వరుస వైఫల్యాలతో అస్థిత్వానికే ముప్పు తెచ్చుకున్న పరిస్థితిలో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకోనుందనే ప్రచారం మొదలైంది.అందులో భాగంగా ఫైర్ బ్రాండ్,మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి టీపీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని,పేరు ఫైనల్ అయినా అధికారిక ప్రకటన రావాల్సి ఉందని వార్తలు వస్తున్నాయి. దీనిపై రేవంత్ రెడ్డి కూడా స్పందించారు.ఇందుకు సంబంధించి పార్టీ ఇంకా నిర్ణయం తీసుకోలేదని, పార్టీ అధికారికంగా వెల్లడిస్తుందని, ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని క్లారిటీ ఇచ్చారు.
అసలు విషయానికి వస్తే..
అసలు ఆ ప్రచారం ఎందుకు జరిగిందనే విషయానికి వస్తే తెలంగాణలో పాటు కేరళలోనూ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిలను నియమించాల్సి ఉంది.తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న కీలక నేతలు బయటకు వెళ్తున్నారు.కూన శ్రీశైలం గౌడ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి,బండ కార్తీకరెడ్డి,పాల్వాయి హరీష్ లాంటివాళ్లు బయటకు వెళ్తున్నారు.అదే సమయంలో ఇతర పార్టీల్లోని నేతలను కాంగ్రెస్‌లోకి తీసుకువచ్చే విషయంలోనూ పార్టీ విఫలం అవుతున్న నేపథ్యంలో పీసీసీ మార్పు తక్షణం జరగాలనే నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు తెలుస్తోంది.ఇందుకు ఈటల ఎపిసోడ్ కూడా కారణం కావచ్చని చెబుతున్నారు.ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి ఉద్వాసనకు గురైన తరువాత రేవంత్‌రెడ్డి లాంటివారు ఈటలకు పరోక్షంగా మద్దతు పలికారు.అయితే ఆ స్థాయిలో పార్టీలోని నేతలు మద్దతు పలకలేదు.అయితే కొందరు నాయకులు ఈటలపై విమర్శలు చేయకుండా తటస్థంగా ఉండగా మరికొందరు విమర్శలు చేశారు.ఇందుకు కారణం కూడా ఉంది. హుజూరాబాద్ కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్‌రెడ్డికి సోదరుడు. గతంలో ఈటలపై పోటీ చేశారు.కాంగ్రెస్‌లోని రేవంత్‌రెడ్డి,వీహెచ్‌తో పాటు మరికొందరు నేతలు ఈటలకు మద్దతు పలకగా కౌశిక్‌రెడ్డి ఈటల రాజేందర్‌పై తీవ్ర విమర్శలు చేశారు.ఈ విషయంలో పలు ఫిర్యాదులు అధిష్టానానికి వెళ్లినట్టు తెలుస్తోంది.ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వారు పార్టీని వీడడంతో పార్టీ షాక్ తిందని చెప్పవచ్చు.పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొందరు నాయకులు చేజారే అవకాశం ఉందన్న అభిప్రాయంతో టీపీసీసీ నియామకంపై పార్టీ అధిష్టానం చర్చలు జరుపుతున్నట్లు చెప్పవచ్చు.
కేరళ, తెలంగాణ పీసీసీలపై చర్చ..
కాగా కేరళలోనూ నియామకం జరుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు.కేరళ పీసీసీ రేసులో కే.సుధాకరన్, కొడిక్కుణ్ణిల్ సురేశ్,పీటీ థామస్ మధ్య పోటీ ఉండగా సుధాకరన్,సురేశ్‌లిద్దరు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా కొనసాగుతున్నారు.పీటీ థామస్‌కు ఖారారైందనే వార్తలు అక్కడి మీడియాలో వచ్చాయి.అయితే అక్కడ సుధాకరన్ వర్గం ఆన్ లైన్ ఉద్యమం మొదలు పెట్టింది.సేవ్ సుధాకరన్,సేవ్ కాంగ్రెస్ అని ఆయన అభిమానులు పార్టీ అధిష్టానానికి మెయిల్స్ పంపే ఉద్యమాన్ని మొదలు పెట్టింది.దీన్నిబట్టి తెలంగాణ,కేరళ పీసీసీ ఇష్యూలపై హైకమాండ్ చర్చలు మొదలు పెట్టిందని చెప్పవచ్చు.కొవిడ్ సెకండ్ వేవ్ తగ్గాక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Must Read ;- చేయి చేయి కలుపుదాం.. కరోనాను తరిమి కొడదాం : కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ విషయానికి వస్తే..
ఇక తెలంగాణ పీసీసీ విషయానికి రేవంత్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,భట్టి విక్రమార్క,పొన్నం ప్రభాకర్,జీవన్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్యతో పాటు సామాజిక వర్గాల ప్రకారం చర్చలు నడుస్తున్నాయి.ఇప్పటికే సామాజిక సమీకరణలు, కార్యకర్తల ఫీడ్‌బ్యాక్ తీసుకున్న విషయం తెలిసిందే.కాగా టీపీసీసీ ఎంపికలో గతంలో సోనియాగాంధీతో పాటు అక్కడ కోటరీ నిర్ణయాలు ప్రభావం చూపేవని,ఇప్పుడు రాహుల్, ప్రియాంకల నిర్ణయంతో పాటు క్షేత్రస్థాయి ఫీడ్ బ్యాక్ మాత్రమే నిర్ణయాత్మకంగా మారుతుందని చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే జనాకర్షణ ఉన్న నేతలకే బాధ్యతలు అప్పజెబుతారన్న సంకేతాలు వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి పేరును ఆయన అభిమానులు ప్రచారం చేస్తున్నారు.అదే సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ అవకాశాలున్నాయని, ఎన్‌ఎస్‌యూఐ స్థాయి నుంచి పార్టీ నేతలతో సంబంధాలున్నాయనే విషయాన్ని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు.
అధిష్టానం తీసుకునే నిర్ణయానికి..
ఇక బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం రేవంత రెడ్డి లేదా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలో ఒకరికి పీసీసీ అప్పజెప్పి మరొకరిని ఏఐసీసీలో కీలక బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.ఎమ్మెల్యే సీతక్క,దామోదర రాజనర్సింహ,షబ్బీర్ అలీ,మధుయాష్కీ గౌడ్‌లతోపాటు మరికొందరికి సామాజిక సమీకరణాల ప్రకారం కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారని తెలుస్తోంది.అయితే ఇదంతా బయటజరుగుతున్న ప్రచారమే.కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా కట్టుబడి ఉంటామని నాయకులు చెప్పిన నేపథ్యంలో అదిష్టానం తీసుకునే నిర్ణయం ఏంటనేది ఆసక్తిగా మారింది.
ప్రతిసారి కేసులు తెరపైకి..
ఇక టీపీసీసీ రేసులో రేవంత్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిన ప్రతి సందర్భంలోనూ కేసులు,ఆరోపణలు కూడా ప్రచారంలోకి వస్తాయి.అది కాకతాళీయంగా జరుగుతోందా లేక ఉద్దేశపూర్వకంగా జరుగుతోందా అనే విషయం పక్కన బెడితే ఈ అంశంపై కూడా చర్చ నడుస్తోంది.కాంగ్రెస్ పార్టీలోని కొందరు నాయకులు రేవంత్‌కు వ్యతిరేకంగా ఈ ప్రచారం చేయిస్తున్నానే అభిప్రాయం కూడా ఉంది.ఏ ప్రచారం జరిగినా రేవంత్‌కు నష్టమే కాబట్టి.. అటు పీసీసీ ప్రచారంతో పాటు కేసుల అంశాలపైనా ప్రచారం చేయిస్తున్నారని కూడా చర్చ నడుస్తోంది.
Must Read ;- ఓటుకు నోటు కేసులో రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట











