గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి. టీఆర్ఎస్, ఎంఐఎం, బీజేపీ పార్టీలు తమ హవాను కొనసాగిస్తున్నాయి. అయితే జాతీయ పార్టీగా దశాబ్దాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం గ్రేటర్‌లో ఉనికి కోసం పోరాటం చేస్తోంది. టీఆర్ఎస్ హవా కంటిన్యూ అవుతుండడం, బీజేపీ జోరు పెంచడంతో ఇక కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోతున్నట్లు తాజా ఎన్నికల ఫలితాలను బట్టి తెలుస్తోంది. గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి గ్రేటర్ పీఠంపై తమ జెండా ఎగురవేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నికల్లో తమ ఉనికిని కాపాడుకోవడమే ప్రశ్నార్థకంగా మారిపోయింది.
దుబ్బాక ఎన్నికల ఫలితాల్లో మూడవ స్థానానికి పడిపోయిన కాంగ్రెస్.. గ్రేటర్ ఫలితాల్లో కాంగ్రెస్ స్థానం మరింతగా దిగజారి నాల్గవ స్థానానికి పరిమితమైంది. చావుతప్పి కన్నులోట్టపోయినట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉంది. ఏఎస్‌రావు నగర్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శిరీష రెడ్డి విజయం సాధించారు. ఈ ఫలితంతో కాంగ్రెస్ పార్టీ మొదటి ఖాతా తెరిచినట్లయింది. అలాగే మరో డివిజన్ అయిన ఉప్పల్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎం. రజిత విజయం సాధించారు. దీంతో ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నట్లయింది. మరో రెండు చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది.
Must Read ;- గ్రేటర్‌లో ఎవరికి గెలుపు వరించేను?.. ఆందోళనలో పార్టీ నేతలు!
మొదట నుంచి వెనుకంజే…
మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నాల్గవ స్థానంలోనే తన ఆధిక్యతను కనబరుస్తూ నిలవడం ఒక జాతీయ పార్టీగా ఘోర వైఫల్యం చెందిందనే చర్చ సాగుతోంది. రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీకు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు గట్టి ఎదురుదెబ్బే అని చెప్పుకోవాలి. ఈ ఫలితాలు కాంగ్రెస్ నేతల్లో నైరాశ్యం పెంచేలా ఉన్నాయి. ఎవరూ ఊహించని విధంగా బీజేపీ పార్టీ దూసుకుపోవడం.. టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం కాదు.. తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెప్పిన వాదనను ఈ ఫలితాలు బలాన్ని చేకూరుస్తున్నాయి.
పతనానికి కారణం ఎవరు?..
గ్రేటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వైఫల్యం చెందడంపై పార్టీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ పతనానికి కాంగ్రెస్ నేతల తీరే కారణమని స్పష్టంగా కనబడుతోంది. బీజేపీ గెలుపు కోసం తమ జాతీయ నాయకత్వాన్ని రంగంలోకి దింపితే జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రచారం చేయలేదనే చెప్పాలి. అభ్యర్థుల గెలుపు కోసం జాతీయ స్థాయి నేతలను కాంగ్రెస్ పార్టీ దింపకపోవడం పతనానికి దారితీసింది. దుబ్బాక ఎన్నికల అనుభవాన్ని లెక్కలోకి తీసుకోకుండా కాంగ్రెస్ నేతల్లో సమన్వయలోపం కొట్టొచ్చినట్లుగా కనబడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దానికితోడు కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ పతనానికి దారితీసింది. నిన్న దుబ్బాక, తాజాగా గ్రేటర్ ఫలితాల బట్టి కాంగ్రెస్ పార్టీ గ్రేటర్‌లో ఉనికిని కోల్పోతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. 106 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ కూడా అడ్రస్ లేకుండా పోయింది. 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల్లో గెలుచుకుంది. ఈ సారి ఎన్ని డివిజన్లను గెలుచుకుంటుందో తెలియాలంటే తుది ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే. ప్రస్తుతమైతే రెండు డివిజన్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.
Also Read ;- రౌండ్ రౌండ్‌కి మారుతున్న ఫలితాలు!