గ్రేటర్‌లో బీజేపీ పంచాయితీ ప్రారంభించింది. మొదటి సారి ఇక్కడ 48 మంది కార్పోరేటర్లను గెలిపించుకున్న ఆ పార్టీ ప్రజా సమస్యలపై పోరును ఉధృతం చేస్తామని చెబుతూ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లతో ఇప్పటి వరకు ప్రమాణ స్వీకారం చేయించకుండా కుట్రలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు వెంటనే కొత్త పాలక మండలి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు ఎన్నికల కమిషనర్ నుంచి, ప్రభుత్వం నుండి గాని స్పందన రాలేదు. తాము కార్పోరేటర్లుగా గెలిచి నెల రోజులు గడుస్తున్నా ఎందుకు ప్రమాణ స్వీకారం చేయించడం లేదంటూ వారు ప్రశ్నిస్తున్నారు.
ఎప్పుడు ప్రమాణం చేస్తే అప్పటి నుండి 5ఏళ్ళు : ఈసీ
బీజేపీ నేతల డిమాండ్ నేపథ్యంలో కొత్త చట్టంలో ఏముందన్నది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కొత్తగా గెలిచిన కార్పోరేటర్లు గెలిచిన నాటి నుండి 5 ఏళ్ళు ఉంటారా.. లేక ప్రమాణ స్వీకారం తరువాత ఐదేళ్ళు ఉంటారా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గెలిచిన నాటి నుండయితే తాము పదవీ ప్రమాణ స్వీకారం లేకుండా ఎన్నిరోజులు ఉంటే అంత సమయం వృథా అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీన పూర్తవుతుంది కాబట్టి అప్పటి వరకు కొత్త చట్టం ప్రకారం పాలక మండలి రద్దు చేసే అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. పాత పాలక మండలి గుడువు ముగిసి కొత్త పాలక మండలి తొలి సమావేశం నుండి పదవీ కాలం మొదలవుతుందని ఈసీ క్లారిటీ ఇస్తున్నారు. అయితే, మూడు నెలల ముందే ఎన్నికలు ఎందుకు నిర్వహించారని బీజేపీ కార్పోరేటర్లు ప్రశ్నిస్తున్నారు.

బీజేపీ కార్పోరేటర్ల ఆందోళన బాట..
ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ ఆందోళన బాట పట్టింది. తాము ప్రజా ప్రతినిదులుగా ఎన్నికైన తరువాత కూడా పాత వారిదే పెత్తనం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ తమపై ఒత్తిడి పెరుగుతోందని.. పాలక మండలి ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని.. రాజ్యాంగ విలువను కాలరాస్తోందని అంటున్నారు. ప్రభుత్వ రాజ్యంగాన్ని అవమానిస్తోందని.. వెంటనే పాలక మండలి ఏర్పాటు చేయాలంటూ అంబేద్కర్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రజల తీర్పును గౌరవించడం ప్రభుత్వ విధి అని, వెంటనే వారి తీర్పును గౌరవిస్తూ పాత పాలక మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం దిగిరాక పోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు. పాలక మండలి ఏర్పాటు కాక ముందే కార్పోరేటర్లు రోడ్డక్కడంతో రాబోయే రోజుల్లో బీజేపీ దూకుడు ఎలా ఉంటుందో వేచి చూడాలి.
Must Read ;- మల్లన్న సన్నిధిలో వైసీపీ వికృత క్రీడ.. బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్











