మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తనకు నాగార్జునసాగర్ నుంచి పోటీ చేయాలని బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, తాను ఇంకా నిర్ణయం తీసుకోలేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు..తాను పోటీ చేస్తే జానారెడి మూడో స్థానానికి పడిపోతారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ కుటుంబంలోని అంతర్గత కలహాల వల్లే.. కేటీఆర్‌ను సీఎం చేయలేదని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియాతో చిట్ చాట్‌లో భాగంగా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. ఏప్రిల్ 17న నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు జరగనుండగా మే 2న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
బీజేపీలో చేరతానని సంచలన ప్రకటన ..
ఇక రాజగోపాల్‌రెడ్డి విషయానికి వస్తే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి గెలిచారు. తరువాత ఎంపీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో తన అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భువనగిరి నుంచి ఎంపీగా గెలిచారు. ఆ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఇంకా ఓటమి నుంచి తేరుకోలేదు. ఆ సమయంలోనే తిరుపతిలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తాను బీజేపీలో చేరతానని సంచలన ప్రకటన చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ను ఢీకొట్టే శక్తి బీజేపీకే ఉందని, కాంగ్రెస్ పని అయిపోయిందని వ్యాఖ్యానించారు. ధిల్లీ కూడా వెళ్లి బీజేపీ నేతలతో మంతనాలు జరిపినట్టు ప్రచారం జరిగింది. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ దాదాపు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో సమావేశాలు కూడా ఏర్పాటు చేశారు. అదే సమయంలో తానే సీఎం అభ్యర్థిని అని ఓ నాయకుడితో రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టుగా ఓ ఆడియో బయటకు వచ్చింది. ఆ ఆడియో కారణమా లేక మరేదైనా కారణమా తెలియదు కాని.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరలేదు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే అయిష్టంగా ఉంటున్నారని ప్రచారం జరిగింది.
Must Read ;- సాగర్ బరిలో బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి?
అమ్మడుపోయే వారికి షోకాజ్ ఇవ్వాలంటూ..
ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అప్పటి తెలంగాణ ఇన్‌ఛార్జి కుంతియా రాజగోపాల్ రెడ్డికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. దీనిపై రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ అటాక్ చేయడంతో పాటు సంచలన ఆరోపణలూ చేశారు. కోవర్టు రాజకీయాలు చేసే వారికి, అమ్మడుపోయే వారికి షోకాజ్ ఇవ్వాలని, తాను నిజం చెప్తే షోకాజ్ నోటీసు ఎలా ఇస్తారని రివర్స్ కౌంటర్ వేశారు. కాంగ్రెస్ నాయకుల జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. కొన్నాళ్లు పార్టీ కార్యక్రమాలకూ రాజగోపాల్‌రెడ్డి దూరంగా ఉన్నారని చెబుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తన అన్న వెంకట్‌రెడ్డితో పాటు ప్రచారం చేశారు. మళ్లీ సైలెంట్ అయ్యారు.హుజూర్‌నగర్ ఉప ఎన్నికల ప్రచారంలో పెద్దగా కనిపించలేదు. తాను పార్టీ మేలు కోసమే ఈ వ్యాఖ్యలు చేశానని, పార్టీ ఐక్యంగా పనిచేయక పోవడం వల్లే వైఫల్యాలు ఎదురవుతున్నాయని చెప్పానని రాజగోపాల్ రెడ్డి సమర్థించుకున్నారు. అప్పటి నుంచి రాజగోపాల్‌రెడ్డి ఎప్పటికైనా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. తాజాగా చేసిన వ్యాఖ్యలతో మళ్లీ ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు మొదలయ్యాయి.
పార్టీ లీడర్లలో చర్చ..
ఇక కోమటిరెడ్డి బ్రదర్స్‌కి సంబంధించి కూడా పలు అంశాలు పార్టీ లీడర్లలో చర్చకు కారణం అవుతున్నాయి. ఆర్థిక వ్యవహారాల నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కొన్ని విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆర్థిక బలం రాజగోపాల్‌రెడ్డి అని చెబుతుంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ భాగస్వాములుగా ఉన్న టీవీ ఛానెల్ కూడా ఇటీవలే బీజేపీ నేత పర్యవేక్షణలోకి వెళ్లిందని చెబుతున్నారు. ఇక కాంట్రాక్టులకు సంబంధించిన బిల్లులు కూడా పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్నాయని, అటు కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలోనో, టీఆర్ఎస్‌లోనో చేరితే తన ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని, నియోజకవర్గంలో ఇచ్చిన హామీలూ నెరవేర్చవచ్చనే విధంగా రాజగోపాల్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా కొవిడ్ సమయంలో భువనగిరి పార్లమెంటు పరిధితో పాటు మునుగోడు అసెంబ్లీ పరిధిలో దాదాపు రూ.5కోట్లపైగా వ్యక్తిగత నిధులు వెచ్చించి కోమటిరెడ్డి బ్రదర్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాల పంపిణీ చేపట్టారు. ఖర్చు విషయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వెనుకడుగు వేసే వ్యక్తులు కాదనే పేరూ ఉంది.
పీసీసీ పెండింగ్ ఇష్యూ..
గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పీసీసీ రేసులో ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇబ్బందిగా మారాయి. అయినా వెంకట్ రెడ్డికి పార్టీ పట్ల ఉన్న విధేయత, తెలంగాణ కోసం మంత్రి పదవిని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు ఉండడంతో మళ్లీ వెంకట్‌రెడ్డి టీపీసీసీ రేసులోకి వచ్చారు. అయితే నాగార్జునసాగర్ ఎన్నికలు అయ్యే వరకు టీపీసీసీ ఎంపికను వాయిదా చేసిన నేపథ్యంలో కోమటిరెడ్డి బ్రదర్స్‌లో అసహనం వ్యక్తం అవుతోందని చెబుతున్నారు. తన అన్న వెంకట్ రెడ్డికిగాని, తనకు గాని టీపీసీసీ రాకుంటే.. రాజగోపాల్‌రెడ్డి తన కార్యాచరణను మొదలు పెడతారని కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తం మీద రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. బీజేపీ నుంచి ఆఫర్ వచ్చిందని, తాను మాత్రం వెళ్లడం లేదని పార్టీ విధేయతను చాటుకుంటున్నారా లేక కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధం అని చెబుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. ఇక్కడే మరో అంశం కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డి నాగార్జునసాగర్ నుంచి బరిలోకి దిగితే..మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అంటే మరో ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధం కావాల్సి ఉంటుంది.
Must Read ;- సాగర్, తిరుపతి ఉప ఎన్నికలు.. అభ్యర్థుల వేటలో అధికార పార్టీలు











