభ్యులపై సస్పెన్షన్లను విధిస్తూ సాగుతున్న తీరు నిజంగానే ఆసక్తికరమనే చెప్పక తప్పదు.
విపక్ష నేతగా..
విపక్ష నేతగా ఉండగా జగన్ ఏనాడూ సభలో అర్థవంతమైన చర్చలో పాలుపంచుకున్నారని చెప్పడానికే లేదు. నాడు అధికార పార్టీగా ఉన్న తెలుగు దేశం పార్టీ సభ్యులు, నాడు సీఎం హోదాలో ఉన్న నారా చంద్రబాబునాయుడు చేసే ప్రసంగాలను వినేందుకే ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించిన జగన్… నిత్యం సభ నుంచి తన పార్టీ సభ్యులను వెంటేసుకుని వాకౌట్ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఇలా నిత్యం వాకౌట్లనే ఆశ్రయించిన వైసీపీ ఏనాడూ పెద్దగా సభలో కూర్చోలేదనే చెప్పాలి. అంతే కాకుండా తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం లేదన్న సాకుతో ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉందనగా… ఏకంగా శాసనసభా సమావేశాలనే బాయికాట్ చేసేశారు. ఫలితంగా ఏకంగా ఏడాదిన్నర పాటుగా తనతో పాటుగా తన పార్టీ సభ్యులను కూడా అసెంబ్లీకి దూరం పెట్టేశారు. తాను సీఎం అయిన తర్వాతే మళ్లీ శాసనసభలో అడుగుపెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం బాధ్యత కలిగిన విపక్షంగా వ్యవహరించాల్సిన వైసీపీ…. జగన్ తీరు కారణంగా అందుకు భిన్నంగా వ్యవహరించింది. అసెంబ్లీకి వెళ్లకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేయకుండా ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారు.
Also Read ;- ఎమ్మెల్సీపై మార్షల్స్ దురుసు ప్రవర్తన
హౌస్ లీడర్ హోదాలో..
మొన్నటి ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ జనంలో వెళ్లిన జగన్… జనాన్ని అదే భ్రమలో పడేసి ఎన్నికల్లో గెలిచారు. విపక్షంలో ఉండగా నిత్యం వాకౌట్లను ఎంచుకున్న జగన్… అధికారం చేతికందగానే… హౌస్ లీడర్ హోదాలోకి వచ్చేసి ఇప్పుడు మరో రీతిన వ్యవహరిస్తున్నారు. నాడు అధికార పక్షంగా ఉండి ఇప్పుడు విపక్షంగా మారిపోయిన టీడీపీకి చెందిన సభ్యులు గానీ, ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న నారా చంద్రబాబునాయుడి గళం గానీ వినిపించరాదన్న రీతిలో వ్యవహరిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తానేమో సుధీర్ఘ ప్రసంగాలు చేస్తున్న జగన్.. విపక్ష సభ్యులకు అసలు మాట్లాడేందుకే అవకాశం ఇవ్వకుండా తనదైన శైలి వ్యూహాన్ని మార్చేసుకున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యలపై తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరా? అంటూ నిలదీస్తున్న విపక్ష సభ్యులపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేస్తూ సాగుతున్నారు. ఇందులో భాగంగా ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా సస్పెండ్ చేసేలా వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలే నిలుస్తున్నాయి.
ఈ సమావేశాల తొలి రోజునే చంద్రబాబు సహా సభలో ఉన్న 14 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయించిన జగన్… రెండో రోజు చంద్రబాబును మినహాయించి 12 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేయించారు. మూడో రోజు కూడా అదే రీతిన వ్యవహరించిన జగన్ ఏకంగా 9 మంది టీడీపీ సభ్యులపై వేటు వేయించారు. మొత్తంగా సభలో తన వైరివర్గం మాటే వినపడకూడదన్న ధోరణితో సాగుతున్న జగన్… టీడీపీ సభ్యులపై ఇష్టారాజ్యంగా సస్పెన్షన్ వేటు వేయిస్తున్నారు. సస్పెన్షన్లతోనే సరిపెట్టని జగన్ టీడీపీ సభ్యులను మార్షల్స్‌తో బయటకు పంపిస్తున్న తీరుపై కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తంగా తాను విపక్షంలో ఉండగా… సభలో ఉండేందుకు ఇష్టపడని జగన్… ఇప్పుడు విపక్షంగా ఉన్న టీడీపీని సభలో లేకుండా చేసేలా వ్యవహరిస్తున్నారన్న విషయం ఆసక్తికరంగా మారిందని చెప్పాలి.
Must Read ;- రచ్చ రాజేసిన టిడ్కో ఇళ్లుపై చర్చ