తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో ఏర్పాటు చేయనున్న దివీస్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న బహిరంగ సభకు అనూహ్య మద్దతు లభించింది. ఉదయం 11 గంటలకు రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్న జనసేనానికి జనసైనికులు ఘనస్వాగతం పలికారు. అక్కడ నుంచి అన్నవరం చేరుకున్న పవన్, సాయంత్రానికి కొత్తపాకలలో ఏర్పాటు చేసిన సభాస్థలానికి చేరుకున్నారు. దారిపొడవునా జనసేనానికి జనం బ్రహ్మరథం పట్టారు. కొత్తపాలక సభలో జనసేనాని దివీస్ పరిశ్రమ ఏర్పాటులో ప్రభుత్వ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించారు.
సిద్దాంతాలతోనే రాజకీయాలు చేస్తా
అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలుపుతానన్న జగన్ రెడ్డి, ఇవాళ అదే పరిశ్రమకు అనుమతులు ఎలా ఇచ్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తాను ఓట్ల కోసం రాజకీయాలు చేయడం లేదని సిద్దాంతాలతోనే రాజకీయాలు చేస్తానని, వాటి కోసమే చివరి వరకూ పోరాడతానని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే వైసీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని, తాను మాత్రం మాట తూలనన్నారు. తల్లిదండ్రులు తనను సంస్కారవంతంగా పెంచారని పవన్ గుర్తు చేశారు. వేలకోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా? అని పవన్ ప్రశ్నించారు. నాకు ఆస్తులు అధికారాలు అక్కర్లేదు, ప్రజల కోసం పనిచేస్తానని భరోసా కల్పించారు. ప్రజల ఆరోగ్యం చెడగొట్టే పరిశ్రమలు తమకు వద్దని దివీస్ పరిశ్రమను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
Must Read ;- పవన్ సభకు అనుమతి- రద్దు : జగన్‌కు భయమా?
పర్యావరణ సర్టిఫికేట్ ఇచ్చింది వైసీపీ వారి కంపెనీయే
దివీస్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి పర్యావరణ ఇబ్బందులు తలెత్తవని, పరిశీలించి సర్టిఫికెట్ ఇచ్చిన కంపెనీ కూడా వైసీపీ నాయకులదేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టు వ్యవహారం తయారైందన్నారు. వైసీపీ ఎంపీకి చెందిన రాంకీ ఎన్విరో కంపెనీ పర్యావరణ సమతుల్యతపై పరీక్షలు జరిపి దివీస్ కంపెనీ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని సర్టిఫికెట్ ఇచ్చారని పవన్ గుర్తు చేశారు. కాలుష్యం వల్ల గర్భస్రావాలు అయితే, చర్మవ్యాధులు వస్తే, ప్రజలు అనారోగ్యం బారిన పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. దివీస్ పరిశ్రమ నుంచి కాలుష్య జలాలు రావని దివీస్ హామీ ఇవ్వగలదా? అని పవన్ ప్రశ్నించారు.
నాకు వాటిపై అవగాహన ఉంది
కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. దివీస్ పరిశ్రమ ఏర్పాటుకు మొదట 490 ఎకరాలు తీసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం రాగానే 690 ఎకరాలు కావాలంటున్నారు. తిప్పితిప్పి కొడితే వారిచ్చే ఉద్యోగాలు 3 వేలు దాటవని పవన్ గుర్తుచేశారు. ప్రస్తుతం తుని, తొండంగి పరిసరాల్లోని వందలాది హేచరీల్లో 45 వేల మంది ఉపాది పొందుతున్నారని దివీస్ పరిశ్రమ వస్తే హేచరీలు మూతబడతాయని పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. దివీస్ పరిశ్రమ రావడం వల్ల వచ్చే ఉద్యోగాలకన్నా పది రెట్లు ఎక్కువ ఉద్యోగాలు పోతాయని ఆయన గుర్తుచేశారు. దివీస్ పరిశ్రమ వస్తే ఉద్యోగాలు పోవడంతోపాటు, మత్స్యకారులకు చేపలు దొరక్క, ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిశ్రమ మనకు అక్కర లేదని, అడ్డుకుని తీరుతామని పవన్ హెచ్చరించారు.
దౌర్జన్యం చేయడానికి రాలేదు
వందలకోట్ల డబ్బు, వందల ఎకరాల భూములను బిడ్డలకు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని, అన్నిటికన్నా ఆరోగ్యం చాలా ముఖ్యమని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. తాగేనీరు కలుషితం అయితే బిడ్డల ఆరోగ్య పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఈ భూమి రైతులకు వారసత్వంగా వచ్చిందని, వైసీపీ నేతల సొంతం కాదని పవన్ గుర్తుచేశారు. తానుకూడా పరిశ్రమలు రావాలనే కోరుకుంటున్నానని, కానీ నీరు, గాలి కలుషితం చేసే పరిశ్రమలు వద్దన్నారు. ఇక్కడ కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు పెట్టి కలుషిత జలాలను సముద్రంలోకి వదిలేస్తామనంటే కుదరదని పవన్ హెచ్చరించారు.
అనూహ్య స్పందన
పవన్ కళ్యాణ్ కొత్తపాకల సభకు భారీగా జనం హాజరయ్యారు. రాజమండ్రి విమానాశ్రయంలో దిగింది మొదలు అడుగడుగునా జనసైనికులు జనసేనానికి బ్రహ్మరథం పట్టారు. అన్నవరం, కత్తిపూడి, రాజానగరంలో జనసైనికులు పవన్ కళ్యాణ్ ను పూలతో ముంచెత్తారు. కిలోమీటర్ల పొడవునా జనం బారులు తీరారు. మొత్తం మీద జనసేనాని పర్యటనకు మంచి స్పందన వచ్చిందనే చెప్పాలి.
Also Read ;- ‘దివీస్’ ఇష్యూలో లోనూ జగన్ రివర్సేనా