ఏపీలో అడుగు బయటపెడితే ఏదో ఒక రూపేణా పన్నులు చెల్లించకుండా తిరిగి వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. మద్యం బ్రాండ్ లు, రేట్ల విషయంలో ఏపీలో తనదైన మార్కు చూపించిన జగన్ ప్రభుత్వం క్రమేణా పన్నులు పెంచుతూ వస్తోంది. ఆస్తి పన్ను, వాహన పన్ను, వాహన జరిమానాలు, విద్యుత్తు ఛార్జీల పెంపు, పారిశుద్ధ్య పన్ను, నీటి పన్ను, కొత్తటోల్ ల ఏర్పాటు, చమురుపై జీఎస్టీ పెంపు.. ఇలా గత 18 నెలల కాలంలో జగన్ పెంచిన పన్నుల జాబితా చాలానే ఉంది. సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చినట్లే ఇచ్చి.. అంతకు రెండింతలు వారి జేబులోనుంచి లాగేసే విధంగా పన్నులు విధించడంతో ఏపీలో రాజకీయ పక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. పన్నుల విధింపు విషయాలను పరిశీలిస్తే..
- ఇప్పటికే పురపాలికలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను పెంచడంతోపాటు మంచినీటి పన్ను, పారిశుద్ధ్య ఛార్జీలను పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే స్థానిక సంస్థలు మంచినీరు, పారిశుధ్య పన్నులను ఏటా క్రమం తప్పకుండా 7శాతం పెంచుకుంటూ వస్తుండగా అదనపు పన్నును విధించారు.
- ఆస్తిపన్ను, పారిశుద్ధ్య పన్ను, మంచినీటి పన్ను, పెరిగిన విద్యుత్ ఛార్జీలతో 200 గజాల్లో నివసిస్తే రూ.50వేల వరకు పన్నులు చెల్లించక తప్పని పరిస్థితి కనిపిస్తోంది
- ప్రస్తుతం జాతీయ రహదారులకు మాత్రమే టోల్ ఫీజు వసూలు చేస్తుండగా ఏపీలో రాష్ట్ర రహదారుల్లోనూ టోల్ వసూలు చేయడం చర్చనీయాంశమైంది. ప్రాథమికంగా 11 రూట్లను ఎంపిక చేసి.. క్రమేణా వాటి సంఖ్య పెంచనున్నారు. 30-40 కిలోమీటర్ల రోడ్లకు కూడా పన్ను విధించడం ఖాయంగా కనిపిస్తోంది
- ఇక మరుగుదొడ్లకు పన్నులు వేయడంపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సీవరేజ్ కనెక్షన్లను 3 రకాలుగా విభజించారు. గృహ కనెక్షన్లకు 2 కమోడ్లు ఉంటే.. నెలకు రూ.30-35, మూడు ఉంటే రూ.60నుంచి రూ.80, అంతకుమించి ఉంటే ఒక్కోదానికి అదనంగా రూ.10 వసూలు చేయనున్నారు. వాణిజ్య విభాగంలో రూ.150 నుంచి ఈ బాదుడు మొదలవుతుంది. ఇక విద్యాసంస్థలు, మఠాలు, ఆసుపత్రులు, హోటళ్లకు 10 కమోడ్ల లోపు: రూ.300-600 వసూలు చేస్తారు. పదికంటే ఎక్కువగా ఉంటే ఒక్కోదానికి రూ.15 చొప్పున అదనంగా వసూలుచేస్తారు.
- ఇక ఆస్తి పన్ను విధింపు విషయంలోనూ 30 ఏళ్ల రికార్డును జగన్ ప్రభుత్వం బద్దలు కొట్టింది. ఆస్తిపన్ను ఆ స్థాయిలో పెంచారు. ఆస్తి విలువనుబట్టి పన్నులు విధించనున్నారు. నివాస భవనాలకు గరిష్టంగా 0.5శాతం, వాణిజ్య సముదాయాలకు గరిష్టంగా 2.0శాతం ఆస్తి విలువ ఆధారంగా ఆస్తి పన్ను చెల్లించాలి. ఇక ఖాళీ స్థలాలకూ మున్సిపాల్టీల్లో 0.2శాతం, కార్పొరేషన్లలో .5శాతం పన్ను విధించనున్నారు. వీటితోపాటు వ్యర్థాలపై .25శాతం గరిష్టంగా ఆస్తివిలువను బట్టి పన్ను వసూలుచేయనున్నారు. అక్రమ నిర్మాణాలకు, అనుమతి లేని నిర్మాణాలకు గరిష్టంగా 100శాతం పెనాల్టీ వసూలు చేస్తారు.
- పెట్రోల్ పై పన్నులో దేశంలోనే అత్యధిక పన్ను విధిస్తున్న రాష్ట్రాల్లో ఏపీ చేరింది. ఇంధనంపై జీఎస్టీ గతంలో 31 శాతం ఉండగా జగన్ అధికారంలోకి వచ్చాక గత జనవరిలో పెట్రోల్ పై 35.2శాతానికి పెంచారు. డీజిల్ పై 22.25శాతం ఉన్న జీఎస్టీని 27శాతానికి పెంచారు.
- రాష్ట్రంలో సహజవాయువుపై పన్ను పెంచారు. 14.5 శాతం నుంచి 24.5 శాతానికి విలువ ఆధారిత పన్నును పెంచుతూ వాణిజ్య పన్నుల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
- ముడి చమురుపై కూడా 5 శాతం పన్ను పెంచారు. ఎయిర్ టర్బైన్ ఫ్యూయెల్ పై 1 శాతం మేర వాణిజ్య పన్నుల శాఖ వ్యాట్ వసూలు చేస్తుంది ఏపీ ప్రభుత్వం.
- నీటి పన్నును కూడా పెంచింది జగన్ ప్రభుత్వం. వ్యక్తిగత గృహాలకు నెలకు 100 నుంచి 350 రూపాయల మధ్య, అపార్ట్మెంట్లకు వెయ్యి లీటర్లకు 30 నుంచి 50, కమర్షియల్ కనెక్షన్లకు వెయ్యి లీటర్లకు 60 నుంచి 140, ఇన్‌స్టిట్యూషన్లకు వెయ్యి లీటర్లకు 40 నుంచి 80 రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు.
- వృత్తి పన్నులు కూడా పెంచింది జగన్ ప్రభుత్వం. రూ. 1250గా ఉన్న వృత్తి పన్ను శ్లాబును రూ. 2000కు పెంచింది. 10 లక్షల లోపు టర్నోవర్ ఉన్న వాణిజ్య సంస్థలకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వగా, రూ. 25 లక్షల లోపు టర్నోవర్ ఉన్నవారికి రూ. 2 వేలు, రూ. 25 లక్షలు ఆపై టర్నోవర్ దాటిన సంస్థలకు రూ. 2500 పన్ను వసూలుచేయనున్నారు.
- సినిమా పరిశ్రమలో పని చేసేవారికి ఈ పన్ను రూ. 2500గా విధించింది. జిల్లా, రాష్ట్ర స్థాయి సహకార సంఘాలకు, వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకు వృత్తి పన్ను రూ. 2500గా ఖరారు చేసింది. పబ్లిక్ టెలిఫోన్ ఆపరేటర్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇవ్వగా… టేక్ ఎవే ఫుడ్ పాయింట్లు, కర్రీ పాయింట్లు, క్యాంటీన్లకు రూ. 2500 వృత్తి పన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక రానున్న కాలంలో ఎంతమేరకు పన్నులు పెంచుతారనేది ఇంకా తేలాల్సి ఉంది.
Must Read ;- కొత్త స్మగ్లింగ్ : బ్రాండ్ బాటిల్ లో కల్తీ మద్యం