పురపాలక, నగరపాలక సంస్థ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపిస్తే మొదటి సమావేశంలోనే ఆస్తి పన్ను తగ్గిస్తామంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో 75 పురపాలక, 12 నగర పాలక సంస్థలకు మార్చి 10న ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం మార్చి 14 న వెలువడనున్నాయి. దాంతో మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో చంద్రబాబు నేరుగా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి సిద్ధమయ్యారు. ఈనెల 4 నుండి 8 వ తేదీ వరకు వరుసగా అయిదు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఏప్రిల్ 1 నుండి పట్టణాల్లో , నగరాలలో భారీ ఎత్తున పన్నులు పెంచాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోందని, పురపాలక, నగర పాలక సంస్థల్లో తాము గెలిచిన స్థానాల్లో ఆస్తి పన్ను పెంచమని చంద్రబాబు హామీ ఇచ్చారు.
కార్యకర్తలకు అండగా ఉంటా..
టీడీపీ కార్యకర్తలను వైసీపీ నాయకులు వేధిస్తున్నారని, వైసీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకి పెచ్చుమీరుతున్నాయని, మద్యం సీసాలను టీడీపీ కార్యకర్తల ఇళ్లల్లో పెట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడికి తానే వచ్చి పోరాడతానని చంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఎన్నికలను సవాల్‌గా తీసుకొని అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారు.
Must Read : 4 నుంచి పట్టణాల్లో చంద్రబాబు రోడ్ షో..











