ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారువారి పాట సినిమాతో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు.. దీని తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మూడో సారి నటించడానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. మహేశ్ బాబు 28గా వ్యవరిస్తున్న ఈ సినిమా ఆయన తండ్రి కృష్ణ పుట్టిన రోజును పురస్కరించుకొని లాంఛింగ్ జరుపుకోనుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై ఈ సినిమాను చినబాబు నిర్మించబోతున్నారు. ఇక ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను తీసుకోబోతున్నారని వార్తలొస్తుండగా.. మరో ముఖ్య పాత్రకోసం ఓ సీనియర్ నటీమణిని రంగంలోకి దింపుతున్నారని తెలుస్తోంది.
త్రివిక్రమ్ గత చిత్రాల్ని గమనిస్తే.. ఆయన ప్రతీ సినిమాలోనూ.. ఎవరో ఒక సీనియర్ నటీమణులు కనిపిస్తారు. నదియా, స్నేహ, ఖుష్బూ, టబు లాంటి ఒకప్పటి టాప్ మోస్ట్ హీరోయిన్స్ ఆయన సినిమాల్లో చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు 28 వ సినిమాలో కూడా ఓ సీనియర్ స్టార్ నటించబోతోందట. ఆమె మరెవరో కాదు.. నిన్నటి తరం బాలీవుడ్ బ్యూటీ శిల్పాశెట్టి.
శిల్పశెట్టి గతంలో.. ‘సాహసవీరుడు సాగరకన్య, వీడెవడండీ బాబూ, ఆజాద్, భలేవాడివి బాసు లాంటి సినిమాల్లో టాప్ హీరోల సరసన కథానాయికగా నటించి మెప్పించింది. చాన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మరోసారి శిల్పా శెట్టి తెలుగు సినిమాలో నటిస్తుండడం విశేషంగా మారింది. దాదాపు పదకొండేళ్ళ తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమా రానుండడం అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. మరి నిజంగానే ఈ సినిమాలో శిల్ప శెట్టి నటిస్తుందో లేదో తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే.











