ఏపీ రాజధాని విషయంలో మొన్నటి వరకు పార్టీ పరంగా అంటీముట్టనట్టు ఉన్న బీజేపీ కొన్ని రోజులుగా స్వరం మార్చింది. కొన్నాళ్ల క్రితం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తమ పార్టీ మద్దతు అమరావతికే అని, ప్రధాని కూడా అమరావతివైపే ఉన్నారని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పాత్రే ముఖ్యమైనందున కేంద్రం పరిమిత జోక్యం ఉంటుందని, రాజధాని ప్రాంతంలోనే ఎయిమ్స్ ఉంటుందని, కేంద్రం అందుకే ఎయిమ్స్‌కి నిధులు ఇస్తోందని కేంద్రాన్ని కూడా సమర్థించుకునే యత్నం చేశారు. తాజాగా అమరావతిలో రాజధాని కోసం దీక్షలు ప్రారంభించి ఏడాదైన సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనభేరి సభలో ఆ పార్టీ అధికార ప్రతినిధి వామరాజు సత్యమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మనసా వాచా కర్మనా, త్రికరణశుద్ధిగా అమరావతి ఏపీ రాజధానిగా ఉండాలని తాము కోరుకుంటున్నామని, ఆఖరి రైతుకు న్యాయం జరిగే వరకూ బీజేపీ పోరాటం చేస్తుందని సత్యమూర్తి వ్యాఖ్యానించారు. పార్టీ అధికార ప్రతినిధి హోదాలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ పరంగానే భావిస్తున్న నేపథ్యంలో అమరావతి కోసం ఆకాంక్షిస్తున్నవారు..ఈ వ్యాఖ్యలను ఆహ్వానిస్తున్నా, రాజకీయంగా అమరావతి విషయంలో బీజేపీ అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. అమరావతి విషయంలో గతంలో జరిగిన పరిణామాలు ఇందుకు కారణంగా చెప్పవచ్చు.
స్వరం మారిన తీరు ఇదీ..
రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదే అని కేంద్రం అధికారికంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అంతేకాకుండా.. అమరావతి పోరాటంపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించలేదు. దీక్షలను అడ్డుకునేందుకు పోలీసుల చర్యలు, మహిళలపై పోలీసుల వ్యవహారశైలి సర్వత్రా విమర్శలు వచ్చినా, ఈ విషయంలోనూ బీజేపీ గట్టిగా మాట్లాడలేదు. మరోవైపు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ అమరావతికి మద్దతు ప్రకటించిన కొన్ని రోజులకే ఆయనను పదవి నుంచి తొలగించడంపైనా అప్పట్లో చర్చ నడిచింది. తరువాత అధికారంలో ఉన్న వైసీపీని వదిలి..ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబుపై విమర్శలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిగా పేరున్న సోము వీర్రాజుకి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఆయన కూడా రాజధాని విషయంలో గతంలో మూడు కాకపోతే..13 రాజధానులు పెట్టుకోండని అనే తరహా వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ నేతలు పురంధరేశ్వరి, సుజనాచౌదరి లాంటి వారు అమరావతిపై సానుకూలంగా మాట్లాడితే..వైసీపీ ‘జాతి’నాయకులుగా కామెంట్ చేసిన సందర్భంలోనూ రాష్ట్ర బీజేపీ పెద్దగా ప్రతిఘటించలేదు. రైతులకు భేడీలు వేసిన సందర్భంలోనూ.. ఆపార్టీ నుంచి పెద్దగా స్పందన లేదు. ఇక ఆ పార్టీ నాయకుడు విష్ణువర్దన్‌రెడ్డి అమరావతి దీక్షల్లో మహిళలు కట్టుకుంటున్న చీరల విషయంపై కామెంట్ చేయడం విమర్శలకు తావిచ్చింది. అయినా బీజేపీ సరి చేసుకునే ప్రయత్నం అప్పట్లో చేయలేదు. అలాంటి బీజేపీ ఇటీవల స్వరం మార్చింది. తాము అమరావతికే మద్దతు ఇస్తామని ప్రకటించింది. ఇందుకు ప్రధానంగా మూడు అంశాలు కారణమని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.
తిరుపతి ఉప ఎన్నిక..
అమరావతి విషయంలో బీజేపీ వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలున్నాయి. ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలోనూ ఇంత రాద్ధాంతం అవుతున్న నేపథ్యంలో..తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చే హామీలపై టీడీపీ విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంతో బీజేపీ విశ్వసనీయతకు ముప్పు వాటిల్లే అవకాశం కనిపిస్తోంది. అంటే..ఒక్క అమరావతి విషయమే అయినా..మొత్తం బీజేపీ హామీల విశ్వసనీయతకు ముప్పుగా పరిణమించే ఆస్కారం ఉంది. అధికారం కోసం బీజేపీ ఎలాంటి హామీలైనా ఇస్తుంది..తరువాత మాట మర్చే అవకాశం ఉందనే అభిప్రాయం రాకుండా.. తమ పార్టీ స్టాండ్‌ను చెప్పేందుకు బీజేపీ ఈ వ్యూహం అనుసరిస్తోందని చెప్పవచ్చు. అయితే కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇప్పిస్తామనే రీతిలో ఎక్కడా నాయకులు వ్యాఖ్యానించడం లేదు. ఎంత సేపూ రాష్ట్ర బీజేపీ అమరావతికే జై కొడుతోందని చెబుతున్నారు
Must READ ;- నాకు ఇల్లు లేదన్నారు.. అమరావతిలో ఇల్లు కట్టిన జగనేం పీకాడు: చంద్రబాబు

జిల్లాల్లో పట్టు కోసం
అమరావతి విషయంలో వైసీపీ వ్యవహరిస్తున్న తీరుతో ఆ ప్రాంతంలో సంబంధం ఉన్న దాదాపు పది నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో వైసీపీకి గెలుపు అవకాశాలు తక్కువేనన్న అంచనా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ కేవలం టీడీపీ మాత్రమే పట్టు సాధించే ఆస్కారం ఉండడం, కాంగ్రెస్ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ టైంలో రాజకీయంగా వైసీపీ వ్యతిరేక ఓటును తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ వేస్తున్న ప్లాన్‌గా భావించవచ్చు. రానున్న కాలంలో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక, స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిలో ఏ ఎన్నిక ముందు జరిగినా సరే.. బీజేపీ గెలిచినా, లేక రెండో స్థానంలో నిలిచినా ఆ ‘సానుకూలత’ను చూపించి ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ వేసిన ప్రణాళిగా భావించవచ్చు. ఇక్కడే మరో విషయం కూడా ఉంది. అమరావతి దీక్షల సందర్భంగా 200రోజులు పూర్తయిన టైంలో ఆన్‌లైన్ విధానంలో జరిగిన సంఘీభావ ర్యాలీకి అఖిల భారత హిందూ మహాసభ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా హిందూ మహాసభ ప్రతినిధి చక్రపాణి మహారాజ్ మట్లాడుతూ..అయోధ్య తరహాలో అమరావతి ప్రాంతంలోనూ రామాలయం నిర్మిస్తామని ప్రకటించారు. తరువాత కొన్ని రోజులకే వైసీపీ అసంతృప్త ఎంపీ రఘురామకృష్ణం రాజు లక్ష రూపాయలు విరాళం ఇస్తున్నట్లు చెప్పగా, తాను కూడా రూ. పది లక్షల విరాళం ఇస్తానని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి ట్వీట్ చేశారు. అంటే చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతంలో ఈ అంశాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకునే అవకాశం బీజేపీకి ఉందని చెప్పవచ్చు. ఆ మహాసభకు, బీజేపీకి ప్రత్యక్ష సంబంధం లేకున్నా..సైద్దాంతికంగా ఒకే అంశం వారికి ఉపయోగపడనుంది.
ఒత్తిడి కొనసాగింపు..
ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కొన్ని పక్షాలను సందర్భానికి అనుగుణంగా దగ్గరికి తీయవచ్చు..దూరంగా పెట్టవచ్చు.. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని కొనసాగించేందుకు వ్యూహాలూ అమలు చేయవచ్చు. అమరావతి విషయంపై బీజేపీ మద్దతు ప్రకటించడం వైసీపికి కొంత ఇబ్బందే. అందులోనూ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అయిన బీజేపీ ఇలా వ్యవహరించడం ఖచ్చితంగా మింగుడు పడని వ్యవహారమే. ఇటీవలే సీఎం జగన్ ధిల్లీ పర్యటన చేశారు. ఆయన ఢిల్లీ పర్యటన ముగిసిన తరువాత రాష్ట్ర బీజేపీ నేతలు వైసీపీపై విమర్శల స్థాయి పెంచారు. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. అంటే రానున్న కాలంలో రాష్ట్రాల నుంచి ఏదైనా అంశంపై కేంద్ర స్థాయిలో బీజేపీపై ఒత్తిడి పెంచే అవకాశం ఉందన్న అనుమానం కూడా ఉండి ఉండవచ్చు. అందులో భాగంగానే రాష్ట్రంలో మీ ఆట మీరు ఆడండి..మా వరకు మేం చూస్తాం అనే సంకేతాలు జాతీయ నాయకత్వం నుంచి రాష్ట్ర బీజేపీ నాయకులకు వచ్చాయేమోనన్న చర్చ నడుస్తోంది. అదే టైంలో జనసేనకు కూడా బ్రేక్ వేసినట్లు ఉంటుంది. కొన్నాళ్ల క్రితం పవన్ కల్యాణ్ అమరావతికి సపోర్టుగా పర్యటన చేశారు. దీంతో అటు టీడీపీకి, ఇటు జనసేనకు మాత్రమే అక్కడ మైలేజీ వస్తే తమకు నష్టమని బీజేపీ భావించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే బీజేపీ అమరావతి విషయంలో వ్యూహం మార్చింది. అయితే, రాజకీయ ప్రకటనలకే ఈ వ్యూహం పరిమితమా లేక కార్యాచరణ ఏమైనా ఉంటుందా అనేది తేలాల్సి ఉంది.
Also Read ;- రైతులపై ప్రేమా.. ఎన్నికల డ్రామానా? : వీర్రాజు నోట అమరావతి మాట











