చిత్తూరు జిల్లా మాజీ మేయర్ కఠారి దంపతుల హత్య కేసులో సాక్షులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయా ? నిందితులకు పోలీసులు వంత పాడుతున్నారా ? పోలీసులను అడ్డం పెట్టుకుని సాక్షులను ప్రభావితం చేయాలని చూస్తున్నారా ? ఎలాగైనా సాక్షులను తమవైపు తిప్పుకునేందుకు ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారా ? జిల్లాలో అర్ధరాత్రి పోలీసుల తనిఖీల కలకలం వెనుక అసలు కథేంటి ?
చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ, మోహన్ దంపతుల హత్యకేసులో సాక్షులను తప్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొంతమంది సాక్షులను ప్రలోభాలతో తమవైపు తిప్పుకున్న నిందితులు, మిగిలిన వారిని బెదిరింపుల ద్వారా తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది.నిందితులు పోలీసుల అండతో ఈ చర్యలకు పాలపడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.తాజాగా జిల్లాలో పోలీసులు అర్ధరాత్రి సఖుల ఇళ్ళల్లో తనిఖీలు , సోదాలు పేరిట చేస్తున్న ఉదంతాలే ఇందుకు నిదర్శమనే చర్చ జోరుగా సాగుతోంది.
వాస్తవానికి 2015 నవంబరు 17న అప్పటి మేయర్ కఠారి అనురాధ, మోహన్ అతి దారుణంగా హత్యకు గురయ్యారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కొందరు వ్యక్తులు వీరిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా కటారి మోహన్ మేనల్లుడు చింటూ సహా 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు హత్యకు వాడిన కత్తులను, తుపాకీలను, వాహనాలను, బురఖాలను పోలీసులు స్వాధీనం చేసుకుని వారిపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు . కాగా గడిచిన ఏడేళ్లుగా ఈ కేసు కోర్టులో నడుస్తోంది.
తాజాగా ఈ కేసు విచారణకు షెడ్యూల్ ఖరారైన నేపధ్యంలో నిందితులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేసులో ప్రధాన నిందితుడైన చింటూతో పాటు అతడి నిందితుడు బుల్లెట్ సురేష్, అనుచరులైన కార్పొరేటర్ శ్రీకాంత్, సాయిగణేష్, గుర్రప్ప నాయుడు, పరంధామ, మరికొందరు కలిసి సాక్షులను బెదిరిస్తున్నారంటూ కటారి అనురాధ, మోహన్ దంపతుల కోడలు మాజీ మేయర్ కటారి హేమలత పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఇప్పటికే కొంత మంది సాక్షులను ప్రలోభపెట్టి నిందితులు వారి వైపు తిప్పుకున్నారన్నారన్నారు. మిగిలిన వారినీ తిప్పుకునేందుకు బెదిరిస్తున్నారని.. సాక్షులకు, తమ కుటుంబ సభ్యులకు కూడా చింటూ అనుచరుల వల్ల ప్రాణహాని ఉందని, పోలీసులు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.
అయితే హేమలత ఫిర్యాదు తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు సాక్షులను తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. హేమలత అనుచరుడైన ప్రసన్న తమ్ముడు పూర్ణ మేయర్ దంపతుల హత్య కేసులో సాక్షిగా ఉన్నారు. కాగా, గత అర్ధరాత్రి పూర్ణ ఇంటిలో పోలీసులు తనిఖీలు చేపట్టడం కలకలం రేపుతోంది. పూర్ణ గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నాడంటూ పోలీసులు సోదాలు చేశారు.
ఇదంతా కేసులో సాక్షిగా ఉండి, నిందితుల మాట వినకపోవడం వల్ల కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించేందుకే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తనిఖీల పేరుతో ఇంట్లోకి వచ్చిన పోలీసులు తమ ఇంట్లో గంజాయి బస్తాలు పెట్టేందుకు ప్రయత్నించారని, దానిని తాము అడ్డుకున్నామని పూర్ణ తల్లి, వదిన చెబుతున్నారు. ఈ క్రమంలోనే వారు పోలీసులను అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారని, కానీ తమకు తెలియకుండా ఓబనపల్లెలో తమకున్న మరో ఇంట్లో ఒక గంజాయి బస్తా పెట్టారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు.
ఇక విషయం తెలుసుకున్న మాజీ మేయర్ హేమలత తన అనుచరులతో పూర్ణ ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసు జీపు వెనకాతల బైఠాయించి పోలీసులు స్వాధీనం చేసుకున్న బస్తాల్లో ఏముందో చూపించాలని డిమాండ్ చేశారు.కానీ పోలీసులు మాత్రం అందుకు నిరాకరించి పూర్ణను వారి వాహనంలో ఎక్కించి స్టేషన్ కు తరలించే ప్రయత్నం చేశారు. కాగా హేమలత ,ఆమె అనుచరులు జీపు వెనక్కి వెళ్ళనీయకుండా బైఠాయించి ఆందోళన కొనసాగించారు. అయినా పోలీసులు మొండిగా జేపును వెనక్కి తేవడంతో మాజీ మేయర్ హేమలత కాళ్ళ పై నుంచి పోలీసు వాహనం పోనివ్వడంతో ఆమెకు గాయాలయ్యాయనై ఆమె అనుచరులు ఆరోపిస్తున్నారు.చికిత్స నిమిత్త ఆమెను ఆసుపత్రికి తరలించగా రెండు కాళ్లలో స్వల్పంగా పగుళ్లు వచ్చినట్టు వైద్యులు తెలిపారు.
మొత్తం మీద చిత్తూరు జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు మాజీ మేయర్ కఠారి అనురాధ, మోహన్ హత్య కేసులో సాక్షులను తప్పించేందుకు సహకరిస్తున్నట్లుగానే ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల అండతో నిందితులు చెలరేగిపోతున్నారని, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన పోలీసులు తమ బాధ్యతలు మారిచినట్లు వ్యవహరిస్తున్నారని పరిశీలకులు భావిస్తున్నారు.