తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ అధికారికంగా ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఈ కొత్త పార్టీకి సంబంధించిన వివరాలు ఇప్పటికే వెల్లడైనా.. పేరు, పార్టీ గుర్తు తదితరాలు వెల్లడి కాలేదు. అయితే ఇప్పుడు ఆ వివరాలతో పాటు ఎప్పుడు అధికారికంగా ఎంట్రీ ఇవ్వనుందన్న వివరాలు వెల్లడయ్యాయి. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల నేతృత్వంలో కొత్త పార్టీ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా గడచిన ఐదారు నెలలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి కదా. తాజాగా ఆ పార్టీ ప్రారంభం తేదీని కూడా షర్మిల అధికారికంగా ప్రకటించారు.
వైఎస్సార్ జయంతి రోజుననే..
ఈ నెల 8న తన కొత్త పార్టీని ప్రకటించనున్నట్లుగా షర్మిల శుక్రవారం ప్రకటించేశారు. పార్టీ పేరును యువశక్తి, రైతు రాజ్యం తెలంగాణ పార్టీ(వైఎస్సార్టీపీ) గా ప్రకటించనున్నారు. పార్టీ జెండాను పాలపిట్ట, నీలి రంగులతో రూపొందించనున్నారు. ఇక పార్టీ ప్రారంభోత్సవాన్ని తన తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 8న ప్రారంభించనున్నట్లుగా షర్మిల తెలిపారు. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగే ఈ ప్రారంభోత్సవానికి పార్టీకి చెందిన వెయ్యి మంది ముఖ్య నేతలు హాజరు కానున్నారని పేర్కొన్నారు.
లక్ష మంది పాల్గొంటారట
ఇక పార్టీ ప్రారంభోత్సవానికి కరోనా నిబంధనల కారణంగా స్వల్ప సంఖ్యలోనే పార్టీ నేతలు హైదరాబాద్ కు రానున్నారని,… తెలంగాణలోని పూర్వ ఉమ్మడి జిల్లాల కేంద్రాల నుంచి లక్ష మంది నేతలు, పార్టీ కార్యకర్తలు వర్చువల్ గా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీ ఏర్పాటుకు సంబంధించి షర్మిల ప్రకటన చేయకముందే.. పలు మీడియా సంస్థల్లో దీనిపై ప్రత్యేక కథనాలు రావడం తెలిసిందే. ఈ క్రమంలో పార్టీని అధికారికంగా ప్రకటించడానికి ముందే షర్మిల రంగంలోకి దిగిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు మీడియాల్లో వచ్చిన లీకులు నిజమేనన్నట్లుగా ఈ నెల 8ననే పార్టీని షర్మిల ప్రకటిస్తుండటం గమనార్హం.
Must Read ;- జగన్‌తో షర్మిల ఢీ.. నమ్మశక్యంగా లేదే!