దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలతో టీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతపై బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు 1118 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. సీఎం కేసీఆర్, ట్రబుల్ షూటర్‌గా పేరున్న మంత్రి హరీష్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ విజయం సాధించడమనేది సాధారణ విషయమేమీ కాదు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్.. దుబ్బాక విజయం నేపథ్యంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ జెండా ఎగరేసేది బీజేపీ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. అంతే కాకుండా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని మేయర్ పీఠంపై కాషాయ జెండాను ఎగరవేస్తామన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బస్తీ ప్రజలు తమకు పట్టం కట్టబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యాలు పలు చర్చలకు దారితీస్తోంది. దుబ్బాక సీటు గెలవగానే బీజేపీ పార్టీలో ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఒక్క సీటు గెలవగానే ఇక తామే హీరోలమనే మితిమీరిన విశ్వాసాన్ని ప్రదర్శించడం పనికిరాదని హితవు పలుకుతున్నారు.
100 సీట్లు సాధ్యమేనా?..
దుబ్బాకలో బీజేపీ పార్టీ గెలుపు రాష్ట్రంలో పలు రాజకీయ చర్చలకు కేంద్ర బింధువుగా మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆ విజయాన్ని గ్రేటర్ ఎన్నికలకు ముడిపెడుతూ బీజేపీ అంతలా ప్రకటనలు చేయడం సరికాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేటర్‌లో బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీలను బీజేపీ ఎదుర్కొని 100 డివిజన్లను గెలిచే వాతావరణం అసలు ఉందా? ఈ రెండు పార్టీల కంటే బలమైన క్యాడర్ బీజేపీకి గ్రేటర్‌లో ఉందా? గ్రేటర్‌లో మొత్తం 150 డివిజన్లు ఉన్నాయి. ఇందులో పాతబస్తీ పరిధిలోనే దాదాపు 50 డివిజన్లు ఉన్నాయి. ఈ 50 డివిజన్లలో కూడా 40 నుంచి 50 లోపు స్థానాలను ఎప్పుడూ ఎంఐఎం పార్టీయే గెలుచుకుంటూ వస్తోంది. మిగతా 100 డివిజన్లలోనే మిగతా పార్టీలన్నీ పోటీ పడాల్సి ఉంటుంది. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ ఇతర ఏ పార్టీలు పోటీ పడాలన్నా ఈ 100 డివిజన్లలోనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఎంఐఎం బలంగా ఉన్న ప్రాంతాల్లో అక్కడ ఇతర పార్టీలు గెలిచే అవకాశం ఉండదు. అన్ని పార్టీలు తలపడే మిగిలిన 100 డివిజన్లలో వందకు వంద మొత్తం స్థానాలు ఒక బీజేపీయే గెలిచే ఛాన్స్‌లేనే లేదు. మరీ అలాంటప్పుడు బండి సంజయ్ ఏ విశ్వాసంతో ఇలా ప్రకటన చేశారో అతనికే తెలియాలి. 100 స్థానాలను గెలిచేందుకుగానూ కాషాయ పార్టీ ఏమైనా సరికొత్త స్ట్రాటజీని గ్రేటర్ ఎన్నికల్లో అమలుచేస్తోందా? లేక దుబ్బాక ఎన్నిక గెలవగానే ఆ పార్టీలో ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగి ఇలా ప్రకటన చేశారా? అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది.
దుబ్బాకలో టీఆర్ఎస్ పార్టీ ఓడి పోవడానికి ఆ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్సే ఒక కారణం. లక్ష ఓట్ల మెజారిటీతో గెలుస్తామని ముందు నుంచి అనుకుంటూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ.. చివరకు ఒక్క ఓటుతో గెలిచినా చాలూ అనే వరకు ఆ పార్టీ పరిస్థితి దిగజారింది. మరీ ఈ విషయాన్ని అర్ధం చేసుకోకుండా బీజేపీ పార్టీ ఇంతలా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపడం సరికాదంటున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచిన తరువాత ఏ పార్టీ అయినా ఇలానే ఓవర్ కాన్ఫిడెన్స్‌తో కొన్ని ప్రకటనలు చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. వారి చేసే ప్రకటనలను అంతా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని అంటున్నారు.











