భూ ఆక్రమణల ఆరోపణలతో మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన మాజీ మంత్రి ఈటల శుక్రవారం తన ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీతో ఉన్న అనుబందాన్ని తెంచుకున్నారు. రాజీనామా సందర్భంగా మీడియా సమావేశంలో ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యంగా తాను ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని, బానిసగా బతకలేనని, కుట్రపూరితంగానే తనపై ఆరోపణలు చేయించారని వ్యాఖ్యానించారు. పార్టీలో చాలామందికి అవమానాలు ఎదురవుతున్నాయన్నారు. ఈటల ప్రెస్ మీట్‌లోని అంశాలు ఇవీ..
ఐదేళ్ల క్రితమే గ్యాప్ వచ్చింది..
‘కేసీఆర్‌కు తనకు మధ్య గ్యాప్ ఇటీవలే వచ్చింది కాదు. ఐదేళ్ల క్రితమే వచ్చింది. నేను రైతుబంధు విషయంలో కొన్ని మార్పులు చెప్పాను. ధనవంతులకు రైతు బంధు వద్దని, పేదలకు, మధ్యతరగతి వారికి లబ్ధి చేకూర్చేలా మార్పులు చేయాలని సూచించాను. కరీంనగర్ జిల్లాకు ఉద్యమకారులను గెలిపించిన చరిత్ర ఉంది. కాని కేసీఆర్ కుట్రలను, డబ్బును, అణచివేతను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నాడు. హరీష్ రావు కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు మూడుసార్లు ప్రగతి భవన్‌కు వెళ్లినా కలనివ్వలేదు. మొదటిసారి ఎమ్మెల్యేలం కొందరం వెళ్లాం. కలవలేదు. రెండోసారి అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లాం. దొరకలేదు. రెండుసార్లు వెళ్లి వెనక్కి వచ్చా. మూడోసారి కూడా అలాగే జరిగింది. కేసీఆర్‌కు మందు గోళీలు ఇచ్చే సంతోష్‌ను నిలదీశా. స్పందన లేదు. అది ప్రగతి భవన్ కాదు. భానిస భవన్. మంత్రి పదవి ఇచ్చి బానిసగా బతకమంటే నేను ఆ పనిచేయలేను. రాష్ట్రం కోసమే ఇన్నాళ్లు అవమానాలు భరించా. నిరంతరం ప్రజల మేలు కోసమే ఆలోచించా. ప్రస్తుత పరిస్థితుల్లోనూ వైద్య మంత్రి లేకుండానే సమీక్షలు చేస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండానే రాత్రికి రాత్రి నాపై విచారణ ముగించేసి బర్తరఫ్ చేశారు. ఉరిశిక్ష పడిన ఖైదీని కూడా చివరి కోరిక ఏంటని అడగుతారు. ఇక్కడ అది కూడా జరగలేదు. వివరణా తీసుకోలేదు. బెదిరింపులకు దిగారు. నా అనుచరులనూ బెదిరించారు. నావాళ్లు ఆ బెదిరింపులకు భయపడలేదు. నా వెంట హుజూరాబాద్ ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయాన్ని తీసుకున్నాకే రాజీనామా చేస్తున్నా. గతంలో నయీం లాంటి వ్యక్తులు చంపుతానని బెదిరించారు. అయినా తెలంగాణ జెండాను వదల్లేదు.
Must Read ;- ఆయనొస్తే తమ ప్రాధాన్యం తగ్గుతుందనా.. తెలంగాణ బీజేపీలో ఈటల ప్రకంపనలు
కేసీఆర్‌కు ఉద్యమం కోసం ఉద్యోగ, కార్మిక, వ్యాపార సంఘాలు కావాలి. అధికారంలోకి వచ్చాక వాటిని పనిచేయనివ్వడం లేదు. ఆర్థిక మంత్రిగా టీఎన్జీవోలు నన్ను కలిస్తే అవహేళన చేశారు. తెలంగాణ బొగ్గు గని కార్మిసంఘం ఏర్పాటుకు కారణం నేనే. ఇప్పుడు కేసీఆర్ కుమార్తె కవిత ఆ సంఘాన్ని నడుపుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘం ఏర్పాటుకు నేను,హరీష్ రావు కారణం. ఇప్పుడు ఆ కార్మిక సంఘానికి హక్కుల్లేకుండా చేశారు. పెన్షన్లను సీఎంకు చెప్పి ఇప్పిస్తానని, ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే విషయాన్ని సీఎంతో మాట్లాడతానని చెప్పడం తప్పెలా అవుతుంది. రాష్ట్రం కోసం, తెలంగాణ బిడ్డల భవిష్యత్ కోసం, రోషం గల బిడ్డను కాబట్టే టీఆర్ఎస్‌లో చేరా. అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ అజెండా మారింది. మంత్రి పదవి ఇచ్చి బానిస బతుకు బతకమంటే సాధ్యం కాదు. టీఆర్ఎస్ పార్టీ పెట్టింది ఏక వ్యక్తిగా కాదు. లాలూ ప్రసాద్ యాదవ్, మాయవతి తరహాలో పెట్టలేదు. ఉద్యమ పార్టీ. వందల మంది బలిదానం చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చాక పార్టీ మారింది. బయటివారు లోపలికి, లోపలివారు బయటకు అన్నట్లు మార్చారు. కేసీఆర్‌ని బెదిరించినవారు ఇప్పుడు ఆయన పక్కనే చేరారు. ఆయనకు ఆప్తులయ్యారు. కాని ముందు నుంచి ఉన్న వారిని బయటకు పంపించే కుట్ర చేశారు. ఆలె నరేంద్ర (టైగర్ నరేంద్ర), విజయశాంతి, కోదండరామ్ లనూ అలాగే కుట్ర చేసి పంపించారు. ఉద్యమంలో చెప్పిన మాటలను మరిచారు. నక్సలైట్ల అజెండానే తన అజెండా అని చెప్పారు కేసీఆర్. కాని వరవరరావు అరెస్టు విషయంలో మౌనంగా ఎందుకున్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక దళిత ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సహాయం అడిగితే చేయవద్దని చెప్పారు. ఇదేం నీతి. ఉద్యమ బిడ్డగా నాకు టిక్కెట్ ఇచ్చారు. నేను గెలిచి వచ్చాను. కేసీఆర్ తన సొంత కూతురికి కూడా బీఫామ్ ఇచ్చారు. ఆమె ఓడిపోయారు. నేను ఉద్యమకారుడిగా, కార్యకర్తగా, ప్రజల మనిషిగా ఉన్నా. నల్గొండ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. డబ్బు, అణచివేతతోనే రాజకీయాలు ఎప్పటికీ నడవవు. డబ్బులతో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిస్తే గెలవచ్చు. కానీ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్మరు. ఉద్యమం కోసం నిన్ను నమ్మారు. ఆ రోజు నా వెంట నేను, నా భార్య మాత్రమే ఉన్నామని చెబితే తెలంగాణ కోసం మీ వెంట వచ్చాం. అప్పుడు ఎవరూ మీ వెంట లేరు. వందల మంది బలిదానంతో తెలంగాణ సాకారమైంది. నాకు డబ్బుకంటే ఆత్మాభిమానం, తెలంగాణ బిడ్డల భవిష్యత్ ముఖ్యం. తెలంగాణ ఉద్యమాన్ని విరమిస్తే రూ.50 వేల కోట్లు ఇస్తామని కొందరు చెప్పారు. కాని తెలంగాణ బిడ్డల భవిష్యత్, తెలంగాణ ఆత్మగౌరవమే ముఖ్యమని చెప్పి ఉద్యమాన్ని కొనసాగించాం. కాని తెలంగాణ వచ్చాక మీ వెంట ఉన్నవారెవరు, వారు గతంలో ఏం చేశారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణ వచ్చాక దళితుడినే తొలి ముఖ్యమంత్రిని చేస్తామని కేసీఆర్ చెప్పారు. కాని ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒక్క బీసీ అధికారి కాని, ఎస్సీ అధికారి కాని ఉన్నారా. వాళ్లకి ప్రాధాన్యం ఎక్కడుంది. చివరికి తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ధర్నా చౌక్‌ని కూడా తీసేసి ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రగతి లేకుండా బంగారు తెలంగాణ సాధ్యం కాదు. విద్యుత్, నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు. కాని చేయాల్సినవి చాలా ఉన్నాయి. పొట్టోడి నెత్తిని పొడుగోడు కొడితే.. పొడుగోడి నెత్తిని పోశమ్మ కొట్టిందని కేసీఆర్ చెబుతారు. అదే పరిస్థితి కేసీఆర్‌కు వస్తుంది. గతంలో మెజార్టీ ఉన్నా తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొన్నారు. దీనిపై సానుకూల విధానంలోనే అడిగా. 2018లో అన్ని సీట్లు వస్తాయని ఊహించలేదని చెప్పా. ఆ మాటలనూ వక్రీకరించారు. ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు ఆపాదించి నేను బతికుండగానే బొందపెట్టాలని కుట్ర చేశారు ’ అని వ్యాఖ్యానించారు ఈటల.
ఈటల రాజేందర్ తోపాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్, తులా ఉమతో పాటు మరికొందరు నేతలు కూడా పార్టీకి రాజీనామా చేశారు. త్వరలో మరికొందరు నేతలు కూడా తమతో కలిసి వస్తారని, అందరం చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు ఈటల. అయితే కొత్త పార్టీ పెట్టే ఆలోచన లేదని చెప్పిన ఈటల బీజేపీలో చేరికపై స్పష్టత ఇవ్వలేదు.
Also Read ;- మేం కష్టపడి పైకొచ్చాం.. ఎవరికీ భయపడేది లేదు : ఈటల రాజేందర్ భార్య జమున