బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రమాదకరమైన ఆయుధంతో దాడి జరిగిందని, అమరావతి జేఏసీ నేత కొలికలపూడి శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడని విజయవాడ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈనెల 23న హైదరాబాద్‌లోని ఓ టీవీ చానల్ స్టూడియోలో జరిగిన చర్చ సందర్భంగా శ్రీనివాసరావు.. బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేత వామరాజు సత్యమూర్తి శుక్రవారం రాత్రి విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చెప్పు.. ప్రమాదకరమైన ఆయుధమట!
‘చెప్పు’ అని చెప్పకుండా… ప్రమాదకరమైన ఆయుధంతో కుట్రపూరితంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఐపీసీ 324, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సత్యరాజు రాసి ఇచ్చిన ఫిర్యాదులోని సారాంశాన్నే ఎఫ్‌ఐఆర్‌లో పొందుపరిచారు. ప్రస్తుతానికి విజయవాడలో కేసు నమోదు చేసినప్పటికీ, దాడి జరిగింది హైదరాబాద్ లో కావడంతో తర్వాత అక్కడికి బదిలీ చేస్తామని ఓ పోలీసు అధికారి చెప్పారు.











