పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ఒక చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమా కోసం చార్మినార్ సెట్ వేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తోంది. మొదటి నుంచి కూడా క్రిష్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. కెరియర్ తొలినాళ్లలో సందేశం .. సామాజిక స్పృహ కలిగిన కథలను ఎంచుకుంటూ వచ్చిన ఆయన, ఆ తరువాత చారిత్రక చిత్రాలవైపు కూడా మొగ్గుచూపాడు. అలా హిందీలో ఆయన చేసిన ‘మణికర్ణిక’ .. తెలుగులో చేసిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి.
అలాంటి క్రిష్ .. ఈ సారి మరో చారిత్రక చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇది మొఘల్ సామ్రాజ్యం .. కోహినూర్ వజ్రం చుట్టూ తిరిగే కథ అని అంటున్నారు. ఈ సినిమాలో పవన్ ‘వీరమల్లు’ అనే ఒక వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకోవడం కోసం ఆయన ఏం చేశాడు? ఎలా చేశాడు? అనేదే కథ. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్లు వేశారు .. అలాగే చార్మినార్ సెట్ కూడా వేస్తున్నారని తెలుస్తోంది. కీలకమైన ఎపిసోడ్ లో 17వ శతాబ్దం నాటి చార్మినార్ ను చూపించనున్నారట. ఇందుకోసం భారీమొత్తంలో ఖర్చు చేస్తున్నారని అంటున్నారు.
పవన్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో, ఆయన సరసన నాయికగా నిధి అగర్వాల్ కనిపించనుంది. మరో ముఖ్యమైన పాత్రలో జాక్విలిన్ అలరించనుంది. ఈ సినిమాలో అక్బర్ చక్రవర్తి పాత్ర కూడా కీలకమైనదిగా కనిపిస్తుందట. అందువలన ఆ పాత్రకిగాను బాలీవుడ్ హీరో ‘అర్జున్ రామ్ పాల్’ ను తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విడుదల చేయనున్నారు. రీ ఎంట్రీ తరువాత పవన్ చేస్తున్న భారీ సినిమా ఇదే కావడంతో, సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి.