ఒక పక్క గ్రేటర్ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంటే మరోపక్క కొందరు పోలింగ్ స్టేషన్ల సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా బైఠాయించి ఓటర్లకు డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గ్రేటర్‌లో కొన్ని ప్రాంతాల్లో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటున్నాయి. డబ్బులు పంచుతున్నారని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కారును బీజేపీ నేతలు అడ్డగించారు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కూకట్‌పల్లి ఫోరం మాల్ వద్ద కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. కారులో డబ్బులు పంచుతున్నారని పువ్వాడ కారును బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రోడ్డుపై కాసేపు ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ఇరు నేతల ఘర్షణ సమయంలో మంత్రి పువ్వాడ కారులో లేరని సమాచారం. అలాగే తార్నాకలోనూ టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
పాతబస్తీలోని జంగంపేట పోలింగ్ బూతు వద్ద కూడా ఎంఐఎం, బీజేపీ నేతల మధ్య స్వల్ప ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడంతో పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. రిగ్గింగ్ చేస్తున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. గచ్చిబౌలి గోపన్‌పల్లిలోనూ టీఆర్ఎస్, బీజేపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గ్రేటర్ వ్యాప్తంగా మరికొన్ని కేంద్రాల వద్ద కూడా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలోనే రాజకీయ పార్టీల మధ్య స్వల్ప ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి.
Also Read: కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలోకి చేరుతున్నారా?











