రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శిగా వాణీమోహన్‌ను తొలగిస్తూ, కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ప్రభుత్వ సీఎస్‌కు లేఖ రాశారు. వాణీమోహన్ సేవలు ఎన్నికల కమిషన్‍లో అవసరం లేదని సీఎస్‍కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ కార్యదర్శిగా ఉంటూ, కమిషనర్ ఆదేశాలు పాటించడం లేదని లేఖలో నిమ్మగడ్డ ప్రస్తావించినట్టు తెలుస్తోంది. నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం జేడీ సాయి ప్రసాద్, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా నెల రోజులు సెలవుపై వెళ్లారు. అతన్ని సర్వీసు నుంచి తొలగిస్తున్నట్టు నిమ్మగడ్డ లేఖలో వెల్లడించారు. ఇక ముందు కూడా సాయి ప్రసాద్‌ను ఎలాంటి పోస్టింగ్‌లోకి తీసుకోరాదని నిమ్మగడ్డ ఆదేశాలు జారీ చేశారు.
చకచకా చర్యలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వెనక్కు తగ్గేలా లేరు. ఎన్నికల షెడ్యూల్‌ను హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ నిలుపుదల చేసింది. దీనిపై డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసిన నిమ్మగడ్డ చకచకా పావులు కదుపుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయంలో ఉంటూ ప్రభుత్వం చెప్పినట్టు నడుస్తున్న వారిపై వేటు వేయడం ప్రారంభించారని తెలుస్తోంది.
నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు అహంకారం ఎక్కువై, నియంతలా వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘంలో విధులు నిర్వహిస్తున్న జేడీ సాయిప్రసాద్, కార్యదర్శి వాణీమోహన్‌లను తొలగిస్తూ నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవడంపై సజ్జల ఫైర్ అయ్యారు. 50 శాతం కన్నా ఎక్కువ ఓట్లు సాధించిన సీఎంకు కూడా లేనన్ని అధికారాలను నిమ్మగడ్డ చెలాయించాలని చూస్తున్నాడని సజ్జల విమర్శించారు. నిమ్మగడ్డకు మతి భ్రమించిందా, లేదంటే పక్కన ఎవరైనా ఎక్కేస్తున్నారా? అని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు. నిమ్మగడ్డ ప్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నాడని, అవి చెల్లవని సజ్జల విమర్శలు గుప్పించారు.
Must Read ;- స్థానిక ఎన్నికలు జరిగేనా? కేరళలో అలా.. మరి ఏపీలో ఎలా?