ఏపీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు.. టీడీపీ కేంద్ర కార్యాలయం, జిల్లాల కార్యాలయాలు, కీలక నేతల ఇళ్లపై వైసీపీ చేసిన దాడులపై కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీకి వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పర్యటనను నిష్ఫలం చేసేందుకు వైసీపీ యత్నిస్తోందంటూ ‘బాబుకు బ్రేకులే జగన్ లక్ష్యం’ శీర్షికన ‘లియో’ ప్రచురించిన కథనం అక్షర సత్యమని తేలిపోయింది. ఓ వైపు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీలు పలువురు కేంద్రం పెద్దలను కోరుతూ సాగితే.. చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఎలా ఇస్తారు? ఆ పార్టీ నేతలు సీఎం జగన్‌ను ఎలా బూతులు తిట్టారో చూడండి అంటూ వైసీపీ ఎంపీలు ఆయా కేంద్రం పెద్దల వెంట పడ్డారు. ఈ దిశగా ఎప్పటినుంచి వైసీపీ నేతలు యత్నాలు సాగించారో తెలియదు గానీ.. చంద్రబాబు హైదరాబాద్ తిరిగి వచ్చాక.. గురువారం నాడు ఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్థాయి సంఘ సమావేశానికి హాజరైన అమిత్ షా.. ఆ భేటీ ముగించుకుని బయటకు వస్తున్న సందర్భంగా కెమెరాలకు అడ్డంగా బుక్కైపోయారు.
అటు కనకమేడల.. ఇటు గోరంట్ల
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని ముగించుకుని కేంద్ర హోం శాఖ మంత్రి వెళ్లిపోతున్న సమయంలో చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఆయనను అభ్యర్థించారు. ఈ సందర్భంగా కనకమేడల చెప్పిన అంశాలన్నింటినీ అమిత్ షా సావదానంగానే విన్నారు కూడా. అయితే కనకమేడలను ఆది నుంచి వెన్నంటి సాగుతున్నట్లుగా కనిపించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. అమిత్ షాకు రెండో వైపున చేరిపోయారు. ఓ వైపు కనకమేడల చెబుతున్న అంశాలను అమిత్ షా ఆసక్తిగా వింటూ ఉంటే.. ఆయన దృష్టిని మరల్చేందుకు గోరంట్ల తనదైన శైలి యత్నాలు చేశారు. ఈ సందర్భంగా తన చేతిలోని ఫిర్యాదు ప్రతిని పదే పదే అమిత్ షా ముందుకు జరిపే యత్నం చేశారు. అయినా కూడా కనకమేడల చెప్పే విషయం మొత్తం విన్న తర్వాత.. కనకమేడల ఇక తాను చెప్పదలచుకున్న విషయం ముగిసిందన్న రీతిలో అమిత్ షాకు నమస్కారం పెట్టేసి పక్కకు తప్పుకున్నారు. ఆ తర్వాతే గోరంట్ల వైపు చూసిన అమిత్ షా.. ఏమిటంటూ అడిగారు. అప్పుడు తన చేతిలోని ఫిర్యాదు ప్రతిని అమిత్ షాకు అందించిన గోరంట్ల.. టీడీపీ నేతలు సీఎం జగన్‌ను దుర్భాషలాడారంటూ ఆరోపించారు. టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. గోరంట్ల ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న అమిత్ షా చూద్దాంలే అంటూ సంజ్ఞ చేశారు. ఈ మొత్తం తతంగం చూస్తుంటే.. చంద్రబాబుకు ఎక్కడ అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తారోనన్న భయంతోనే టీడీపీ నేతలను వెన్నంటే వైసీపీ నేతలు సాగారని తేలిపోయినట్టే కదా.
బీజేపీ నేతలపైనా విమర్శలు
ఇదిలా ఉంటే.. ఆది నుంచి టీడీపీలో కొనసాగిన పలువురు ఎంపీలు 2019 ఎన్నికల తర్వాత టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయిన సంగతి తెలిసిందే కదా. వీరిలో చంద్రబాబుతో అత్యంత సన్నిహితంగా మెలగిన సీఎం రమేశ్, సుజనా చౌదరీలూ ఉన్నారు. పార్టీ మారిన తర్వాత వారిద్దరూ బీజేపీతోనే సాగుతున్నారు తప్పించి.. టీడీపీ నేతలతో అసలు కనిపించడమే లేదు. అయితే సుజనా, సీఎం రమేశ్‌లు చంద్రబాబుకు అపాయింట్ మెంట్ ఇచ్చేలా అమిత్ షా వద్ద చక్రం తిప్పుతున్నారంటూ వైసీపీ నేతలు వరుసగా మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. ఈ విమర్శలు కూడా బూమరాంగ్ అయ్యాయి. బీజేపీ నేతలుగా ఉంటూ చంద్రబాబుకు అపాయింట్ మెంట్లు ఎందుకు ఇప్పిస్తారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై ఇటు బీజేపీ శ్రేణులతో పాటు అటు టీడీపీ శ్రేణులు కూడా విరుచుకుపడుతున్నాయి. మొత్తంగా చంద్రబాబు ఢిల్లీ టూర్ సక్సెస్ కాకుండా వైసీపీ ఏ మేర యత్నించిందన్న విషయం మాత్రం జనాలకు విస్పష్టంగా అర్థమైపోయింది.
Must Read ;జగన్ గ్రానైట్ ఫైన్లు సరికాదంతే!