విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు..ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. అన్ని పార్టీలతో టచ్‌లో ఉండే వ్యక్తిగా పేరుంది. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. తన ఎమ్మెల్యే పదవికి షరతులో కూడిన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఆ రాజీనామా ఏ ఫార్మాట్‌లో ఉందనే విషయం పక్కన బెడితే.. అసలు రాజీనామాకు కారణం ఏంటి? రాజీనామా నిర్ణయం వెనుక ఎవరున్నారనే చర్చ నడుస్తోంది. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలోనూ పలు అంశాలు ప్రచారంలో ఉన్నాయి.
గంటా రాజకీయ చరిత్ర ఇదీ
గంటా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే..వ్యాపారవేత్తగా ఉన్న గంటా శ్రీనివాసరావు 1999లో అనకాపల్లి నుంచి టీడీపీ ఎంపీగా గెలిచారు. 2004లో చోడవరం నుంచి టీడీపీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో అనకాపల్లి నుంచి పీఆర్పీ నుంచి గెలిచారు. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో ఆయన కాంగ్రెస్‌కు రావాల్సి వచ్చింది. అప్పట్లో కిరణ్ కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా పని చేశారు. రాష్ట్ర విభజన తరువాత టీడీపీలో చేరారు. భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినా విశాఖపట్నం నార్త్ నియోజకవర్గం నుంచి గంటా ఎమ్మెల్యేగా గెలుపొందారు. కొన్నాళ్ల తరవాత టీడీపీతో దూరంగా ఉంటున్నారు. ఆ మధ్య వైసీపీలో చేరాతారన్న ప్రచారం జరిగింది. అయితే ఏపీ మంత్రి అవంతి అందుకు అడ్డచెప్పడంతోపాటు కొందరు సన్నిహితుల నుంచి వచ్చిన సూచనల ప్రకారం సైలెంట్ అయ్యారు గంటా. తాజాగా విశాఖ స్టీల్ ఇష్యూలో రాజీనామా చేశారు. ఇక్కడే అసలు వ్యవహారం నడిచిందని చర్చ నడుస్తోంది.
Must Read ;- గంటా టైమింగ్.. వైసీపీ డైరెక్షన్..
చిరంజీవి కోసం..
కాగా గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవికి ఆప్తుడిగా పేరుంది. గంటా కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు కూడా మెగాస్టార్‌తో కలిసి పలు చోట్ల జరిగే కార్యక్రమాలకు హాజరయ్యారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాకు, అప్పటి మంత్రిగా ఉన్న గంటాకు ఇదే విషయంపై చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగిన విషయం గమనించవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో చిరంజీవి స్టూడియో నిర్మించేందుకు భూములు కేటాయించాలనే ప్రతిపాదన కూడా గంటా తెచ్చినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక.. చిరంజీవి, నాగార్జునలు సీఎం జగన్‌ని కలిశారు. భూములు కేటాయించాలని కోరినట్లు ప్రచారం జరిగింది. తరువాత చిరంజీవిని సీఎం జగన్ లంచ్‌కు ఆహ్వానించారు. ఆ కార్యక్రమానికి గంటా వెళ్తారని ప్రచారం జరిగినా.. చిరంజీవి దంపతులు మాత్రమే వెళ్లారు. అయితే తిరుగు ప్రయాణంలో గంటా చిరంజీవిని కలిశారు. ఇక చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ టీడీపీతో కలసిన సమయంలోనూ గంటా కొంత దూరం పాటించేవారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అంటే కేవలం చిరంజీవితో మాత్రమే గంటాకు సంబంధాలున్నట్లు తెలుస్తోంది.
మార్గదర్శకత్వం ఎవరిదంటే..
తాజాగా గంటా శ్రీనివాస్ ఇటీవలే రాజీనామా చేసినా..కొన్నాళ్లుగా టీడీపీకి దూరంగానే ఉంటున్నారు. తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప.. పార్టీ కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. ఇందుకు చిరంజీవి సూచనలే కారణమనే ప్రచార జరుగుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే..చిరంజీవి తరఫున కార్యకలాపాలు చక్కబెట్టే బాధ్యతను గంటా తీసుకున్నారని తెలుస్తోంది. గంటా వైసీపీలో చేరే విషయంలో చిరంజీవి మార్గదర్శకత్వం ఉందని చెబుతున్నారు. రెండు నెలలుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో..వైసీపీలోని కీలకనేతతో చిరంజీవి, గంటా కలసి మాట్లాడారని, అందులో భాగంగానే అటు టీడీపీని దెబ్బతీయడం, తమ పనులకు ఇబ్బంది రాకుండా చూడడం, వైసీపీలో అసమ్మతిని తగ్గించడం లక్ష్యంగా ఇప్పుడు రాజీనామా చేశారని భావిస్తున్నారు.
విశాఖ భూములపై నివేదికలిచ్చినా..
గంటా శ్రీనివాసరావు మంత్రిగా ఉన్న సమయంలోనే విశాఖలో ప్రభుత్వ భూముల స్కాంకి సంబంధించి ప్రత్యేక కమిటీ (సిట్ ) ఏర్పాటైంది. విచారణ చేసి నివేదిక కూడా ఇచ్చింది. ఆ నివేదిక బయటకు రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కూడా విచారణ జరిపింది. ఆ కమిటీ నివేదిక కూడా బయటకు రాలేదు. ఇందుకు బలమైన రాజకీయ ఒత్తిళ్లు ఉన్నట్లు అప్పట్లోనే ప్రచారం జరిగింది. అయితే, గంటా ప్రస్తుతం తీసుకుంటున్న నిర్ణయాలకు, సదరు భూముల నివేదికకు ఏమైనా సంబంధం ఉందా అనేది తేలాల్సి ఉంది.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారా లోకేష్