ఈ వారంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారనున్నాయి. ఇద్దరు నేతలు ప్రత్యక్ష పోరుకు సిద్దమవుతున్నారు. వారిలో ఒకరు రేవంతరెడ్డి, ఇంకొకరు కొత్తగా పార్టీ పెడుతున్న వైస్ షర్మిల. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఎవరెంత పట్టుసాధిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నెల 7న టీపీసీపీ అధ్యక్షుడిగా రేవంతరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టనుండగా ఆ మరునాడే షర్మిల తాను పెట్టబోయే పార్టీ జండా, అజెండా ప్రకటించనున్నారు. ప్రగతి భవన్‌పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ముందుకుసాగుతానని ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించగా, రాజన్య రాజ్యం స్థాపనే తన లక్ష్యమని షర్మిల ప్రకటించారు. వీరు ఏ మేరకు సఫలమవుతారో చూడాలంటే రెండున్నరేళ్లు ఆగాల్సిందే.
వైఎస్సార్ వారసత్వం కోసం..
ఇద్దరూ వైఎస్సార్ తెలంగాణ వారసత్వం తమదంటే తమదని ఇప్పటికే పోటీ పడుతున్నారు. రెడ్డి సామాజిక వర్గంతో పాటు వైఎస్సార్ పాలనలో లబ్ధి పొందిన ఇతరులు తమవైపే ఉంటారన్న ధీమాలో ఉన్నారు. ఈ విధంగా కాంగ్రెస్‌లో, తటస్థులుగా ఉన్న వైఎస్సార్ అభిమానులను తమకు మద్దతుగా సమీకరించేందుకు షర్మిల, కాంగ్రెస్‌లోనే వైఎస్ చివరి వరకు ఉన్నారంటూ, వారి మద్దతు తమకే ఉండేలా రేవంత్ అప్పుడే మాటల యుద్దం మొదలు పెట్టారు. ఇద్దరి లక్ష్యం కేసీఆర్‌ను పీఠాన్ని దక్కించుకోవడమే.
తండ్రికి నివాళి ఆర్పించిన తర్వాత..
ఏపీలో తన అన్న జగన్ వైఎస్ వారసత్వాన్ని పూర్తిగా సొంతం చేసుకోగా తెలంగాణలో షర్మిల కూడ అదే ప్రయత్నంలో ఉన్నారు. తన పార్టీ జెండా రూపకల్పన నుంచే అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. 8వ తేదీన ఉదయం ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళి అర్పించి అక్కడ నుండి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌లోని బేగంపేట చేరుకుంటారు. మధ్యాహ్నం పంజాగుట్ట సర్కిల్‌లోని వైఎస్సార్ విగ్రహానికి నివాళి అర్పించిన తర్వాత ఫిలింనగర్‌లోని జేఆర్సీ సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడే తన పార్టీ ప్రకటనతో పాటుగా జెండా, అజెండా ప్రకటించనున్నారు. తెలంగాణలోని ప్రజల సమస్యలు, తన పాదయాత్ర తదితర విషయాలను షర్మిల ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ వారసురాలిగా..
తన తండ్రి పేరుతోనే పార్టీ ఏర్పాటు చేస్తుండటంతో జెండాలో వైఎస్సార్ చిత్రం డిజైన్ చేశారు. ఏపీలో అన్న జగన్ వైఎస్సార్సీపీ జెండాలో వైఎస్సార్ చిత్రంతో డిజైన్ చేశారు. వైఎస్ రాజకీయ వారసురాలిగా కాకుండా తనను చేయాలని ప్రయత్నిస్తున్న వారికి సమాధానంగా తన పార్టీ పేరుతో పాటు జెండాలోనూ తన తండ్రి ఇమేజ్‌ను సొంతం చేసుకుంటున్నారు.
జెండాలో పాలపిట్ట, నీలం రంగు
వైఎస్సార్‌టీపీ జెండా పాలపిట్ట, నీలం రంగుతో కూడి ఉంటుందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో పాలపిట్ట రంగు 80శాతం, నీలం రంగు 20 శాతం ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. జెండా మధ్యలో తెలంగాణ భౌగోళిక స్వరూపం,అందులోనే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రం ఉండేలా డిజైన్ చేశారు. తెలంగాణలో టార్గెట్ 2023లో భాగంగా వ్యూహకర్తను కూడ షర్మిల సిద్ధం చేసుకున్నారు. షర్మిల ఏ మేరకు సక్సెస్ అవుతారో చూడాలి మరి.
Must Read ;- లీకులన్నీ నిజమే.. 8న షర్మిల పార్టీ ప్రారంభం