(విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
తాను చేస్తే సంసారం.. పరులు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అధికార పార్టీ మంత్రులు. అమరావతి జన భేరి సభలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు చేసిన ఒక వ్యాఖ్య అధికార పార్టీ నేతలకు బూతులా వినిపించింది. ఆ బూతు పదం ఏంటో తెలుసా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ‘ఏం పీకారు’ అని చంద్రబాబు అన్నారట! దీనిపై స్పందించిన పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. అన్నేళ్ల రాజకీయ అనుభవం ఉండి, ఎన్నో ఏళ్ళు ముఖ్యమంత్రి హోదా అనుభవించిన వ్యక్తి అలా బూతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు. బహిరంగ సభలో మహిళల ముందు అటువంటి మాటలు చెప్పవచ్చా అని అని అడిగారు. 70ఏళ్ల వయసులో వెయ్యి మందిని చూడగానే పూనకం వచ్చి బూతులు మాట్లాడతారా అని ప్రశ్నించారు.
వైసీపీ మంత్రులవి బండ బూతులా!
సదరు మంత్రి కి ఇది బూతుల్లా కనిపిస్తే.. వైఎస్ఆర్ సీపీ నాయకులు, మంత్రులు చేస్తున్న వ్యాఖ్యలను ఏమనాలి? బండ బూతులా? అన్న విషయాన్ని మంత్రి స్పష్టం చేయాలి. మాజీ ముఖ్యమంత్రిగా గౌరవం ఇవ్వకపోయినా… వయసులో పెద్ద వ్యక్తి అన్న ఆలోచన లేకుండా రాష్ట్ర మంత్రులు.. వాడు.. వీడు.. పిచ్చోడు.. వెధవ.. ఇన్నేళ్ళు ఏం పీకావ్.. లాంటి అసభ్యకర వ్యాఖ్యలు ఎన్నో చేశారు. ఆయన రాజకీయ అనుభవం అంత వయసు కూడా లేని నాయకులు సైతం ఇష్టానుసారం నోరు జారారు. అప్పుడు కనిపించని వినిపించని బూతులు… మంత్రికి కొత్తగా వినిపించడం వింతగా ఉంది. ప్రతి సందర్భంలోనూ ఏకవచనంతో మాట్లాడే మంత్రుల తీరు రౌడీలుగా ముద్ర పడ్డారు.
మాలలో ఉండడం వల్ల అంటూ…
మొన్నటి వరకు మాలలో ఉన్నానని అందువల్లే మౌనంగా ఉండాల్సి వచ్చిందని.. దీక్షలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండటం అలవాటు అని సెలవిచ్చారు. లేకుంటే చంద్రబాబు వ్యాఖ్యలకు మరో విధంగా స్పందించి ఉండేవాడినని చెప్పారు. రాష్ట్రంలో అన్నింటికి బాబు విధానాలే కారణమని, తాను చేసిన తప్పులను ఎదుటివారిపై నెట్టేసే నైజం ఆయనదని విమర్శించారు.