జనవరి తొలివారంలో భారతదేశంలో వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రజలకు వాక్సిన్ వేయడానికి సన్నాహాలు చేసుకోవాల్సిందిగా.. రాష్ట్రప్రభుత్వాలకు ఆదేశాలు అంది చాలా కాలం అయింది. క్షేత్ర స్థాయి వరకు ఆ ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి. అయితే వాక్సిన్ రావడం అనేది.. ఇవాళ్టితో ఏడాది పూర్తి చేసుకుంటున్న అమరావతి రాజధాని పోరాటంపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? అసలు ఈ రెండింటికీ సంబంధం ఉంటుందా? ఉంటే, అది ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేయబోతోంది? ఇవన్నీ చాలా కీలకమైన అంశాలు.
కొవిడ్ వాక్సిన్.. పోరాటానికి బలం!
నేడో రేపో అందుబాటులోకి వస్తుందని అనుకుంటున్న కొవిడ్ వాక్సిన్ అమరావతి రాజధాని పోరాటానికి తిరుగులేని బలాన్ని ఇస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎలాగంటే..
ఇప్పటికి ఏడాది కిందట అమరావతి రాజధానిని రక్షించుకోవడానికి అక్కడి రైతులు పోరాటం ప్రారంభించారు. శాంతియుత ఉద్యమాలతో ధర్మబద్ధమైన తమ డిమాండ్ ను వారు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు. న్యాయపోరాటాలు సాగిస్తున్నారు. అయితే అమరావతి ఉద్యమం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఉద్యమంగా, ఒక వర్గానికి మాత్రమే పరిమితమైన ఉద్యమంగా రంగుపులిమి వారిని నైతికంగా బలహీనపరచడానికి అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తూ ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఇతర ప్రాంతాలనుంచి ఈ పోరాటానికి మద్దతిచ్చే వారు ఉన్నప్పటికీ.. వారు తరచుగా అమరావతి శిబిరాలకు వచ్చి తమ సంఘీభావం తెలియజెబుతున్నప్పటికీ.. అంత ప్రముఖంగా ప్రాచుర్యంలోకి రావడం లేదు.
కొవిడ్ శాపం..
అమరావతి ఉద్యమం ప్రారంభం అయిన సమయంలోనే ఇంచుమించుగా కొవిడ్ మహమ్మారి కూడా జడలు విప్పుకుంది. అమరావతి రైతుల డిమాండ్ లోని సహేతుకత, న్యాయబద్ధత రాష్ట్రానికంతా తెలిసి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఒక్కటే రాజధానిగా కావాలనే డిమాండ్.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల్లో సమానంగా వ్యక్తం అయ్యేలోగానే.. కొవిడ్ భారత్ లోకి కూడా ప్రవేశించింది.
అప్పట్లో చంద్రబాబునాయుడు పోరాటానికి మద్దతుగా ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. తిరుపతి, రాజమండ్రి ఇలా.. ఇతర ప్రాంతాల్లో కూడా అమరావతి పోరాటం కోసం భిక్షాటన పేరుతో కార్యక్రమాలు నిర్వహించి.. ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేసేందుకు కృషిచేశారు. రాష్ట్రమంతా ఈ జ్వాలలు అంటుకుంటున్న సమయంలోనే.. లాక్ డౌన్ వచ్చి పడింది. దాంతో రాజధాని అమరావతి పోరాటం ఒక ప్రాంతం దాటి ఇతర ప్రాంతాలకు విస్తరించలేదు.
Must Read ;- వ్యాక్సినేషన్‌పై విజయసాయి ట్వీట్.. అంతలోనే డిలీట్!
వాక్సిన్ వస్తే జరిగేది అదే..
ఇప్పుడు వాక్సిన్ సిద్ధం అవుతోంది. జనవరి మొదటివారానికెల్లా వాక్సిన్ వేయడం ప్రారంభం కావచ్చుననే అంచనాలు సాగుతున్నాయి. రెండు నెలల్లోగా.. దేశంలో చాలా వరకు వాక్సినేషన్ పూర్తయ్యే అవకాశమూ ఉంది. రాజధాని విశాఖకు తరలించడం అనేది ఇక్కడ ప్రధానాంశం కాదు.. కానీ, ఇప్పటికే యాభై వేల ఎకరాల భూమిని సమీకరించి, వేల కోట్లరూపాయల పెట్టుబడులు పెట్టి.. రాజధాని నిర్మాణాలు అనేకం దాదాపుగా పూర్తిచేసిన అమరావతి ప్రాంతాన్ని వల్లకాడుగా మార్చేయడం అనేదే రాష్ట్రవ్యాప్తంగా ప్రజల కడుపు మండిస్తోంది.
చంద్రబాబునాయుడు- అమరావతి అనే నగరాన్ని ప్రపంచం మనవైపు తలెత్తిచూసే నగరంగా తీర్చిదిద్దుతానని తన భవిష్యద్దర్శనాన్ని ప్రకటించినప్పుడు.. రాజకీయ భావజాలం పరంగా ఆయనంటే కిట్టని వారు కూడా.. మన రాష్ట్రానికి ఒక అద్భుతమైన నగరం రాబోతున్నదని సంబరపడ్డారు. వాటి నిర్మాణ కార్యకలాపాలు కూడా ప్రారంభం అయ్యాక.. ఆ కలలు మరింత సాకారం అయ్యేలా కనిపించాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత.. ఎక్కడి పనులు అక్కడ ఆపేసి.. అమరావతిని వల్లకాడుగా మారుస్తున్న తీరు చూసి.. అందరి స్వప్నాలు భంగపడ్డాయి.
ఇప్పుడు మళ్లీ రాజుకుంటోంది..
అమరావతి కోసం రైతులు ఏడాదిగా సాగిస్తున్న పోరాటం.. వారి పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న అమానుషమైన తీరు.. అన్నింటినీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడిప్పుడే వారందరిలో అమరావతి రాజధాని పట్ల కాంక్ష మళ్లీ రగులుకుంటోంది. రాష్ట్రంలో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దానికి తోడు వాక్సిన్ కూడా ఇవాళ రేపో వచ్చేయబోతోంది. వాక్సిన్ వచ్చేసి.. ప్రజలలో కొవిడ్ భయం తొలగిపోతే.. ఆటోమేటిగ్గా కొవిడ్ ఆంక్షలు కూడా తొలగిపోతాయి. దాంతో అమరావతి రాజధాని అనుకూల ఉద్యమం రాష్ట్రమంతా ఉధృతమయ్యే అవకాశం ఉంది.
ప్రత్యేకించి రాయలసీమలో కూడా అమరావతి అనుకూల పోరాటాలు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రానికి ఒక చివర్న ఉండే విశాఖ రాజధాని అంటే.. ఏ కుప్పంలోనో, అనంతపురంలోనో ఉండే వారికి ఎంతటి ఇబ్బంది ఉంటుందో అందరూ గుర్తించదగినదే. దానికి తోడు ఉద్యమానికి దన్నుగా రాజకీయ పార్టీలు కూడా క్రియాశీలంగా రంగంలోకి దిగితే గనుక.. అమరావతి పోరాటం రాష్ట్రమంతా విస్తరిస్తుంది.
సర్కారుకు చుక్కలే..
అమరావతి పోరాటం రాష్ట్రమంతా విస్తరిస్తే దానిని అణచి వేయడం ప్రభుత్వానికి కష్టసాధ్యం అవుతుంది. అమరావతి రైతులు ఏడాదిగా శిబిరాల్లో దీక్షలు చేస్తోంటే.. వారిని నైతికంగా దెబ్బకొడుతూ.. రెచ్చకొట్టడానికి మూడు రాజధానుల అనుకూల ఉద్యమాన్ని పెయిడ్ పోరాటంగా అక్కడే చేయిస్తున్నారు. అదే వాక్సిన్ వచ్చిన తర్వాత.. రాష్ట్రవ్యాప్తంగా రాజధాని ఉద్యమం మొదలైతే గనుక.. రాష్ట్రమంతా మూడు రాజధానుల పోరాటాలు పెయిడ్ తరహాలో చేయించడం సాధ్యం కాదు. ఆరకంగా ప్రభుత్వానికి చిక్కులు తప్పకపోవచ్చు.
ప్రభుత్వం సానుకూల వైఖరితో ఆలోచించి.. తమ వైఫల్యం మరింత బట్టబయలు కాకముందే.. ప్రజల్లోని అమరావతి రాజధాని అభిలాషను గుర్తించి తదనుగుణంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది.
Also Read ;- నేను రాజధానిగా పనికిరానా..! అమరావతి ఆక్రందన