మర్రి రాజశేఖర్.. ఈ పేరు తెలియని జనం ఏపీలో ఉండరంటే అతిశయోక్తి కాదు. ఇంత పాపులారిటీ సాధించిన మర్రి రాజశేఖర్ మంత్రిగానో, వరుసబెట్టి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో గెలిచిన నేత ఏమీ కాదు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతిలో ఎప్పటికప్పుడు వంచనకు గురవుతున్న నేత మర్రి రాజశేఖర్. వరుసగా వంచనకు గురవుతున్నా.. జగన్ వైపు ఆశగా ఎదురు చూస్తున్న నేతగా మర్రి రాజశేఖర్‌కు మంచి గుర్తింపు లభించిందనే చెప్పాలి. వైసీసీ ప్రారంభం నాటి నుంచి కూడా జగన్ వెంట నడిచిన అతి కొద్ది మందిలో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో నిలిచే నేత కిందే లెక్క. జగన్‌తోనే కాకుండా జగన్ తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికీ వెన్నుదన్నుగా నిలిచిన నేతగా మర్రికి గుర్తింపు ఉంది. అటు వైఎస్సార్ వెంట నడిచి ఓ దఫా ఎమ్మెల్యేగా గెలిచిన మర్రి.. జగన్ వెంట నడిచిన కారణంగా ఒక్కటంటే ఒక్కసారి కూడా చట్టసభ ముఖం చూడకపోవడం గమనార్హం. 2019 ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి వైసీపీ అభ్యర్థిగా కార్యరంగం మొత్తం పూర్తి చేసుకున్న మర్రికి జగన్ హ్యాండిచ్చేశారు. అప్పుడే కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజనీకి సీటు ఇస్తున్నామని, భవిష్యత్తులో ఎమ్మెల్సీతో పాటుగా మంత్రి పదవి కూడా ఖాయమంటూ జగన్ చెప్పడంతో మర్రి మిన్నకుండిపోయారు. అయితే జగన్ ఇచ్చిన మాట ఇప్పటికీ నెరవేరకపోగా.. మర్రి మాత్రం వంచనకు గురవుతున్న నేతగా ఓ కొత్త గుర్తింపు సంపాదించుకున్నారు.
అందరికీ వస్తున్నా.. ‘మర్రి’కి రాదే
2014 ఎన్నికల్లో వైసీపీ విపక్షానికి పరిమితమైనా పలు ఎమ్మెల్సీ పదవులు దక్కాయి. అయితే 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన మర్రి.. 2019 ఎన్నికలపై దృష్టి పెట్టడంతో ఎమ్మెల్సీ పదవి కోసం అసలు ఆశ పడలేదు. అయితే 2019లో విడదల రజనీ రూపంలో మర్రికి దెబ్బ పడిపోయింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి కోసం మర్రి ఎదురు చూడక తప్పడం లేదు. 2019 ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన జగన్.. ఆ తర్వాత దఫదఫాలుగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇతరులకు, మర్రి కంటే జూనియర్లకు కూడా ఎమ్మెల్సీ పదవులు దక్కుతున్నాయి గానీ.. మర్రికి మాత్రం ఎందుకనో వంచనే పలకరిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారీ మర్రి పేరు తెర మీదకు రావడం, ఆ వెంటనే ఆ పేరు జాబితా నుంచి తొలగిపోవడం, మర్రి నిరాశకు గురి కావడం జరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న గవర్నర్ కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ అయితే.. వాటిలో కూడా మర్రికి చోటు దక్కలేదు. ఈ దఫా మర్రికి పదవి గ్యారెంటీ అని పెద్ద ఎత్తున వార్తలు వినిపించినా.. వాటిన్నింటినీ జగన్ వమ్ము చేసేసి.. మర్రిని మరోమారు వంచించారు. మర్రి కంటే జూనియర్లు అయిన లేళ్ల అప్పిరెడ్డితో పాటు మోషేన్ రాజు, రమేశ్ యాదవ్‌లకు పదవులు ఇచ్చిన జగన్.. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో చేరిన తోట త్రిమూర్తులు కంటే కూడా మర్రిని తక్కువ చేసి చూశారు. తోటకు పదవి ఇచ్చిన జగన్.. మర్రికి మాత్రం మొండిచేయి చూపారు.
ఆ మూడూ సీమకేనా?
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైపోయింది. ఏపీలో ఎమ్మెల్యే కోటాలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ కానున్నాయి. వీటిలో జగన్ సొంత జిల్లా కడపకు చెందిన డీసీ గోవిందరెడ్డితో పాటు టీడీపీకి చెందిన మహమ్మద్ షరీఫ్, బీజేపీకి చెందిన సొము వీర్రాజుల పదవీ కాలం ముగిసింది. ఈ మూడు స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికల కమిషన్ ఆదివారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న ఈ మూడు స్థానాల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అసెంబ్లీలో ఆయా పార్టీల బలాబలాను పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మూడు స్థానాలూ వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. అంటే తనకు చెందిన ఓ సీటుతో పాటు ఇతర పార్టీల రెండు సీట్లు కూడా వైసీపీకే దక్కనున్నాయి. మరి ఈ మూడు స్థానాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయాలి కదా. ఇందులో భాగంగా రిటైర్ అయిపోయిన డీసీ గోవింద రెడ్డికి టికెట్ కేటాయించిన జగన్.. మిగిలిన రెండు స్థానాలను కూడా రాయలసీమ ప్రాంతానికే చెందిన నేతలతోనే భర్తీ చేయనున్నట్లుగా సమాచారం. తన సొంత సామాజిక వర్గానికి చెందిన డీసీ గోవింద రెడ్డికి వరుసగా రెండో సారి అవకాశం కల్పించేందుకు సిద్ధపడిన జగన్.. ఎప్పటినుంచో పదవి కోసం ఎదురు చూస్తున్న తన సామాజిక వర్గానికి చెందని మర్రిని మాత్రం మరోమారు పక్కనపెట్టేశారు. మొత్తంగా పార్టీ కోసం, పార్టీ అధినేత మాట కోసం పదవినే త్యాగం చేసేసిన మర్రి రాజశేఖర్ మరోమారు వంచనకు గురైపోయారన్న మాట.
Must Read ;- బాబు తీరు మారాలంటున్న సునీత