పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో స్ట్రైట్ మూవీస్ కన్నా రీమేక్సే ఎక్కువ. రెండో సినిమా ‘గోకులంలో సీత’ నుంచి మొదలైన ఈ రీమేకుల పరంపర ‘కాటమరాయుడు’ వరకూ కొనసాగింది. ‘సుస్వాగతం, తమ్ముడు, ఖుషీ, అన్నవరం’ లాంటి సినిమాలు అభిమానుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అయితే పవన్ నటించిన కొన్ని స్ట్రైట్ మూవీస్ తమిళంలోనూ రీమేక్ అయ్యాయి. అక్కడ కూడా ఈ సినిమాలు దుమ్మురేపేశాయి.
అసలు మేటర్లోకొస్తే.. పవర్ స్టార్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టిన సినిమాల్లో సింహభాగం .. తమిళ రీమేక్సే కాగా.. ఆయనకి మంచి క్రేజ్ తెచ్చిన సినిమాలు మాత్రం బాలీవుడ్ రీమేక్ మూవీసే. పవన్ కెరీర్ బిగినింగ్ లో నటించిన ‘తమ్ముడు’ సినిమా తెలుగులో ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే. అందులో ఆకాతాయి కుర్రోడిగా కనిపిస్తూనే.. అన్నయ్య కోసం కిక్ బాక్సింగ్ నేర్చుకొని అందులో విజయం సాధించి.. తండ్రి పేరు నిలబెడతాడు. ఈ సినిమా బాలీవుడ్ మూవీ ‘జో జితావొహీ సికందర్’ కి రీమేక్ వెర్షన్ .
ఆమిర్ ఖాన్, ఆయేషా జుల్కా జంటగా నటించిన ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయింది. కాకపోతే అందులో సైకిల్ రేస్ .. ‘తమ్ముడు’ లో కిక్ బాక్సింగ్ గా మారింది. పి.ఏ.అరుణ్ ప్రసాద్ దర్వకత్వంలో తెరకెక్కిన తమ్ముడు పవన్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా తర్వాత చాన్నాళ్ళకి పవన్ నటించిన మరో బాలీవుడ్ రీమేక్ ‘తీన్ మార్’.ఆ సినిమా మాత్రం అంతగా మెప్పించలేకపోయింది. ‘లవ్ ఆజ్ కల్’ సినిమాకి ‘తీన్ మార్’ రీమేక్ వెర్షన్ అన్నసంగతి తెలిసిందే.
ఇక ‘గబ్బర్ సింగ్’ సినిమా గురించి చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్ నటించిన సినిమాలన్నిటిలోకీ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ తెచ్చిపెట్టిన సినిమా అది. సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘దబంగ్’ కి గబ్బర్ సింగ్ తెలుగు వెర్షన్ అన్న సంగతి తెలిసిందే. అయితే దర్శకుడు హరీశ్ శంకర్ .. అందులోని పోలీస్ కేరక్టర్ మాత్రం తీసుకొని తనదైన శైలిలో స్ర్కీన్ ప్లే రాసుకొని.. కామెడీటచ్ ఇచ్చి అభిమానులకు మాస్ ఫీస్ట్ ఇచ్చాడు. ఓ తిక్క పోలీసాఫీసర్ గా పవన్ అభినయానికి దాసోహమయ్యారు ఫాన్స్ . ఆ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్టు అవడంతో .. పవర్ స్టార్ కు తిరుగులేని ఇమేజ్ దక్కింది.
పవన్ కళ్యాణ్ , వెంకటేశ్ నటించిన మల్టీస్టారర్ మూవీ ‘గోపాలా గోపాలా’. ఇందులో పవన్ మోడ్రన్ కృష్ణుడిగా అభినయించి అభిమానుల్ని ఎంతగానో అలరించాడు. ‘ఓమైగాడ్’ బాలీవుడ్ సినిమాకి రీమేక్ వెర్షన్ అయిన గోపాలా గోపాలా .. 2015 జనవరిలో విడుదలై.. తెలుగులో మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే అదే ఏడాది దీనితో పాటు విడుదలైన శంకర్, విక్రమ్ ఐ సినిమా బాక్సాఫీస్ వద్ద చతికిల పడగా.. గోపాలా గోపాలా సినిమా కలెక్షన్స్ పరంగా బాగా పుంజుకుంది.
ఇప్పుడు తాజాగా పవర్ స్టార్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ కూడా బాలీవుడ్ రీమేకే. అమితాబ్ , తాప్సీ నటించిన పింక్ సినిమాకి మార్పులు చేర్పులు చేసి తెరకెక్కుతోన్న ఈ సినిమా .. బ్యాలెన్స్ వర్క్ కంప్లీట్ చేసుకొని త్వరలోనే విడుదల కానుంది. పవర్ స్టార్ కున్న బాలీవుడ్ రీమేక్ సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా హిట్టు అవుతుందేమో చూడాలి.











