హుజురాబాద్ ఉపఎన్నిక కోసమే మంత్రులు తెలంగాణ ప్రజల భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ జలయజ్ఞం ద్వారా సాగు నీటి ప్రాజెక్ట్‌లు నిర్మించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అని అన్నారు. రాయలసీమకు అన్యాయం జరిగిందని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అన్నారని, ఏపీకి కేటాయించిన నీటినే తాము వాడుకుంటున్నామని తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తండ్రి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై తెలంగాణ మంత్రులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. వైఎస్సార్ జల దొంగ అని, రాక్షసుడంటూ తెలంగాణ మంత్రులు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై సి.రామచంద్రయ్య స్పందించారు.
కేటాయించిన జలాలనే వాడుకుంటున్నాం
రాయలసీమ ఎత్తిపోతల పథకం చాలా సున్నితమైన అంశమని, దాన్ని తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. కేటాయించిన జలాలనే తాము వాడుకుంటున్నామని, అంతకు మించి వాడుకోవడంగాని, కొత్త ప్రాజెక్టును గాని నిర్మించడం లేదని తెలిపారు. లేని సమస్యను సృష్టిస్తూ ప్రజలను తెలంగాణ మంత్రులు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తమ మంత్రులను కంట్రోల్ చేయాలన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో జలయజ్ఞం ద్వారా లక్షల కోట్ల రూపాయల కేటాయించి సాగు ప్రాజెక్టులకు నిర్మించిన మహానేత దివంగత వైఎస్సార్ అని రామచంద్రయ్య అన్నారు. అలాంటి వైఎస్సార్‌ను నిందించడం, ఆరోపణలు చేయడం దారుణమన్నారు.
చేవెళ్ల నుంచే వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభం
తెలంగాణలోని చేవెళ్ల నుంచే వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించిన విషయాన్ని ఆ ప్రాంత నాయకులు గుర్తు పెట్టుకోవాలన్నారు. అన్ని ప్రాంతాలకు వైఎస్సార్ సాగు నీరు అందించారని గుర్తు చేశారు. వైఎస్సార్‌పై విమర్శలు చేస్తున్న తెలంగాణ మంత్రులు చరిత్ర తెలుసుకోవాలని హితవు పలికారు. ఇప్పటికైనా తెలంగాణ మంత్రులు వాస్తవాలు తెలుసుకుని నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.
Must Read ;- కట్టప్పను మించిపోవాలి.. అప్పుడే అదిరిపోయే ఆఫర్లు










