గ్రేటర్‌లో మంచి ఫలితాలు సాధించడంతో ఇక వరంగల్ కార్పోరేషన్‌పై బీజేపీ దృష్టి సారించ బోతోంది. హైదరాబాద్ తరువాత అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో వరంగల్ మొదటి స్థానంలో ఉంటుంది. దీంతో ఆ నగరంలో పాగా వేస్తే ఉత్తర తెలంగాణపైన కూడా పట్టు సాధించ వచ్చని ఆ పార్టీ భావిస్తోంది. దీంతో ఇప్పుడు టార్గెట్ వరంగల్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. వరంగల్ నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు కూడా ఈ నగరంలో జరగబోయే ఎన్నికలపై ప్రత్యేక శ్రద్ధ చూపించబోతున్నారు. హైదరాబాద్‌లో మంచి ఫలితాలు సాధించడంతో దక్షిణ తెలంగాణపై ఆ ప్రభావం ఉంటుందని యోచిస్తున్న బీజేపీ ఇక ఉత్తర తెలంగాణలో కూడా పాగా వేసేందుకు వరంగల్ ఎన్నికలను వాడుకునే పనిలో పడింది.
Must Read ;- దూకుడు తగ్గని బీజేపీ.. గులాబీ శిబిరంలో గుబులు
అక్కడ స్వీప్ చేశారు.. ఇక్కడ స్వీప్ అయ్యారు
ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ముషీరాబాద్, అంబర్‌పేట్ ,ఉప్పల్ నియోజకవర్గాల్లో బీజేపీ తన ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది . ఈ ప్రాంతాల్లో ఎక్కువగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాకు చెందిన ప్రజలే నివసిస్తుంటారు. ఇక మరోవైపు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో బీజేపీ అసలు ప్రభావం చూపలేదు. ఈ ప్రాంతాల్లో మెదక్, నిజామాబాద్, కరీంనగర్ వంటి జిల్లాల నుండి వచ్చిన ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. వీరికి తోడు ఆంధ్రప్రదేశ్ సెటిలర్లు కూడా ఇక్కడ నివసిస్తుంటారు. వీరి నుండి అసలు సానుకూల రెస్పాన్స్ లేదన్నది బీజేపీ నాయకుల ఆలోచనగా ఉంది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలోచనలో పడింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పార్టీకి మంచి పట్టు వచ్చినందున ఇక ఉత్తర తెలంగాణ ప్రజలను తమ వైపు తిప్పుకునే పనిలో పడింది. ఇందులో భాగంగానే వరంగల్ , ఖమ్మం కార్పోరేషన్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టబోతోంది.
రేపు వరంగల్‌కు కిషన్‌రెడ్డి..
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రేపు వరంగల్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. ఆయన లక్ష్యం గ్రేటర్ వరంగల్ ఎన్నికలే. అయితే అధికారులతో సమీక్ష, అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన పేరుతో ఆయన వరంగల్‌లో అడుగు పెట్టబోతున్నారు. గ్రేటర్ వరంగల్‌కు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్న నిధులు, వాటిని ఎక్కడ ఖర్చుచేశారన్న వివరాలు సేకరించ బోతున్నారు. వరంగల్‌కు వివిధ స్కీంల కింద కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పనులను పరిశీలించనున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం వరంగల్ పర్యటన చేసిన నేపథ్యంలో కిషన్‌రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పేరుకు అధికారిక పర్యటన అయినా గ్రేటర్ వరంగల్ ఎన్నికలే టార్గెట్‌గా కిషన్ రెడ్డి పర్యటన ఉండబోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వరంగల్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం వాటా ఎంత .. రాష్ట్రం వాటా ఎంత ఉందో తేటతెల్లం చేసేందుకు ఈ పర్యటన ఉపయోగ పడుతుందని భావిస్తున్నారు బీజేపీ నేతలు .. కార్యకర్తలు.
ALso Read ;- బీజేపీలో చేరక ముందే ఎంజాయ్ చేస్తున్న మాజీ ఎంపీ?