స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులకు వేలం పాటలు మొదలయ్యాయి. ఏకగ్రీవాలు చేసుకుంటే ఒక్కో గ్రామానికి రూ.5 నుంచి 20 లక్షలదాకా అభివృద్ధి నిధులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినా కొన్ని గ్రామాల్లో సర్పంచ్ పదవులు అంతకంటే రెట్టింపు ధరలే పలుకుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం దుర్గాడ సర్పంచ్ పదవిని గ్రామ పెద్దలు శివాలయంలో వేలం నిర్వహించారు. ఈ వేలంలో నలుగురు పాల్గొన్నారు. అత్యధికంగా ఓ వ్యక్తి రూ.33 లక్షలకు సర్పంచ్ పదవిని వేలంలో దక్కించుకున్నారు.
కాదని ఎవరైనా నామినేషన్ వేస్తే…
వేలాన్ని దిక్కరించి ఎవరైనా నామినేషన్ వేస్తే.. వేలంలో అత్యధికంగా పాడిన వ్యక్తిని దేవుని అభ్యర్థిగా ప్రకటిస్తారు. అతన్ని గెలిపించే బాధ్యతను గ్రామ పెద్దలు తీసుకుంటారు. వేలంలో సర్పంచ్ పదవిని దక్కించుకున్న వ్యక్తే గెలుస్తూ వస్తున్నారు. 2005లోనూ దుర్గాడ గ్రామంలో ఇలాగే వేలం నిర్వహించగా ఓ వ్యక్తి రూ.5 లక్షలకు సర్పంచ్ పదవి దక్కించుకున్నాడు. అయితే మరికొందరు నామినేషన్లు వేయడంతో ఎన్నికలు అనివార్యం అయ్యాయి. వేలంలో అత్యధిక ధరకు దక్కించుకున్న వ్యక్తిని దేవుడి అభ్యర్థిగా ప్రకటించి గ్రామ పెద్దలు గెలిపించుకున్నారు. వేలం ద్వారా వచ్చిన డబ్బును శివాలయం అభివృద్ధికి ఖర్చు చేయాలని గ్రామ పెద్దలు నిర్ణయించడం విశేషం.
Must Read ;- సజ్జల : భయపడుతున్నారా.. భయపెడుతున్నారా?