నేములో నేముంది? అన్నాడు షేక్ స్పియర్ . మనిషి పేరు వరకూ అది ఓకే కానీ.. సినిమా టైటిల్ పరంగా మాత్రం అదో పెద్ద సెంటిమెంటని చెప్పుకుతీరాలి. సినిమాకి ఒక టైటిల్ ఫిక్స్ చేసేటప్పుడు ముందు వెనక కొన్ని సెంటిమెంట్స్ ను పరిగణనలోకి తీసుకుంటారు హీరోలు, దర్శక, నిర్మాతలు. ముఖ్యంగా అందులో ఏదైనా నెగెటివిటీ ధ్వనిస్తే.. ఆ టైటిల్ విరమించుకుంటారు. ఇప్పుడు బాలయ్య, బోయపాటి సినిమా టైటిల్ విషయంలో కూడా ఆ సెంటిమెంట్ నే ప్రధానంగా తీసుకున్నారు. ఈ సినిమాకి ‘మోనార్క్’ అని, ‘డేంజర్’ అని ఇలా పలు టైటిల్స్ ప్రచారం లో ఉన్నాయి. ఈ రెండింటిలో ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారో తెలియదు. కానీ అందులో ఒకటి మాత్రం ఖాయం గా కనిపిస్తోంది.
బాలయ్య, బోయపాటి కలయికలో వచ్చిన రెండో చిత్రం ‘లెజెండ్’ టైటిల్ తో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది దృష్టిలో పెట్టుకొనే .. ఇప్పుడు అదే ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ ను తమ కాంబినేషన్ లోని మూడో చిత్రానికీ కొనసాగించబోతున్నారు. ఆ సెంటిమెంట్ ఇక్కడితో ఒకే కానీ.. టోటల్ గా బాలకృష్ణ కెరీర్ లోని ఇంగ్లీష్ టైటిల్స్ విషయంలో మాత్రం ఈ సెంటిమెంట్ తప్పడం గమనార్హం.
బాలయ్య కెరీర్ బిగినింగ్ నుంచీ చూసుకుంటే.. ‘డిస్కో కింగ్, టాప్ హీరో, లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, లెజెండ్, లయన్, డిక్టేటర్, రూలర్’ సినిమాలు మాత్రమే ఇంగ్లీష్ టైటిల్స్ తో వచ్చాయి. మొత్తంగా ఈ ఎనిమిది సినిమాల్లోనూ కేవలం ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్ పెక్టర్, లెజెండ్‘ సక్సెస్ అయ్యాయి.
మిగతా ఐదు సినిమాలు ఘోర పరాజయం చవిచూశాయి. మరి ఇప్పుడు రాబోయే సినిమాకు బోయపాటి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో లేక బాలయ్య టోటల్ ఇంగ్లీష్ టైటిల్స్ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందో తెలియదు కానీ.. ఈ సినిమా స్టోరీ లైన్, బాలకృష్ణ చేయబోతున్న రెండు పవర్ ఫుల్ పాత్రల పరంగా చూస్తే.. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు. బాలయ్య పుట్టిన రోజున విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు వచ్చిన రెస్పాండ్ ను బట్టి చూస్తే.. వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ కొడతారని అనిపిస్తోంది. అంతేకాదండోయ్.. బాలయ్య చేయబోతున్న అఘోరా పాత్ర కూడా సినిమా మీద అంచనాల్ని ఓ రేంజ్ లో పెంచేసింది. అది కానీ ఏమాత్రం పేలినా.. ఈ సినిమాకి బోయపాటి సెంటిమెంట్ వర్కవుట్ అయినట్లే.