( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు పై గత కొన్ని ఏళ్లుగా చాప కింద నీరులా కుట్ర అమలవుతూ వస్తోంది. ఇక్కడ యాజమాన్యాన్ని, పరిశ్రమని నిర్వీర్యం చేసేందుకు ఓ పథకం ప్రకారం కుట్ర జరుగుతూ వచ్చింది అని స్వయంగా వైఎస్సార్సీపీ నేతలు ఇటీవల అంగీకరించడం గమనించదగ్గ విషయం.
విశాఖ ఉక్కుపై ఒడిస్సా అధికారుల పెత్తనం..
గత కొన్నేళ్లుగా విశాఖ ఉక్కులో ఒడిస్సా అధికారుల పెత్తనం కొనసాగుతోంది. దశల వారీగా ఒక్కో డిపార్ట్‌మెంట్‌లలో హెచ్ఓడీలను ఒడిశాకు చెందిన అధికారులను నియమించేందుకు పథకం ప్రకారం స్కెచ్ వేస్తూ వచ్చారు. ఏడు, ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ పన్నాగం… ఒడిశాకు చెందిన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మరింత వేగం పుంజుకుంది. విశాఖ వాసుల కలల కర్మాగారం, ఆంధ్రుల ఉద్యమంతో మొగ్గ తొడిగిన విశాఖ స్టీల్ ప్లాంట్ పై పట్టు సాధించేందుకు పక్కా వ్యూహంతో అడుగులు వేసినట్టు తాజా పరిణామాలతో స్పష్టమైంది.
ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కుట్ర?
“ఒడిశాకు చెందిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్రం పట్ల చేస్తున్న కుట్రలు గమనించాలి” అని స్వయంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు బహిరంగ వేదికపై ఆరోపించారు.
“విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒడిశా అధికారుల పెత్తనం అధికమైంది. అన్ని విభాగాలపై వారి ఆధిపత్యమే కొనసాగుతోంది. తెలుగువారి ప్రాణ త్యాగాలతో నిర్మించుకున్న పరిశ్రమపై వారి పెత్తనం ఏమిటి? ఓ అధికారి 2 వేల కోట్ల స్కాం చేస్తే నేటికీ చర్యలు ఎందుకు తీసుకోలేదు?. ఆ సొమ్ములు ఎందుకు రికవరీ చేయలేదు? కేంద్రం ఆంధ్ర ప్రదేశ్ పట్ల, ఇక్కడి స్టీల్ ప్లాంట్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది ” అని రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి బహిరంగ సభలో విమర్శించారు.
నూరు శాతం నిజం..
వీరు చేసిన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజం. గత కొన్ని ఏళ్లుగా విశాఖ ఉక్కులో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అన్ని శాఖల అధిపతులు ఒడిశాకు చెందిన వారే వుండేలా ప్లాన్ చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్రకు చెందిన సీనియర్ అధికారిని హెచ్ఓడిగా నియమించాల్సి వస్తే.. అటువంటి వ్యక్తిని .. అతని కంటే సీనియర్ ఉన్న విభాగానికి బదిలీ చేశారు. అలా సుమారు 15 మంది హెచ్‌ఓడి పోస్టులకు దూరం కావాల్సి వచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ టాప్ టెన్ అధికారులంతా ఒడిశాకు చెందిన వారు కావడమే ఇందుకు ఉదాహరణ. ఏ ఏ డిపార్ట్మెంట్‌లలో ఒడిశా అధికారులు ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నారో ముందు గానే జాబితా సిద్ధం చేసి.. బదిలీల వ్యూహాన్ని అమలు చేశారు. 2018 – 19 సంవత్సరంలో జరిగిన బదిలీల అవకతవకలపై భారీగా విమర్శలు వచ్చాయి. సీనియర్లను, అర్హులను పక్కకునెట్టి అడ్డగోలు ప్రమోషన్ ఇవ్వడంపై కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. ప్రస్తుతం ప్రైవేటీకరణ అంశం అగ్గిలా రాజుకున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఎవరు కిమ్మనక పోవడం వెనుక ఇదే అసలు కారణమని ఉద్యోగులు బాహాటంగా విమర్శిస్తున్నారు. ఒడిశా అధికారులు పెత్తనంపై ప్రశ్నించినందుకు సామాజిక కార్యకర్త పి రామ అప్పారావు అనే ఉద్యోగిని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం నిర్దాక్షిణ్యంగా తొలగించింది. ఒడిషా అధికారుల పెత్తనంపై ఆయన కొన్నేళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు. ఇన్నేళ్ళ పాటు ఆయన చేసిన ఆరోపణలకు బలం చేకూరుస్తూ వైఎస్ఆర్సీపి నేతలు కూడా అవే విషయాలను ప్రస్తావిస్తున్నారు.
Must Read ;- ప్రైవేటీకరణ అడ్డుకోవాల్సింది నువ్వే..