(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో పట్టు సాధించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్న బీజేపీ ఉత్తరాంధ్రలో ఉనికిని చాటుకునేందుకు తహతహలాడుతోంది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా ప్రభుత్వ మాజీ విప్, టీడీపీ సీనియర్ నాయకుడు, చీపురుపల్లి మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును, గజపతినగరం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ మాజీ మంత్రి పడాల అరుణను బీజేపీలో చేర్చుకుంది. అదే స్ఫూర్తి, వారి చొరవతో ఉత్తరాంధ్రలో కీలకనేత, టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోంది.
సోమును కలిసిన వినయ్
టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు కళా వెంకట్రావు సోదరుడు, రేగిడి మండల పరిషత్తు మాజీ అధ్యక్షుడు కిమిడి రామకృష్ణంనాయుడు తనయుడు వినయ్‌కుమార్ ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును విశాఖలో కలిశారు. బీజేపీ నాయకుల పిలుపు మేరకు మాజీ మంత్రి పడాల అరుణతో కలిసి వీర్రాజును కలిసినట్లు వినయ్ కుమార్ తెలిపారు. పార్టీలోకి రావాలని, త్వరగా నిర్ణయం తీసుకోవాలని సోము వీర్రాజు కోరినట్లు చెప్పారు.పార్టీ శ్రేణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వివరించినట్లు పేర్కొన్నారు. గతంలో రేగిడి వచ్చిన బీజేపీ ప్రతినిధులు గద్దె బాబూరావు, రెడ్డి పావనిలు రామకృష్ణంనాయుడుతో చర్చించారు. తాజాగా వినయ్‌కుమార్ వీరితో కలవడం పార్టీలో చేరడం ఖాయమనే ఊహాగానాలు బలపడుతున్నాయి. వినయ్ కుమార్ ప్రస్తుతం టీడీపీ రేగిడి మండలాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
Must Read ;- వాణీ విశ్వనాధ్‌తో సోము వీర్రాజు : ఏంటి మతలబు?