ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన మహిళా నేత, గుంటూరు జిల్లా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజనీ.. నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటున్న వైనం తెలిసిందే. 2019 ఎన్నికలకు కాస్తంత ముందుగా రాజకీయాల్లోకి వచ్చినా.. తన నియోజకవర్గంలో అప్పటిదాకా వైసీపీకి పెద్ద దిక్కుగా ఉంటున్న మర్రి రాజశేఖర్‌ను కాదని ఎమ్మెల్యే టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో విక్టరీ కొట్టేశారు. ఆ తర్వాత కూడా ఏమాత్రం దూకుడు తగ్గించకుండా సాగిన రజనీ.. జనంలో మంచి క్రేజ్ అయితే తెచ్చుకున్నారు. ఆ క్రేజీకి తగ్గట్టుగానే ఆమెకు ఏపీతో పాటు తెలంగాణలోనూ ప్రత్యేకంగా అభిమానులు అంటూ ఎంట్రీ ఇచ్చారు. మొన్నామధ్య తెలంగాణకు చెందిన ఓ యువకుడు విడదల రజనీ బొమ్మను తన చేతిపై పచ్చబొట్టు వేయించుకుని మరీ చిలకలూరిపేటలో ప్రత్యక్షమై ఆశ్చర్యపరిచాడు. ఆ వార్త తెగ వైరల్ అయిపోయింది. తాజాగా అలాంటి ఓ వార్తే మరొకటి బయటకు వచ్చింది. అయితే తాజా వీడియో మాత్రం రజనీ పరువును బజారుకీడ్చేదిగా ఉండటమే ఆసక్తి రేకెత్తిస్తోంది.
అసలేమైందంటే..?
విడదల రజనీ ప్రాతినిధ్యం వహిస్తున్న చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన బిరుదు అనంతబాబు ఫ్యామిలీ ఆది నుంచి వైఎస్ జగన్ వెంటే నడిచింది. జగన్ సీఎం కావాలని కలలు గన్న, కష్టపడిన ఫ్యామిలీగానూ అనంతబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరు అన్న విషయాన్ని ఏనాడూ పట్టించుకోని అనంతబాబు తన సోదరుడితో కలిసి రజనీ గెలుపు కోసం తనవంతు కృషి చేశారు. రజనీ తరఫున ఎన్నికల్లో ఏజెంట్‌గానూ కూర్చున్నారట. అయితే ఆ తర్వాత అనంతబాబును రజనీ పట్టించుకోకపోగా.. అతడికి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి కొమ్ము కాశారట. అంతేకాకుండా ఇటీవలే అనంతబాబు, అతడి సోదరుడిపై కత్తులతో దాడి జరిగింది. ఇద్దరికీ 22 కుట్ల మేర తీవ్రగాయాలయ్యాయి. ఆ తర్వాత ఎలాగోలా ఆ దాడి నుంచి తప్పించుకున్న అనంతబాబు సోదరులు.. చికిత్స తీసుకుని తమపై జరిగిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారట. అయితే ఎమ్మెల్యే అనుమతి లేకుండా కేసు బుక్ చేయని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తమ తల్లిని తీసుకుని నేరుగా రజనీ వద్దకే అనంతబాబు సోదరులు వెళ్లారట. అయితే అనూహ్యంగా రజనీ దాడి చేసిన వారికే మద్దతు పలికి.. కేసులు నమోదు చేయిస్తానంటూ అనంతబాబు సోదరులకు చెప్పి వారిని అక్కడి నుంచి పంపించివేసి ఆ తర్వాత దాడి చేసిన వారిపై కేసులు వద్దంటూ పోలీసులకు చెప్పారట. ఈ విషయం రజనీ పీఏ ద్వారా తెలుసుకున్న అనంతబాబు సోదరులు నిందితులపై కేసులు పెట్టాలంటూ జిల్లా ఎస్పీ, కలెక్టర్లను కలిశారట. అయితే అక్కడ కూడా రజనీ అనుమతి లేకుండా కేసులు నమోదు చేయలేమంటూ అధికారులు చేతులెత్తేశారట.
ఆత్మహత్యే శరణ్యమని సెల్ఫీ వీడియో
దాడిలో గాయాలపాలై తాము ఇబ్బందులు పడుతూ ఉంటే.. ఇప్నటికీ తమ ప్రత్యర్థుల నుంచి బెదిరింపులు ఎదురవుతున్న నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లో అనంతబాబు సోదరులు తమకు ఆత్మహత్యే శరణ్యమని నిర్ధారించుకున్నారట. అయితే వారిద్దరికీ ఇద్దరేసి పిల్లలున్న నేపథ్యంలో తల్లి సూచన మేరకు తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ.. తమకు న్యా యం జరక్కపోతే ఆత్మహత్య చేసుకుంటామని వారు ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తమకు జరిగిన అన్యాయాన్ని వివరించిన అనంతబాబు సోదరులు.. దాడిలో తమకు అయిన గాయాలను కూడా చూపెట్టారు. దాడి జరిగిన తీరు, కేసు నమోదుకు పోలీసులు విముఖత, రజనీ, ఆమె పీఏ చేసిన వ్యాఖ్యలను తెలుపడంతో పాటుగా వారంలోగా తమకు న్యాయం జరగకపోతే ఒంటిపై కిరోసిన్ పోసుకుని సామూహిక ఆత్మహత్యకు పాల్పడతామని వారు చెప్పుకొచ్చారు. రజనీ ఎలాగూ తమకు వ్యతిరేకంగా ఉన్నారని, కనీసం తాము అభిమానించే జగన్ అయినా తమకు న్యాయం చేయాలని వారు కోరారు. ఈ వీడియోలో తన ఇద్దరు కుమారులకు జరిగిన అన్యాయాన్ని చెబుతూ అనంతబాబు సోదరుల తల్లి వేడుకున్న తీరు కన్నీళ్లు తెప్పిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వీడియో వారికి ఏ మేర న్యాయం చేస్తుందో చూడాలి.
Must Read ;- జగన్ జమానాలో ప్రజాస్వామ్యం ఖూనీ











