విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ నెల 18న గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆందోళనలు చేయాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై ఉన్న సీబీఐ కేసులు మాఫీ చేయించుకునేందుకే విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రానికి తాకట్టు పెట్టారని చంద్రబాబు ధ్వజమెత్తారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదని ఆయన హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా 90 వేల మంది ఉపాది పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు.
8 వేల ఎకరాలను కాజేసేందుకు స్కెచ్ వేశారు
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడం ద్వారా పరిశ్రమలో మిగులుగా ఉన్న 8 వేల ఎకరాలను కాజేయాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు విమర్శించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తే వేలాది మంది ఉపాధి కోల్పోవడంతోపాటు, అనుబంధ పరిశ్రమలు కూడా మూతపడతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం చేసే చర్యలను ఇప్పటికైనా విడనాడాలని చంద్రబాబు హితవు పలికారు.
Must Read ;- విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు.. కాపాడుకుందాం రండి