వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు దాటిపోయినా తమకు న్యాయం జరగలేదని వైసీపీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళంలోని ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో వైసీపీ కార్యకర్తలకు పూర్తి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నానని ఆయన అన్నారు. ధర్మాన వ్యాఖ్యలతో స్టేజీపై ఉన్న వైసీపీ నాయకులు అవాక్కయ్యారు. అయితే, వెంటనే విజయసాయిరెడ్డి కల్పించుకుని వైసీపీ కార్యకర్తలకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్మాన శాంతించారని తెలుస్తోంది.
విజయసాయిరెడ్డి భరోసా
ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వెంటనే సమాధానం ఇచ్చారు. ఇప్పటికే 2.5 లక్షల వాలంటీర్ ఉద్యోగాలు వైసీపీ వారికే ఇచ్చామని, రాబోయే కొద్ది రోజుల్లోనే ఉద్యోగ మేళా ఏర్పాటు చేసి వైసీపీ కార్యకర్తలందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ప్రైవేటు కంపెనీల్లో కూడా వైసీపీ కార్యకర్తలను పెద్ద ఎత్తున ప్రవేశ పెట్టాలని భావిస్తున్నట్టు ఎంపీ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.
Must Read ;- పట్టాల పంపిణీలో ‘జిగేలు రాణి’ డాన్సులు..!
సీఎంపై వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ఎమ్మెల్యేల్లో ఉన్న అసంతృప్తి క్రమంగా బయట పడుతోంది. అందరి కంటే ముందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన నెల్లూరు జిల్లా గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వరప్రసాద్, సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మరోసారి విరుచుకుపడ్డారు. జగన్‌రెడ్డి లాగా తాను మోసం చేసి పారిపోనని గూడూరు నియోజకవర్గంలో జరిగిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే వరప్రసాద్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టారు. సీఎంపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేయడంతో వరప్రసాద్ వైసీపీ వీడి బీజేపీలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.
తిరుపతి బీజేపీ అభ్యర్థి వరప్రసాదేనా?
సీనియర్ ఐఏఎస్ అధికారిగా పదవీ విమరణ చేసిన వరప్రసాద్ 2014లో తిరుపతి పార్లమెంటు సభ్యుడిగా వైసీపీ నుంచి గెలిచారు. 2019 ఎన్నికల్లో ఆయనకు గూడూరు అసెంబ్లీ సీటు కేటాయించారు. మంత్రి పదవి కూడా దక్కకపోవడంతో అప్పటి నుంచి వరప్రసాద్ ఆ పార్టీ అధినేతపై రగిలి పోతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి జగన్‌రెడ్డిపై విమర్శలు చేసి వరప్రసాద్ వార్తల్లో నిలిచారు. తిరుపతి ఎంపీ బీజేపీ అభ్యర్థి అయనే అన్న ఊహాగానాలు కూడ వస్తున్నాయి.
Also Read ;- వైసీపీలో ’ఆనం’ ప్రకంపనలు..