యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్..
నిరసనలపై పోలీసుల ఉక్కుపాదం..
నాయకులు, విద్యార్ధి సంఘాల అరెస్ట్..
టిడిపి నేతలు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, పలువురు జనసేన నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..
ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డిని రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం పిలుపునిచ్చిన ఛలో ఆంధ్ర యూనివర్సిటీ ఉద్రిక్తతకు దారితీసింది. అనుమతి లేదంటూ నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాజకీయ నాయకులను, విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు. ఈ నేపధ్యంలోనే ఆందోళనకు బయలుదేరిన టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సహా అఖిల పక్షం నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. క యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.ఐడి కార్డు లేనిదే ఎవరినీ లోనికి అనుమతించని పరిస్థితి యూనివర్సిటీ వద్ద నెలకొంది. దీంతో యూనివర్సిటీకి వచ్చే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే వీసీగా ప్రసాద్ రెడ్డి గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంటెద్దు పోకడలతో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపధ్యంలో అఖిలపక్షం ఈ ఛలో ఆంధ్ర యూనివర్సిటీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.ముఖ్యంగా రీ రీవాల్యువేషన్ పేరుతో వీసీ తనకు అనుకూలమైన కాలీజీలకు మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని అఖిలపక్షం నేతలు ఆరోపిస్తున్నారు. ఇంటర్నల్ ఫండ్స్ పక్కదారి పట్టించడంతో పాటు , మెటీరియల్ ప్రింటింగ్ విషయంలోనూ అవినీతికి పాల్పడుతున్నారని వారు విమర్శిస్తున్నారు. అనేక విషయాల్లోనూ వీసీ ప్రసాద్ రెడ్డి పై అవినీతి ఆరోపణలు ఉన్నా నేపధ్యంలో ఉన్నతాధికారులు ప్రసాద్ రెడ్డి పై విచారణ జరిపి ఆయనను వెంటనే రీకాల్ చేయాలని టిడిపి నేతలు సహా అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.