ఆంగ్లేయుల కబంద హస్తాల నుంచి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన రోజు ఆగస్టు 15. అంటే దేశానికి విముక్తి కలిగిన రోజన్న మాట. ఈ సందర్భంగా ఏటా దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ వేడుకలకు కులం, మతం, వర్గం, ప్రాంతం అన్న బేధాలే లేకుండా జరుగుతున్న తీరు అబ్బురపరచేదే. ఈ వేడుకల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా తమదైన శైలిలో సరికొత్తగా దేశ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహిస్తున్నాయి.
ఢిల్లీలో ఘనంగా వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా వేడుకలు జరిగాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రాత్రే రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాజాగా ఆదివారం ఉదయం ఎర్రకోటపై నుంచి దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. రానున్న 25 ఏళ్లను అమృత ఘడియలుగా పేర్కొంటూ ప్రధాని చేసిన ప్రసంగం యావత్తు దేశ ప్రజలను ఆకట్టుకుందనే చెప్పాలి.
తెలుగు రాష్ట్రాల్లో వేడుకలు
తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని చోట్లా ఘనంగా వేడుకలు జరిగాయి. విజయవాడలో జరిగిన వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి కీలక ప్రసంగం చేశారు. అదే సమయంలో ఏపీ బీజేపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు, జనసేన కార్యాలయంలో పవన్ కల్యాణ్ జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఇటు తెలంగాణలోనూ జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా పీసీసీ బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మొత్తంగా దేశవ్యాప్తంగా ఆదివారం స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు మిన్నంటాయి.
Must Read ;- మువ్వన్నెలకు మూడు తరాల వందనం!