ఎన్నికల సమయంలో తమ రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి మారడం సర్వసాధారణమే. అసలే ఇప్పడు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సమయంలో వలసలు చాలానే ఉంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తమ పార్టీ బలాన్ని పెంచుకునే పనిలో బీజేపీ ఇతర పార్టీ అగ్ర నేతలకు గాలం వేస్తున్నది. ఇందులో భాగంగానే కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నేతలను బీజేపీలోకి చేర్చుకుంటున్నారు. ఈక్రమంలోనే కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సర్వే సత్యనారాయణను మాజీ ఎంపీ వివేక్‌తో కలిసి బండి సంజయ్ తమ పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. సర్వే సత్యనారాయణ కూడా తాను బీజేపీ పార్టీలోకి చేరుతున్నట్లు, తనతో పాటు మరికొంత మంది నేతలు కూడా చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉంటే మరో కాంగ్రెస్ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా బీజేపీలోకి చేరుతున్నారని, ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనను సంప్రదించారనే ప్రచారం జరుగుతోంది. ఏకంగా కోండాను జీహెచ్ఎంసీ ఎన్నికల కమిటీ ఇంఛార్జీ భూపేంద్ర యాదవ్ కలిశారని కూడా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలపై కొండా క్లారిటీ ఇచ్చారు.
తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొట్టిపారేశారు. తాను బీజేపీ పార్టీలోకి చేరడంలేదని ట్విట్టర్ వేదికగా తేల్చి చెప్పారు. అది ఒట్టి పుకారు మాత్రమేనని, తనకు అన్ని రాజకీయ పార్టీల్లో మిత్రులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. బీజేపీలో తాను చేరుతున్నట్లు ప్రచారం తన దృష్టికి వచ్చిందని, అలాంటి పుకార్లను నమ్మకూడదని ఆయన వెల్లడించారు. మొన్న బండా కార్తీకతో పాటు మరికొంతమంది నేతలు, ఇప్పుడు సర్వేసత్యనారాయణ ఇలా పేరున్న నాయకులు బీజేపీలోకి చేరుతుండటం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్లే.
Must Read ;- బలమైన నేతలకు బీజేపీ గాలం..!