ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకటోతేదీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఎప్పుడో మరచిపోయారు. ప్రతి నెలా 14తేదీ దాకా దఫదఫాలుగా జీతాలు జమ చేస్తున్న ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రచారం కోసం కోట్లాది రూపాయలను మంచినీళ్లప్రాయంగా ఖర్చు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి అనే పదాన్ని సీఎం జగన్మోహన్ రెడ్డి డిక్షనరీ నుంచి తొలగించినట్టు కనబడుతోంది. కేవలం సంక్షేమం అదికూడా నవరత్నాల పేరుతో ఎంచుకున్న వారి ఖాతాల్లో డబ్బు జమచేయడం అనే ఒకే ఒక అజెండాతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. సంక్షేమ పథకాలను ప్రచారం చేసుకునేందుకు టీవీలు, పత్రికల్లో ప్రకటనలు, బ్రోచర్ల ప్రింటింగ్ వంటి కార్యక్రమాలకు కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తోంది. తాజాగా ‘తొలియేడు జగనన్న తోడు గుండెలనిండా జనం అజెండా’ పేరుతో బ్రోచర్ల ముద్రణకు రూ.25 కోట్లు చెల్లించడం చర్చనీయాంశంగా మారింది.
పిచ్చి పీక్స్ కు చేరిందా?
2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాల అమలుకు మొదటి ఏడాది రూ.60 వేల కోట్లు అప్పులు చేసిన ప్రభుత్వం, ఈ ఏడాది 8 నెలల కాలంలో రూ.70 వేల కోట్లు అప్పులు చేసి అప్పుల్లో రికార్డులు నెలకొల్పారు. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం పడిపోయిందని చెబుతున్నారు. కానీ ఏపీలో ఆదాయం తెచ్చి పెట్టే ఒక్క పరిశ్రమను తీసుకురావడానికైనా సీఎం ప్రయత్నించిన దాఖలాలు కనిపించడం లేదు. కేవలం అప్పులు ఎలా చేయాలనే దానిపై మాత్రమే పరిశోధనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీలో ఒక్కొక్కరిపై రూ.2.5 లక్షల అప్పుల భారం మోపారు. ఇచ్చే వారంటే పది లక్షల కోట్లు అప్పులు తెచ్చేందుకైనా వెనకాడేలా కనిపించడం లేదు. ఎందుకంటే బ్యాంకులు అప్పులిచ్చేది ప్రభుత్వానికి. సీఎం మారినా వారి అప్పులను, వచ్చే వారు వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఏపీ చేసిన అప్పుల వడ్డీలకే ఏటా రూ.30 వేల కోట్లు చెల్లిస్తున్నారు. ప్రతీ నెలా అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు కూడా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తోందంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Must Read ;- అప్పులు, అస్తులు, పన్నులేనా.. ప్రజారోగ్యం మాటేమిటీ: చంద్రబాబు
ఇప్పటికే రూ.366 కోట్లు ఎత్తిపోశారు
ఏపీలో సంక్షేమ పథకాల ప్రచారానికి ఒకటిన్నర ఏడాదిలోనే రూ.366 కోట్లు ఖర్చు చేసినట్టు గణాంకాలు సూచిస్తున్నాయి. అందులో ఒక్క సాక్షి పత్రిక, టీవీలకే రూ.210 కోట్లు చెల్లించారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో సాక్షి మినహా మరో ప్రధాన పత్రికకు మాత్రమే ప్రకటనలు ఇస్తున్నారు. తాజాగా రూ.25 కోట్లు ఖర్చు చేసి బ్రోచర్ల ప్రింటింగ్ కు తెరలేపారు. అంటే వైసీపీలో ఎవరో ఒక నేతకు ఫ్రింటింగ్ మిషన్లు ఉన్నట్టు అనుమానించాల్సి వస్తోంది. ఉద్యోగుల జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బు లేదంటూనే ఇలా వందల కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే ప్రచార పిచ్చి పీక్స్ కు చేరిందని అనుమానించాల్సి వస్తోందని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.
అమ్మఒడికి డబ్బులేదు
వైసీపీ అధినేత మానసపుత్రిక అమ్మఒడి పథకం. ఈ పథకం కింద ఇప్పటికి ఒకసారి విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ.15వేల చొప్పున, కుటుంబానికి ఒకరికి మాత్రమే జమ చేశారు. ఇక రెండో ఏడాది అమ్మఒడికి నగదు జమ చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని విద్యాసంస్థలు 5 నెలలు మూతపడ్డాయి. తాజాగా నెల నుంచి ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఏపీకి మరో 5 వేల కోట్లు రుణం వచ్చే అవకాశం ఉంది. కరోనా పుణ్యమాని కేంద్రం సడలించిన నిబంధనలతో కొత్త అప్పులు చేసుకునేందుకు రాష్ట్రాలకు వెసులుబాటు కలిగింది. ఇలా ఏపీ ప్రభుత్వానికి ఏటా లక్ష కోట్లు అప్పుతీసుకునే అవకాశం దక్కింది. ఇప్పటికి తీసుకున్న అప్పులతో పాటు మరో. 20 వేల కోట్లు అప్పుతీసుకునే నింబంధనలను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. అంటే రాబోయే మూడు నెలల కాలంలో మరో 20 వేల కోట్లు అప్పు చేసి దేశంలోనే ఏపీని అప్పుల్లో మొదటి స్థానానికి తీసుకెళ్లే ప్రయత్నం గట్టిగా జరుగుతున్నట్టు భావించాల్సి వస్తోంది.
Also Read ;- రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్: అచ్చెన్న విమర్శ
ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రచారానికి పెద్దపీట
జగనన్నను జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేందుకు ఓ ఇంగ్లీషు పత్రికకు ఏకంగా ఒకేసారి రూ.8 కోట్లు చెల్లించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏముంది. ఏపీలో అమలు చేస్తున్న పథకాలు ఢిల్లీలో ప్రచారం చేసుకోవడం వల్ల సీఎం ఫోటోలు పత్రికలలో వస్తాయి, కానీ కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా అవుతోందనే విషయం పాలకులకు తెలియదా అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
ప్రభుత్వం వింతవాదన
ఏ ప్రభుత్వం అయినా అభివృద్ధి కార్యక్రమాల కోసం అప్పులు తెస్తూ ఉంటాయి. తెచ్చిన అప్పుల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తులు పెంచుకునే కార్యక్రమాలు చేస్తాయి. అప్పు చేసి ఏదైనా ఒక ప్రాజెక్టు నిర్మించడం వల్ల దీర్ఘకాలంలో ఫలితాలు దక్కుతాయి. అలా కాకుండా నేరుగా నగదు జమ చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తులు పెరిగేది ఏమీ ఉండదు. పైగా అప్పుల కుప్పలు మాత్రం పెరుగుతాయి. కానీ ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆర్థిక శాస్త్రానికే కొత్త భాష్యం చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి బుగ్గన చెప్పిన విషయం చదువుకోని వారికి కమ్మగా ఉండవచ్చు కానీ, ఏమాత్రం చదువుకున్న వారైనా ఆ అబద్దాలు అర్థం చేసుకోవచ్చు. ప్రజల ఖాతాల్లో డబ్బు వేయడం ద్వారా రాబోయే 20 సంవత్సరాల తరవాత ఫలితాలు కనిపిస్తాయని ఆర్థిక మంత్రి అసెంబ్లీలో చెప్పిన విషయాలు హాస్యాస్పదంగా ఉన్నాయి. కేవలం ఒక వర్గం ఓట్ల కోసం వారి ఖాతాల్లో ఏటా రూ.60 నుంచి రూ.70 వేల దాకా జమ చేస్తున్నారు. బాగానే ఉంది. మరి పన్నులు చెల్లించే వారు నలిగిపోతున్నారు. ఇప్పటికే పొరుగు రాష్ట్రాలకన్నా ఏపీలో పెట్రోలు, గ్యాస్ ధరలు చాలా ఎక్కువగా పెంచారు. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచకుండా స్లాబులు మార్చి దొపీడీకి తెరలేపారు. పల్లెవెలుగు బస్సులను ఎక్స్ ప్రెస్ లుగా పేరుమార్చి రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక ఇసుక ధర బంగారంతో పోటీ పడుతోంది. ఇలా కొందరి వద్ద పిండి మరికొందరి ఖాతాల్లో వేయడం సంక్షేమం అనుకుంటే రాబోయే కొద్ది రోజుల్లోనే సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read ;- భారీ స్కెచ్ : కార్పొరేషన్ ఆదాయం పెంపు.. మరో రూ.25 వేల కోట్ల అప్పునకు యత్నం











