తెలంగాణలో రాజన్న రాజ్యం తెచ్చే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కుమార్తె,ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల పెట్టనున్న పార్టీ పేరు ఖరారైందనే చర్చ మొదలైంది.ఆ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP)గా తెలుస్తోంది.షర్మిల అనుచరుడు,కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్ అధ్యక్ష హోదాలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరు పేరుతో గత డిసెంబరులో కర్నూలు జిల్లాకు చెందిన ఓ న్యాయవాది ద్వారా ఎన్నికల సంఘానికి దరఖాస్తు అందించింది.గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ప్రక్రియ మొదలైంది. వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టేందుకు ఇప్పటికే మద్దతు ఇచ్చిన షర్మిల తల్లి వైఎస్ విజయలక్ష్మి వైసీపీ గౌరవాధ్యక్షురాలి హోదాలో నిరభ్యంతర పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. సాధారణంగా ఒకపార్టీ పేరును పోలిన కొత్త పార్టీ పెట్టేందుకు ఈ నిరంభ్యంతర పత్రం అవసరం అవుతుంది. YSRCP-YSRTP లేదా YCP-YTP లేదా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ –యువజన శ్రామిక తెలంగాణ కాంగ్రెస్‌లకు ఒకే అక్షరం, పదం తేడా ఉండడంతో ఈ NOC కీలకమైంది. వైఎస్ విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. డాక్యుమెంట్ల సమర్పణకు సంబంధించి ప్రక్రియ పూర్తి కావడంతో ఎన్నికల సంఘం పార్టీ పేరుకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది. వైటీపీకి సీహెచ్ సుధీర్‌కుమార్ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్ కోశాధికారిగా వ్యవహరిస్తామంటూ ఆ దరఖాస్తులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కాగా YSRTP ఎన్నికల సంఘం ప్రకటించడంతో పాటు ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే జూన్ 16 లోగా తమకు తెలియజేయాలని సూచించింది.
Must Read ;- షర్మిల పార్టీ పెడతారా,లేదా.. కార్యాలయానికి తాళంతో సందేహాలెన్నో..!
వాడుక రాజగోపాల్ ప్రస్తుతం షర్మిల ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్
ఇక వాడుక రాజగోపాల్ విషయానికి వస్తే ఈయన ప్రస్తుతం షర్మిల ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్‌గా ఉన్నారు. రాజగోపాల్ సోదరి, షర్మిల చిన్ననాటి స్నేహితులని తెలుస్తోంది. 30 ఏళ్లుగా వైఎస్ కుటుంబంతో సన్నిహితంగా ఉండడంతో పాటు తెలంగాణల వైఎస్ జగన్ పార్టీకి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కీలకంగా వ్యవహరించారు. వైఎస్ జగన్ పాదయాత్ర, షర్మిల పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ జగన్‌తోనూ రాజగోపాల్‌కు స్నేహం ఉన్నట్లు చర్చ నడుస్తోంది. కాగా ఈసీఐ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన తరవాత వైఎస్ షర్మిలను పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నుకుంటారని, జూలై 8న వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని పార్టీ పేరును షర్మిల చెబుతారని తెలుస్తోంది.అదే రోజు ఆమె పార్టీ పేరును, జెండా, అజెండా, పార్టీ విధివిధానాలు ప్రకటిస్తారని చెబుతున్నారు. జులై 21 నుంచి పాదయాత్రకి రూట్ మ్యాప్ కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.
సందేహాల మధ్య..
కాగా వైఎస్ షర్మిల పార్టీకి సంబంధించి పేరు బయటకు వచ్చినా కొన్ని అంశాలపై చర్చ నడుస్తోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన శివకుమార్ YSRCP పేరుతో పార్టీ రిజస్టరైందని, ఆ పార్టీ తనదేనని చెబుతున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీని YSRCP అని పిల్వడంపై ఎన్నికల సంఘంలో ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. అలాంటి పరిస్థితులు YSRTP పేరుకు సంబంధించి YSRCP శివకుమార్ ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఇక రెండో అంశానికి వస్తే తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని చెబుతున్న వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీ YSRTP అని తెలుస్తోంది. అయితే YSR అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు ఉంటుందా లేదా యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ అని పెడతారా అనే చర్చ నడుస్తోంది. అదే సమయంలో ఏపీలో YSRCP పార్టీకి వైఎస్ విజయలక్ష్మి గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలంగాణాలో వైఎస్ షర్మిల పెడుతున్న పార్టీకి కూడా గౌరవ అధ్యక్షురాలిగా ఉంటారా అనే చర్చ కూడా మొదలైంది.
Must Read ;- నిరుద్యోగుల బలవన్మరణాలు తెలంగాణ ఉద్యమానికే అవమానం : కేసీఆర్ పై షర్మిల విమర్శలు