కేరళలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ మెట్రోమ్యాన్‌గా పేరున్న శ్రీధర్‌ను రంగంలోకి దింపి అక్కడ పాగా వేయాలని సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించగా శ్రీధరన్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారు. అంతేకాదు.. సీఎంగా బాధ్యతలు స్వీకరించమని ఒక వేళ బీజేపీ కోరితే అందుకు సిద్ధమేనని కూడా ఆయన శుక్రవారం వ్యాఖ్యానించడం సంచలనం రేపింది. కేరళలోని ప్రధాన మీడియా గ్రూప్ ‘మళయాల మనోరమ’తో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనతో పాటు పాటు అప్పుల ఊబి నుంచి కేరళను బయటపడేసేందుకు కృషి చేస్తానని, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేస్తానని వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే తన ధ్యేయమని చెప్పిన శ్రీధరన్ కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తే.. మూడు, నాలుగు ప్రధాన రంగాల మీద దృష్టి పెడతామన్నారు. వీటితోపాటు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లవ్ జీహాద్ పేరుతో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న కొన్ని గ్రూపుల కారణంగా అరాచకాలు జరుగుతున్నాయన్నారు. హిందూ అమ్మాయిలతో పాటే ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన యువతలను వివిధ ఆకర్షణలు చూపించి మోసం చేస్తున్నారని, అవి కట్టడి చేయాలంటూ యూపీ లో అమలవుతున్న చట్టాలు రావాల్సిన అవసరం ఉందన్నారు. కాగా రానున్న ఎన్నికల్లో శ్రీధరన్ కార్యాచరణ ఎలా ఉండబోతోందనేది ఈ వ్యాఖ్యలను బట్టి అంచనా వేయవచ్చనే చర్చ మొదలైంది. కాగా సోమవారం నుంచి కేరళలో బీజేపీ విజయయాత్ర ప్రారంభం కానుంది.
బీజేపీ ముమ్మర యత్నం
కేరళ అసెంబ్లీకి మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ పాగా వేసేందుకు బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. 2016 ఎన్నికల్లో 1స్థానం గెలుపొందిన బీజేపీ..ఈ సారి అధికారం చేపట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ‘మెట్రో మ్యాన్’గా గుర్తింపు పొందిన ఈ శ్రీధరన్‌ను బీజేపీలో చేర్చుకోనుంది. తన స్వస్థలం మళ్లాపురంలో ఓ ఛానెల్‌తో మాట్లాడిన శ్రీధరన్ తాను బీజేపీలో చేరుతున్నానని, గత 10ఏళ్లుగా కేరళలోనే ఉంటున్నానని, పలు ప్రభుత్వాల పనితీరును తాను చూశానన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాల విధానాలు నచ్చక తాను బీజేపీలో చేరుతున్నానని వ్యాఖ్యానించారు. కాగా నిజాయితీ పరుడిగా పేరున్న శ్రీధరన్ ఇమేజ్‌పై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ స్కాం అన్ని పార్టీలనూ వెంటాడుతోంది. ఈ ప్రభావం ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కనిపించింది. ఈ నేపథ్యంలో శ్రీధరన్ ఇమేజ్‌పైనే బీజేపీ ఆధారపడుతుందని చెప్పవచ్చు.
మెట్రోమ్యాన్‌గా పేరు..
కాగా శ్రీధరన్‌కు మెట్రోమ్యాన్‌గా పేరుంది. ధిల్లీ మెట్రోరైల్‌ను సక్సెస్ ఫుల్‌గా నడిపించడంలో శ్రీధరన్ పాత్ర కీలకంగా మారింది.అదే స్ఫూర్తిగా ఎత్తైన రైల్వే మార్గాల్లో ఒకటైన కొంకణ్ రైల్వే నిర్మాణ బాధ్యతలూ నిర్వర్తించారు. హైదరాబాద్ మెట్రోరైల్ ప్రాజెక్టుకు సలహాదారుగా వ్యవహరించారు. గతంలో విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టు ప్రతిపాదనలు వచ్చిన నేపథ్యంలో శ్రీధరన్‌ను కూడా అప్పటి ప్రభుత్వం సలహాదారుగా నియమించుకుంది. ధిల్లీ మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు 1995లో ప్రారంభం కావడంతో శ్రీధరన్‌కు వీటిని అప్పగించారు. శ్రీధరన్ 2005లోనే ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్నా ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న కారణంగా పదవీ కాలాన్ని పొడిగించారు. 2011లో పదవీ విరమణ చేశారు.
దక్షిణ మధ్య రైల్వేలో తొలి ఉద్యోగం
అంతకుముందు ఆయన 1954లో దక్షిణ మధ్య రైల్వేలో ఇంజినీర్‌గా తొలి ఉద్యోగం చేశారు. 1964లో రామేశ్వరానికి, తమిళనాడుకు ప్రధాన లింక్‌గా ఉన్న పంబన్ వంతెన తుపాను కారణంగా కొట్టుకుపోయింది. ఈ వంతెనను రికార్డు స్థాయిలో 46 రోజుల్లో పునర్నిర్మించారు. దేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ ప్రాజెక్టు అయిన కోల్ కత్తా మెట్రోరైల్ కు 1970లో డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ హోదాలో బదిలీ అయారు. డిజైన్‌లో కీలక భూమిక పోషించారు. తరువాతి కాలంలో 1979లో కొచ్చిన్ షిప్ యార్డు, 1987లో కొంకణ్ రైల్వేలో చేరారు.
బీజేపీ ప్రయోగం..
కేరళలో తన పట్టును పెంచుకునేందుకు బీజేపీ అన్నిరకాల మార్గాలను ఎంచుకుంటున్నా..అదే స్థాయిలో ఇబ్బందులూ తలెత్తుతున్నాయి. బీజేపీకి కలసి వచ్చే కేరళ డెమోక్రటిక్ అలయన్స్‌లో భాగస్వామిగా ఉన్న భారత్ ధర్మ జన సేన (బిడిజెఎస్) పార్టీ ఈ కూటమితో విడిపోయింది. యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యుడిఎఫ్)లో చేరాలని నిర్ణయించుకొని ప్రత్యేకంగా పార్టీని పెట్టనుంది. తమ ఇమేజ్‌ను బీజేపీ వాడుకుంటోందని, తమకు నష్టం వస్తోందన్న కారణంతో ఆ పార్టీ చీఫ్ ఎంకే నిలకండాన్ మాస్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో ప్రస్తుతం రాజకీయంగా కూటమిల పోరు మొదలైంది. వామపక్ష పార్టీల సారథ్యంలో ఎల్డీఎఫ్, కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ మధ్య పోరు జరుగుతుంది. దశాబ్దాలుగా అదే పరిస్థితి కనిపించింది. ఇటీవల గోల్డ్ స్మగ్లింగ్ స్కాంలో అన్ని పార్టీల నాయకుల పేర్లు బయటకు వచ్చాయి. ఇక పబ్లిక్ కమిషనర్ ర్యాంకుల వ్యవహారం, బ్యాక్ డోర్ నియామకాల నేపథ్యంలో యువతలో అధికార ఎల్డీఎఫ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంకుల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడం, ఇద్దరు అభ్యర్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజకీయంగా ప్రకంపనలు రేపింది. అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై వివాదం, సోలార్ స్కాంలూ రానున్న ఎన్నికల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి.
గత ఎన్నికల్లో ఇలా..
ఇక గతంలో జరిగిన ఎన్నికల విషయానికి వస్తే..2015 చివర్లో జరిగిన ఎన్నికల్లో ఎల్డీఎప్ గెలిచింది. అయితే 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించింది. మొత్తం 20 స్థానాలకు గాను 19స్థానాలు దక్కించుకుంది. అదే సమయంలో బీజేపీ ఓటు శాతం పెరిగింది. పెరిగిన ఓటు శాతంపైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. కేరళలో జరుగుతున్న కుంభకోణాలు, హిందూత్వ వ్యతిరేక విధానాలే బీజేపీకి ఇప్పటివరకు ప్రచార అంశాలు కాగా శ్రీధరన్ చేరికతో ఆయన కూడా స్టార్ ఇమేజ్ ప్రచార అంశంగా మారనున్నారన్న అంచనాలున్నాయి.