స్ధానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘంలో కార్యదర్శి నియామకం వివాదానికి దారితీసింది. రాష్ట్ర ఎన్నికల కార్యదర్శిగా ఉన్న వాణీమోహన్ ను ఎన్నికల కమిషనర్ ప్రభుత్వానికి సరెండర్ చేయడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పెద్దగా స్పందించలేదు. కార్యదర్శి పదవికి ముగ్గురు అధికారుల పేర్లు సూచించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వాన్ని కోరారు. ఐఏఎస్ అధికారులు రాజబాబు,కన్నబాబు,విజయ్ కుమార్ పేర్లు సూచిస్తూ ప్రభుత్వం నిమ్మగడ్డకు పంపించింది.
అయితే వారిలో ఎవరినీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కార్యదర్శిగా నియమించలేదు. తాజాగా ఎలాంటి పోస్టింగ్ లేకుండా ఖాళీగా ఉన్న రవిచంద్రను ఎన్నికల సంఘం కార్యదర్శిగా నియమిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. నిమ్మగడ్డ నిర్ణయం తీసుకున్న కాసేపటికే రవిచంద్రను వైద్యఆరోగ్యశాఖ కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వం మధ్య వివాదం మరోసారి రచ్చకెక్కినట్టయింది.
కార్యదర్శి లేకుండానే ఎన్నికలు కానిస్తారా
రాష్ట్ర ఎన్నికల సంఘంలో కార్యదర్శిగా ఎవరినీ నియమించకుండానే స్థానిక ఎన్నికలు అయ్యేలా కనిపిస్తోంది. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాంటి వ్యక్తులకు కార్యదర్శిలాంటి కీలక పదవి అప్పగిస్తే, ఎస్ఈసీ తీసుకునే నిర్ణయాలన్నీ ముందే ప్రభుత్వ పెద్దలకు చేరిపోతాయని ఎన్నికల కమిషనర్ భావిస్తున్నారు. అందుకే కార్యదర్శి పదవి నియామకంలో గందరగోళం నెలకొంది. కమిషనర్ నిమ్మగడ్డ సూచించిన అధికారిని కార్యదర్శిగా నియమించేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు. అలాగని ప్రభుత్వం సూచించిన అధికారులను కార్యదర్శిగా నియమించుకునేందుకు కమిషనర్ నిమ్మగడ్డ ఆసక్తిగా లేరని తెలుస్తోంది.
Must Read ;- థ్రెట్ ఉందా? : హై సెక్యూరిటీ జోన్ లో నిమ్మగడ్డ!
ఎవరి దారి వారిదే..
స్థానిక ఎన్నికల నిర్వహణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో పంచాయతీ ఎన్నికలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సహకరించినట్టు నటిస్తున్న వైసీపీ ప్రభుత్వం, సాధ్యమైనన్ని ఏకగ్రీవాలు చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలను ఆదేశించిన సంగతి తెలిసిందే. అంటే ఏకగ్రీవాలు జరిగితే ఇక ఆయా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు. ఒక వేళ ప్రతిపక్షపార్టీ వారు సర్పంచ్ గా గెలిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి పదవి నుంచి తొలగించే చట్టాలను ప్రయోగిస్తామంటూ బహరంగంగానే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
దీంతో వైసీపీ నుంచి కాకుండా ఇతర పార్టీల నుంచి గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదనే అభిప్రాయం పోటీ చేసే అభ్యర్థుల్లో కల్పించారు. ఇక ఎన్నికల సంఘం తనపని తాను చేసుకుంటూ పోతోంది. ప్రభుత్వం కూడా ఎన్నికల సంఘం ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 243కె అధికరణ ద్వారా రాజ్యాంగం ఎన్నికల సంఘానికి కల్పించిన అధికారాలను ఉపయోగించే రవిచంద్రను నియమించినట్టు కమిషనర్ కార్యాలయం వెల్లడించింది.
రాయలసీమలో పర్యటన
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదటి దశ పంచాయతీ ఎన్నికల నామికేషన్ల ప్రక్రియ ప్రారంభంలోనే రాయలసీమ పర్యటన పెట్టుకున్నారు. సీమలో అత్యధిక పంచాయతీల్లో అధికార వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడతారనే అంచనాలతోనే నిమ్మగడ్డ అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. వైసీపీ నేతల బెదిరింపులు, అక్రమ ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు నిమ్మగడ్డ గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు తెలుస్తోంది. పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరపడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని తెలుస్తోంది.
గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో అధికార వైసీపీ నేతలు ఎలాంటి అరాచకాలకు పాల్పడ్డారో అందరికీ తెలిసిందే. పంచాయతీ ఎన్నికల్లో అవి ఇంకా పెచ్చుమీరే ప్రమాదం ఉందని గ్రహించిన ఎన్నికల కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగి, రాయలసీమలో పర్యటన ప్రారంభించారు. నిమ్మగడ్డ పర్యటనలను కూడా వైసీపీ నేతలు నిశితంగా గమనిస్తున్నారు. ఎక్కడా మీడియాలోకి రాకుండా పనులు చక్కబెడుతున్నారని తెలుస్తోంది.
Also Read ;-‘స్థానికం’పై ఎపీలో సమర భేరి.. క్లైమాక్స్‌పై సర్వత్రా ఆసక్తి!