(విశాఖపట్నం నుంచి వీడియో న్యూస్ ప్రతినిధి)
ఏపి బిల్డ్ పేరుతో విశాఖలో విలువైన భూముల అమ్మకానికి పెట్టింది ఏపీ సర్కార్. అందరూ ఊహించినట్టే విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించి నగరంలో ఉన్న విలువైన భూములను వాళ్ళ అనుచరులకు కట్టబెట్టేందుకు వైసీపీ రంగం సిద్ధం చేసిందన్న ఆరోపణలొస్తున్నాయి.
ఏపి బిల్డ్ పేరుతో విశాఖ నగరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూములు అమ్మకానికి ప్రభుత్వం టెండర్లు పిలవడం దుర్మార్గమ ని,ఈ ప్రయత్నాలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పరిపాలన రాజధానిగా విశాఖను ప్రకటించిన నేపథ్యంలో విశాఖలో అత్యంత విలువైన భూములను వేలానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవడం సరైన చర్య కాదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె వి సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. నేషనల్ బిల్డింగ్స్ కన్స్‌స్ట్రక్షన్ కార్పొరేషన్‌కు స్థలాలు వేలం వేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించి అవినీతి ఆరోపణలు తమ మీదకు రాకుండా జాగ్రత్త పడుతోందని నిపుణులు చెబుతున్నారు.
ఆశ్చర్యకర ఆఫర్లు..
కేవలం 10 శాతం చెల్లిస్తే చాలు మిగతా మొత్తం ఏడాది తరువాత చెల్లించే ప్రతిపాదనలోనే లొసుగు ఉంది. సి ఆర్ జడ్ నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ గతంలో టీడీపీ చేసిన ఒప్పందాలను రద్దు చేసిన వైసీపీ నేడు ఎలా అమ్మకాలకు పెడతారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. పరిపాలన రాజధాని విశాఖను ప్రకటించిన నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని స్థలాల పరిరక్షణకు కృషి చేయాల్సింది పోయి స్థలాలు అమ్మడం దుర్మార్గపు చర్యగా పేర్కొన్నారు.
అద్దె భవనాల్లో ప్రభుత్వ కార్యాలయాలు..
విశాఖలో ఉన్న అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఏళ్ళ తరబడి అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. జిల్లాలో చాలా వరకు ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలు లేవని, ఇలాంటి సమయంలో ఉన్న భూములను ప్రైవేటు వ్యక్తులకు ముఖ్యంగా వైసీపీ నాయకులకు కట్టబెట్టేందుకు ఈ ప్రయత్నం అని అంటున్నారు.
విశాఖ నగరంలో భూములు..
విశాఖ బీచ్ రోడ్‌లో 13.59 ఎకరాల విలువైన భూములతో పాటు మొత్తం 18 ఆస్తుల విక్రయానికి రాష్ట్ర ప్రభుత్వం ‘ మిషన్ బిల్డ్ ఏపీ’ పేరిట ఆసక్తికర సంస్థలు, వ్యక్తుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. లులు గ్రూప్‌తో చేసుకున్న ఒప్పందాన్ని కొత్త ప్రభుత్వం రద్దు చేసి బీచ్ రోడ్డులో స్థలాన్ని ప్రజాప్రయోజనాలకు ఉపయోగిస్తామని ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కమ్యూనిస్టు పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒప్పందాన్ని రద్దు చేసి ఆ భూమిని తమకు కావాల్సిన వారికి అప్పగించాలని చూస్తున్నారని ఆరోపించారు.
మొదటి దశలో 16 ఎకరాలు..
మొదటి దశలో 16 ఎకరాలకు పైగా విక్రయానికి పెట్టారు. రెండోదశలో ప్రభుత్వ కంటి ఆసుపత్రి స్థలం, విశాలాక్షి నగర్ పోలీస్ క్వార్టర్స్, ఆంధ్ర యూనివర్సిటీ, జీవీఎంసీ, రెవెన్యూ స్థలాలను కూడా విక్రయించాలని చూస్తున్నారని, విక్రయాలను అడ్డుకుని తీరుతామని సిపిఎం ప్రకటించింది. విఎంఆర్డిఏను ఒక రియల్ ఎస్టేట్ సంస్థలా మార్చేశారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాం ట్ సహా ప్రభుత్వ రంగ సంస్థలకు విక్రయిస్తూ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో ఉన్న విలువైన భూములను అమ్ముకుంటూ పోతోందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని సిపిఎం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు విక్రయించి ఆర్థిక అవసరాలు తీర్చుకోవడం సమంజసం కాదని హితవు పలికారు. ఈ విక్రయానికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు చేస్తామని వారు హెచ్చరించారు.
Also Read:వైసీపీ కిరాతకులకు గర్భిణీ అన్న కనికరం కూడా లేదు.. అచ్చెన్న











