భూ ఆక్రమణల ఆరోపణతో మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ రాజకీయ కార్యాచరణ తెలంగాణలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం ఖాయమైందని,జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఈటల నిర్ణయ తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.దీంతో తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు మొదలయ్యాయి.అదే సమయంలో ఈటల రాజేందర్‌తో పలు పార్టీలకు చెందిన నేతలు చర్చలు జరుపుతున్నారు.బీజేపీకి చెందిన కీలక నేతలు కిషన్‌రెడ్డి,బండి సంజయ్,డీకే అరుణ, జితేందర్ రెడ్డి, వివేక్‌లతోపాటు వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కోదండరాం,రేవంత్ రెడ్డి,కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు కూడా చర్చలు జరుపుతున్నారు.మొత్తం మీద ఈటల రాజేందర్ కార్యాచరణ ఎలా ఉంటుందనే అంశం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

కొందరు డైరెక్టుగానే విమర్శలు
ఇక ఈటల కార్యాచరణ విషయం అటుంచితే ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి.ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు డైరెక్ట్‌గానే విమర్శలు చేస్తుండగా మరికొందరు నాయకులు సైలెంట్‌గానే తమ వ్యూహం అమలు చేసేందుకు సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది.టీడీపీ హయాంలో మంత్రిగా పనిచేసి తరవాత పీఆర్పీకి వెళ్లి మళ్లీ టీడీపీకి వచ్చి,ఇటీవల బీజేపీలో చేరిన హుజూరాబాద్ నియోజకవర్గానికే చెందిన ఇనుగాల పెద్దిరెడ్డి బహిరంగంగానే విమర్శలు చేశారు.ప్రస్తుతం బీజేపీ కోర్ కమిటీ సభ్యుడిగా ఉన్న పెద్దిరెడ్డి బహిరంగంగానే విమర్శించారు.ఈటలపై భూఆక్రమణ ఆరోపణలు వచ్చాయని,వాటి నుంచి ముందు బయటపడాలని, బీజేపీలోని కొందరు నేతలు కూడా ఈ విషయంలో తొందరపడుతున్నారన్నారు.నియోజవర్గానికే చెందిన తనతో కనీసం సంప్రదించుకుండా ఓ వర్గంగా ఏర్పడి సంప్రదింపులు,సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు.ఈటల బీజేపీలో చేరితే తన కార్యాచరణ ఉంటుందని పరోక్షంగా హెచ్చరించారు పెద్దిరెడ్డి.సైద్ధాంతిక పునాదులు ఉన్న బీజేపీలో కొందరు నాయకుల తొందరపాటు కారణంగా వాటికి తిలోదకాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు.మీడియా ద్వారానే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని,ధిల్లీ నుంచి వచ్చి సంప్రదింపులు జరుపుతున్నా కనీస సమాచారం కూడా తనకు లేదని,అంత రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు.అయితే పెద్దిరెడ్డి కామెంట్ల వెనుక ఈటల రాకను వ్యతిరేకిస్తున్న కొందరు నాయకులు ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఇందులో ఒకరిద్దరు కీలక నాయకులు ఈటల రాకను ఆహ్వానిస్తున్నామని చెబుతూ సమావేశాల్లో పాల్గొంటున్నా ఈటల చేరికతో తమకు ప్రాధాన్యం తగ్గుతుందని భావించేవారూ ఉన్నారని తెలుస్తోంది.ఇందుకు ఆర్థిక,సామాజిక అంశాలు కూడా కారణమనే అభిప్రాయం నెలకొంది.మొత్తం మీద ఈటలను బీజేపీలో చేర్చుకునే విషయంలో పార్టీలో రెండు వర్గాలు ఏర్పాటయ్యాయనే చర్చ నడుస్తోంది.
ఈటల చేరితే తనకు ఇబ్బంది అవుతుందనేనా..
ఇక ఈటలను బీజేపీలోకి చేర్చుకోవడానికి ఆ పార్టీ సిద్ధపడడాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న ఇనుగాల పెద్దిరెడ్డి గతంలో టీడీపీ నుంచి పలుమార్లు గెలిచారు.మంత్రిగా వ్యవహరించారు.2004 వరకు మంత్రిగా ఉన్నారు.2004లో ఇక్కడి నుంచే టీడీపీ అభ్యర్థిగా,2009లో ప్రజారాజ్యం అభ్యర్థిగా,2014 ఎన్నికల్లో రామగుండం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.గత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు.అయితే వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసేందుకు సిద్ధం అవుతున్న తరుణంలో ఈటల బీజేపీలోకి వస్తే తనకు ఇబ్బంది అవుతుందని ఇప్పటికే తన సన్నిహితులతో చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది.మొత్తం మీద ఈటల రాజేందర్ ఇంకా బీజేపీలో చేరకముందే ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పవచ్చు.
Must Read ;- కేసీఆర్ భయపడేది బీజేపీకే.. అందుకే ఈటల అడుగులు అటు











